విద్యార్థులే ‘విమోచన’ సేనానులు | Dr. babu rao varma write on hyderabad freedom struggle | Sakshi
Sakshi News home page

విద్యార్థులే ‘విమోచన’ సేనానులు

Sep 17 2017 1:37 AM | Updated on Sep 19 2018 6:36 PM

విద్యార్థులే ‘విమోచన’ సేనానులు - Sakshi

విద్యార్థులే ‘విమోచన’ సేనానులు

నిజాం నుంచి విముక్తి పొంది ఇండియన్‌ యూనియన్‌లో విలీనమయ్యే దిశగా..

సందర్భం
నిజాం నుంచి విముక్తి పొంది ఇండియన్‌ యూనియన్‌లో విలీనమయ్యే దిశగా సాగిన హైదరాబాద్‌ స్వాతంత్య్ర పోరాటంలో 1948వ సంవత్సరం అత్యంత విషాదకరమైన కాలం. భారత్‌ 1947 ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్రం పొందినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ఇండియన్‌ యూనియన్‌ నుంచి స్వతంత్రంగా ఉండాలని భావించడంతో నిజాం నియంతృత్వ పాలనలోనే మగ్గుతుండేది. దీంతో నిజాం వ్యతిరేక పోరాటం మరింత విస్తృతి పొందింది. ఈ కాలం లోనే ప్రభుత్వాన్నే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్న చట్ట వ్యతిరేక మతోన్మాదుల కారణంగా సంస్థానంలో హింసాత్మకమైన, అసహనంతో కూడిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
 
ఆనాడు ప్రజలు ఈ ద్వంద్వపాలనను ఒక విచిత్ర పరిస్థితిలా చెప్పుకునేవారు. పగటిపూట ప్రభుత్వ పోలీసులు, ఎమ్‌ఐఎమ్‌ పాలన సాగుతుండగా, రాత్రిపూట మాత్రం కమ్యూనిస్టు పాలన సాగేది. ఈ అరాచక స్థితిలో బూర్గుల రామకృష్ణారావు, చెన్నారెడ్డి వంటి కాంగ్రెస్‌ నేతలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కోవాలంటూ ధైర్యం నూరిపోసేవారు. దీంతో మంచి రోజులు మరెంతో దూరంగా లేవని ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలి గింది. ఈ కాలంలోనే ప్రజల ప్రాణాలను, ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించాల్సిందిగా స్టేట్‌ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ప్రభుత్వం స్తంభించిపోయేలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ నిరసన తెలపాలని హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ సార్వత్రిక పిలుపునిచ్చింది. స్వాతంత్య్రోద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం కోసం ఈ రచయిత అధ్యక్షతనే విద్యార్థి కార్యాచరణ కమిటీ ఏర్పడింది. కళాశాలలను బాయ్‌కాట్‌ చేయాలని కోరుతూ హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ కాంగ్రెస్‌ విద్యార్థులకు పిలుపునిచ్చింది. దీంతో దాదాపు 20 వేలమంది విద్యార్థులు కాలేజీలను బహిష్కరించారు.

ఈ నేపథ్యంలో స్టేట్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ ఫ్లాగ్స్‌ పిలుపు మేరకు హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ కాంగ్రెస్‌ 1948 ఆగస్టు 15న పతాకావిష్కరణ దినోత్సవాన్ని పాటించింది. పలు ప్రాంతాల్లో ప్రత్యేకించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలపై పతాకావిష్కరణ చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో పతాకావిష్కరణ తర్వాత విశ్వవిద్యాలయం నుంచి, నిజాం కాలేజీతోపాటు ఇతర కాలేజీలనుంచి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిజాం కాలేజీలో ఈ రచయిత నేతృత్వంలో ఒక ప్రదర్శన జరిగింది. తర్వాత వివేక వర్ధిని నుంచి మరొక విద్యార్థి ప్రదర్శనపై పోలీసులు దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.

ఆ సాయంత్రం భారత ప్రభుత్వ ఏజెంట్‌ జనరల్‌ కేఎం మున్షీ పతాకావిష్కరణ కార్యక్రమానికి ప్రజలను, నాయకులను ఆహ్వానించారు. నేనూ, సంగం లక్ష్మీబాయి (తదనంతర కాలంలో మంత్రి అయ్యారు), ఇతర స్టేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి వెళుతుండగా రజాకార్లు దాడి చేశారు. నా తలలోంచి రక్తం కారింది. అలాగే దక్షిణ సదన్‌ వెళ్లి పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. హాజరవుతున్న విద్యార్థులపై రజాకార్ల పాశవిక దాడిని కేఎం మున్షీ గర్హించారు.
హైదరాబాద్‌ నిజాం భారత యూనియన్‌కు విధేయత ప్రకటించి సంస్థానాన్ని విలీనం చేశారు. అయితే నాటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌ బాటన్‌తో సుదీర్ఘ చర్చలు, భారత ప్రభుత్వ హోం శాఖతో సంప్రదింపులు జరిపాక, పోలీసు యాక్షన్‌ చేపట్టిన తర్వాతే నిజాం లొంగిపోయారు.

 హైదరాబాద్‌ సంస్థానంపై భారత ప్రభుత్వ బలగాలు 1948 సెప్టెంబర్‌ 3 వేకువజామున త్రిముఖ దాడి తలపెట్టాయి. కేంద్ర ప్రభుత్వ సైనిక బలగాలు సెప్టెంబర్‌ 17నాటికి హైదరాబాద్‌ చేరుకున్నాయి. స్వల్పమాత్రపు పసలేని ప్రతిఘటన తర్వాత నిజాం బలగాలు భారత సైన్యం ముందు లొంగిపోయాయి. తర్వాత మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నేతృత్వంలో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. ఏడవ నిజాం నవాబ్‌ సర్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ బహదూర్‌ తాత్కాలికంగా హైదరాబాద్‌ రాజప్రముఖ్‌గా నియమితులయ్యారు.

విమోచన పోరాట కాలంలో నేను హైదరాబాద్‌ స్టేట్‌ స్టూడెంట్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, అఖిల భారత విద్యార్థి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాను. ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాను. కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీ భేదాలు లేకుండా విద్యార్థులు హైదరాబాద్‌ స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు.

గత కొన్నేళ్లుగా తెలంగాణ స్వతంత్ర సేనాని సమితి, ప్రీడమ్‌ ఫైటర్స్‌ ఫోరం ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ అధ్యక్షుడిగా ఉంటూ ఇతర స్వాతంత్య్ర సమర వీరులతో కలిసి కోఠి బస్టాండ్, అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తున్నాను. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. నాటి హైదరాబాద్‌ విమోచన పోరాటంలో పాలుపంచుకున్న స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్ధం తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివాళి పలకటం సముచితంగా ఉంటుంది.

వ్యాసకర్త అధ్యక్షుడు, తెలంగాణ స్వతంత్ర సేనాని సమితి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు 
డాక్టర్‌ బాబూ రావ్‌ వర్మ
మొబైల్‌ : 99637 07461

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement