నిజం చెప్పే నాలుక

tongue that tells the truth - Sakshi

ఫుడ్‌ బాగుందో లేదో ఎలా తెలుస్తుంది.. నాలుకతో రుచి చూస్తేనే.. అదే విధంగా రసాయనాలను రుచి చూసేద్దామంటే మాత్రం అది దాదాపు అసాధ్యమే.. కానీ కొన్నిచోట్ల వాటి రుచి తెలిస్తే తప్ప పనులు జరగవు. మరి వీటి రుచిని చూసేదెలా.. అందుకోసం కృత్రిమ నాలుక తయారుచేస్తే పోలే అనుకున్నారు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పరిశోధకులు. ముఖ్యంగా దీన్ని ఆల్కహాల్‌లో కల్తీని నిరోధించడానికి తయారుచేశారట. కల్తీని ఇది ఇట్టే పసిగట్టేస్తుందని.. చిన్నచిన్న తేడాలను గుర్తిస్తుందని, 99 శాతం కచ్చితత్వంతో చెబుతుందని అంటున్నారు. అంతేకాదు 12 ఏళ్లు, 15 ఏళ్లు, 18 ఏళ్ల కిందటి ఆల్కహాల్‌ల మధ్య తేడాను కూడా ఇట్టే కనిపెట్టేస్తుందట.

అల్యూమినియం, బంగారం లోహాలను ఉపయోగించి దీనిని తయారు చేశారు. ‘ఈ కృత్రిమ నాలుక అచ్చు మన నాలుకలాగే పనిచేస్తుంది. కాకపోతే సంక్షిష్టమైన రసాయనాల మధ్య తేడాను గుర్తించడానికి ఉపయోగపడుతుంది’అని పరిశోధకులు అలస్‌డేర్‌ క్లార్క్‌ వివరించారు. కృత్రిమ నాలుకను ఇప్పటికే చాలా మంది అభివృద్ధి చేశారని, అయితే రెండు వేర్వేరు రకాల నానోస్కేల్‌ మెటల్‌ రుచి గ్రాహికలను ఉపయోగించి ఒకే నాలుక పనిచేసేలా తయారు చేయడం ఇదే తొలిసారని చెప్పారు. ముందుగా ఆల్కహాల్‌ తేడాలను గుర్తించేందుకు వినియోగించామని, ఈ నాలుక ఏ రకమైన రసాయనాల మధ్య తేడానైనా గుర్తిస్తుందని చెప్పారు. 

ఎలా పనిచేస్తుంది.. 
- బంగారం, అల్యూమినియం లోహాలతో తయారుచేసిన నానోస్కేల్‌ రుచి గ్రాహికలను శాస్త్రవేత్తలు తయారు చేశారు.  
విస్కీ నమూనాలను ఈ రుచిగ్రాహికలపై పోశారు. ఈ రుచిగ్రాహికలు మన నాలుకలోని రుచిగ్రాహికల కన్నా 500 రెట్లు చిన్నవి.  
ఆ తర్వాత ద్రవంలో మునుగుతున్న కొద్దీ ఆ గ్రాహికలు కాంతిని ఎలా శోషించుకుంటున్నాయో పరిశోధకులు విశ్లేషించారు. 
అవి కాంతిని శోషణం చేసుకునే తీవ్రతను బట్టి నమూనాల మధ్య తేడాలను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాన్ని ‘ప్లాస్మోనిక్‌ రెసోనెన్స్‌’అని పిలుస్తారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top