బీజేపీ దూకుడుపై తర్జనభర్జన | Uttam Kumar Reddy talks with seniors on BJP | Sakshi
Sakshi News home page

కమలానికి కళ్లెం ఎలా?

Aug 25 2019 3:12 AM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy talks with seniors on BJP  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ప్రదర్శిస్తోన్న దూకుడు కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో గబులు పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఆకాంక్షతో బీజేపీ అధిష్టానం రాష్ట్రం లో వేస్తున్న రాజకీయ ఎత్తులను ఎలా చిత్తు చేయాలన్న దానిపై ఆ పార్టీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లోని సీనియర్లు, ముఖ్య నేతలను టార్గెట్‌ చేసి వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు కమలనాథులు చేస్తున్న తెర వెనుక ప్రయత్నాలను అడ్డుకోవడం ఎలా అన్న దానిపై టీపీసీసీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఉన్న బంధాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే వ్యూహం ద్వారానే తమకు కలిగే ముప్పును నివారించుకోగలమనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.  

కారు.. కమలం బంధంపైనే.. 
రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వేగాన్ని ఎలా అడ్డుకోవాలనే దానిపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ పార్టీ సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నారు. ముఖ్య నేతలు, కేడర్‌తో ఆయన తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు. బీజేపీ తమకు ప్రత్యామ్నాయం కాలేదనే వాదనను బలంగా వినిపిస్తూ నే కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ల బంధాన్ని టార్గెట్‌గా చేసుకుని ముందుకెళ్లాలని ఆయన పార్టీ నేతలకు సూచిస్తున్నారు. కేంద్రంలో అధికార బీజేపీకి టీఆర్‌ఎస్‌ గత ఐదేళ్లుగా అన్ని విషయాల్లో మద్దతిచ్చిన తీరును ప్రజలకు చెప్పాలని, క్షేత్రస్థాయిలో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పార్టీ నేతలకు నిర్దేశించారు. మొదటి విడత అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని, మిషన్‌ భగీరథ ప్రారంభానికి ఏకంగా ప్రధాని మోదీ వచ్చారని, ఇప్పుడు అధికారమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు వివరించాలని చెబుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల బంధంపై పోస్టింగ్‌లు పెంచాలని సూచించారని సమాచారం. 

అప్పుడలా... ఇప్పుడిలా 
రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని తాము ఆరేళ్లుగా చెబుతున్నా పట్టించుకోకుండా అకస్మాత్తుగా ఇప్పుడు అవినీతి అంశాన్ని బీజేపీ లేవనెత్తడాన్ని తమకు పాజిటివ్‌గా మలచుకునేందుకు కూడా టీపీసీసీ నేతలు యత్నిస్తున్నారు. బీజేపీ నేతలు చెబుతున్నట్లు రాష్ట్రంలో అవినీతి జరిగితే గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎలా మెచ్చుకున్నారని ప్రశ్నిస్తున్న ఆ పార్టీ నేతలు, ఆ ఆరోపణల్లో చిత్తశుద్ధి ఉంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ దూకుడు రాజకీయంగా తమకు మేలు చేస్తుందనే అంచనా కూడా కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. బీజేపీ పుంజుకుంటే టీఆర్‌ఎస్‌కే నష్టమని, అది తమకు మేలు చేస్తుందనే అభిప్రాయం కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి వలసలు జరిగితే మాత్రం నష్టం జరుగుతుందని, వీలైనంత మేర వలసలు లేకుండా జాగ్రత్త పడాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement