హిందూదేశంగా మార్చే ఆలోచనే!  | Sakshi
Sakshi News home page

హిందూదేశంగా మార్చే ఆలోచనే! 

Published Mon, Aug 26 2019 3:34 AM

CPI Leader D Raja Comments On BJP Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ప్రభుత్వం.. మతోన్మాద విధానాలు, ఫాసిస్ట్‌ ఆలోచనా ధోరణులతో భారత్‌ ను హిందూదేశంగా మార్చే లక్ష్యంతోనే ఆర్టికల్ 370ను రద్దు చేసిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ధ్వజమెత్తారు. నియంతృత్వ వైఖరి, అప్రజాస్వామిక పద్ధతుల్లో విపక్షాలపై ఒత్తిడి తెచ్చి చేస్తున్న ఇలాంటి రాజకీయాలు ఇదేవిధంగా కొనసాగితే పార్లమెంట్‌ అస్తిత్వం నిరర్థకంగానే మిగిలిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ కొనసాగాల్సిన ఆవశ్యకత ఉన్నందున బీజేపీ, ఆరెస్సెస్‌లపై, మతోన్మాద, ఫాసిస్ట్‌ శక్తులపై వామపక్ష, ప్రజాస్వామ్యశక్తులు రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రాధాన్యతలను గుర్తెరిగి ఆయా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాస్వామ్యశక్తులు, ప్రజలను ఏకం చేసి, సామాజిక అణచివేతలు, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

ఆదివారం మఖ్దూంభవన్‌లో పార్టీ అగ్రనేత ఇంద్రజిత్‌గుప్తా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ‘ఆర్టికల్‌ 370 రద్దు–కశ్మీర్ పరిణామాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో రాజా ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ ప్రధాని మోదీ తప్పుడు విధానాల వల్ల భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక అంశంగా ఉండాల్సిన జమ్మూకశ్మీర్ సమస్య అంతర్జాతీయాంశంగా మారిందని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదాను కోల్పోయిందని, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిందని, కేంద్ర ప్రత్యక్ష పాలన కిందరకు రావడం ద్వారా.. అక్కడి ప్రజలు గతంలో పొందిన వివిధ హక్కులను కోల్పోయారన్న విషయాన్ని గ్రహించాలన్నారు.

ఈ ఆర్టికల్ రద్దు తర్వాతే భారత్‌లో కశ్మీర్‌ భాగస్వామి అయినట్టుగా బీజేపీ, ఆరెస్సెస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమే కాకుండా ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లకు ‘ఇస్లామియో ఫోబి యా’ పట్టుకుందని రాజా ఎద్దేవా చేశారు. సదస్సు కు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఇష్టా రీతిన ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అజీజ్‌ పాషా, గుండా మల్లేష్, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ, ఎన్‌.బాలమల్లేష్, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. 

సురవరానికి రాజా పరామర్శ 
సీపీఐ మాజీ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డిని డి.రాజా పరామర్శించారు. గుండెకు సంబంధించిన చికిత్స తీసుకుని కోలుకుంటున్న సురవరంను కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో జరిగే రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొన్నాక రాజా ఢిల్లీకి ప్రయాణమవుతారు.  

రాజాకు ఘనస్వాగతం 
చాడ వెంకటరెడ్డి, అజీజ్‌ పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్య పద్మ పుష్పగుచ్ఛాలతో రాజాకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ర్యాలీగా మఖ్దూంభవన్‌ వరకు తీసుకొచ్చారు. మఖ్దూంభవన్‌లో టీ–మాస్‌ చైర్మన్‌ ప్రొ.కంచ ఐలయ్య, కాకి మాధవరావు రాజాతో భేటీ అయ్యారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement