అధీర్‌ వ్యాఖ్యలతో ఇరకాటంలో కాంగ్రెస్‌ 

Congress in trouble with Adhir comments - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుపై లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్‌ సభ్యుడు అధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి. జమ్మూ కశ్మీర్‌ అంశం అంతర్గత వ్యవహారామా..? లేక ద్వైపాక్షిక అంశమా స్పష్టతివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘ఇది అంతర్గత వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 1948 నుంచి కశ్మీర్‌ పరిణామాలను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో సిమ్లా ఒప్పందం, లాహోర్‌ డిక్లరేషన్‌లపై సంతకాలు చేసిన నేపథ్యంలో అది అంతర్గత వ్యవహారం ఎలా అవుతుంది. జమ్మూ కశ్మీర్‌ ఇప్పటికీ అంతర్గత వ్యవహారమనే మీరు(బీజేపీ) చెబుతారా..? అన్నది మా పార్టీ తెలుసుకోవాలనుకుంటోంది’అని రంజన్‌ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం నియమ, నిబంధనలను పక్కనపడేసి జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయం తీసుకుందని రంజన్‌ మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌ అంతర్గత వ్యవహారం కాదనేలా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. ఈ వ్యాఖ్యలపై అధికారపక్షం తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. కశ్మీర్‌ అంశంలో కాంగ్రెస్‌ వైఖరిని స్పష్టం చేయాలంటూ హోంమంత్రి అమిత్‌ షా నిలదీశారు. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడా భారత్‌లో భాగమేనని అమిత్‌ షా బదులిచ్చారు. కశ్మీర్‌ లోయలో ఐరాస జోక్యాన్ని కాంగ్రెస్‌ ఆశిస్తోందా అని నిలదీశారు. కశ్మీర్‌పై కాంగ్రెస్‌ వైఖరి స్పష్టం చేయాలన్నారు. 

సోనియా, రాహుల్‌ ఆగ్రహం.. 
కశ్మీర్‌పై కాంగ్రెస్‌ సభ్యుడు అధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆపార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌ అంతర్గత వ్యవహారామా..? కాదా..? అన్నది స్పష్టతివ్వాలని రంజన్‌ ప్రశ్నించిన సమయంలో సోనియా గాంధీ ఆయనకు కుడి వైపున కూర్చొని ఉన్నారు. ఈ వ్యాఖ్యలతో షాక్‌ తిన్న ఆమె.. ఒక్కసారిగా రాహుల్‌ గాంధీ వైపు చూశారు. రంజన్‌ వ్యాఖ్యలతో రాహుల్‌ గాంధీ సైతం చేసేదేమీ లేక తల అడ్డంగా ఊపుతూ కూర్చున్నారు. ఈ వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా రంజన్‌ మరోసారి మాట్లాడుతూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఇది అందరికీ ప్రాథమికంగా వచ్చే ప్రశ్నే అని, తనను తప్పుగా అనుకోవద్దని తెలిపారు. అయితే ఈ సమయంలో సోనియా గాంధీ అసహనంగా కనిపించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top