వన్డే క్రికెట్‌ చరిత్రలో ధావన్‌ ఒక్కడే.. | Sakshi
Sakshi News home page

వన్డే క్రికెట్‌ చరిత్రలో ధావన్‌ ఒక్కడే..

Published Sun, Feb 11 2018 12:40 PM

dhawan the first India opener in 17 years to hit a ton against South Africa in their soil - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో నాల్గో వన్డేలో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో వందో వన్డే మ్యాచ్‌ ఆడుతున్న ధావన్‌ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా వందో వన్డేలో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. సఫారీలతో నాల్గో వన్డేలో 99 బంతుల్లో శతకం సాధించిన తర్వాత కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

వందో వన్డేలో మూడంకెల వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఓవరాల్‌ క్రికెటర్లలో ధావన్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.  అంతకుముందు గ్రీనిడ్జ్‌, కెయిన్స్‌, మొహ్మద్‌ యూసఫ్‌, క్రిస్‌ గేల్‌, సంగక్కరా, ట్రెస్కోథిక్‌, శర్వాన్‌, వార్నర్‌లు వందో వన్డేలో శతకం సాధించిన ఆటగాళ్లు. అయితే ఇక్కడ ధావన్‌ అరంగేట్రం వన్డే మ్యాచ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌ చేరి, వందో మ్యాచ్‌లో శతకం బాదడం విశేషం. ఇలా వన్డే క్రికెట్‌ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్‌లో సున్నా పరుగులకే అవుటై, వందో మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన ఏకైక క్రికెటర్‌గా ధావన్‌ గుర్తింపు సాధించాడు. 2010 ఆస్ట్రేలియాతో విశాఖపట్టణంలో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ధావన్‌ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. ఆ మ్యాచ్‌లో రెండు బంతులు ఆడిన ధావన్‌.. మెక్‌కే బౌలింగ్‌లో అవుటై నిరాశపరిచాడు. ఇదిలా ఉంచితే, అరంగేట్రం మ్యాచ్‌లో ఒక పరుగు, వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన క్రికెటర్‌ మాత్రం క్రిస్‌ గేల్‌.1999లో భారత్‌తో టొరొంటో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన గేల్‌ పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు.


17 ఏళ్ల తర్వాత తొలి భారత ఓపెనర్‌..

నిన్నటి మ్యాచ్‌లో భారత్‌ ఓటిమి పాలైనప్పటికీ శిఖర్‌ ధావన్‌కు మాత్రం కొన్ని మధుర జ్ఞాపకాల్ని మిగిల్చింది. వందో మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు పలు ఘనతల్ని ధావన్‌ సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై 14 ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్‌కు ఆ జట్టుపై మూడో సెంచరీ. కాగా, వారి గడ్డపై ఆరు ఇన్నింగ్స్‌లు తర్వాత ధావన్‌ తొలి శతకం సాధించడం మరో విశేషం. అయితే 17 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో వారిపై సెంచరీ చేసిన తొలి భారత​ ఓ‍పెనర్‌ ధావన్‌. 2001లో సఫారీ గడ్డపై గంగూలీ, సచిన్‌ టెండూల్కర్‌లు ఒకే మ్యాచ్‌లు సెంచరీలు సాధించిన తర్వాత ఏ ఒక్క భారత ఓ‍పెనర్‌ కూడా అక్కడ శతకాలు సాధించలేదు. దాన్ని తాజాగా  ధావన్‌ సవరించాడు.

Advertisement
Advertisement