కోవిడ్‌–19కి విరుగుడు టీబీ వ్యాక్సిన్‌!

Coronavirus More Active In Countries Without TB Vaccine Policy: Study - Sakshi

అమెరికా తాజా అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: క్షయకి, కరోనాకి సంబంధం ఉందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రెండూ అంటువ్యాధులే. నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా అంటుకుంటాయి. రెండు వ్యాధి లక్షణాల మధ్య కొంత సారూప్యత ఉంది. ఊపిరితిత్తులకు సంబంధించినవే ఈ రెండు వ్యాధులే. అందుకే టీబీ వ్యాక్సిన్‌ భారత్‌ను కోవిడ్‌–19 బారి నుంచి రక్షిస్తోందని అమెరికాలో న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు, కరోనా కేసులు మృతులు సంఖ్య తక్కువగా ఉండడానికి సంబంధం ఉందని వైద్య పరిశోధనలకు సంబంధించిన మెడ్‌ఆరెక్సివ్‌ వెబ్‌సైట్‌ న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనాన్ని ప్రచురించింది. (కరోనా: 48 గంటల్లో వైరస్‌ క్రిములు ఖతం!)

ట్యూబర్‌ కొలాసిస్‌ (టీబీ) వ్యాధి ఉన్న దేశాల్లో బాకిలస్‌ కాల్మెట్టె గ్యురిన్‌ (బీసీజీ) వ్యాక్సినేషన్‌ చేస్తారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న పలు దేశాల్లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉండడమే కాదు, మృతుల సంఖ్య కూడా బాగా తక్కువగా ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన న్యూ యార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అసిస్టెంట్‌ ప్రొఫసర్‌ గొంజాలొ ఒటాజు వెల్లడించారు. చైనాకి పొరుగునే ఉన్న జపాన్‌ వంటి దేశాలు లాక్‌డౌన్‌ చర్యలు తీసుకోకపోయినప్పటికీ ఈ వ్యాధి ఎందుకు విస్తరించలేదని తొలుత సందేహాలు కలిగితే ఆ దిశగా పరిశోధనలు సాగించామన్నారు. బీసీజీ వ్యాక్సిన్‌ అనేది కేవలం క్షయ వంటి వ్యాధులకే కాదు ఇతర అంటు వ్యాధులకి కూడా విరుగుడుగా పని చేస్తుందని, అందుకే ఆ వ్యాక్సిన్‌ నిర్బంధంగా వాడుతున్న దేశాల్లో కోవిడ్‌ విస్తరణను అధ్యయనం చేస్తే తక్కువగా ఉందని తేలిందని ప్రొఫెసర్‌ ఒటాజు తెలిపారు.

సంపన్న దేశాల్లో కరోనా పడగ
అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లోనే కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. దీనికి కారణం ఆయా దేశాలన్నింటిలోనూ టీబీ కేసులు అత్యంత స్వల్పం. టీబీని నిరోధించే బీసీజీ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న నిబంధనలు కూడా లేవు. కరోనా బట్టబయలైన చైనాలో కూడా బీసీజీ వ్యాక్సిన్‌ వినియోగం తక్కువగానే ఉంది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే కరోనాను విజయవంతంగా అదుపు చేయగలిగాయి. ఈ దేశాల్లో బీసీజీ వ్యాక్సిన్‌ ప్రజలందరూ తప్పనిసరిగా తీసుకోవాలన్న జాతీయ నిబంధనలు ఉన్నాయి. అలాగే భారత్‌ కూడా క్షయ సోకకుండా బీసీజీ వ్యాక్సిన్‌ విస్తృతంగా వినియోగిస్తోంది. అందుకే ఆయా దేశాల్లో కరోనా వ్యాధి విస్తరణ తక్కువగా ఉందని ఒటాజు వివరించారు.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి బీసీజీ వ్యాక్సిన్‌?
కరోనాకి వ్యాక్సిన్‌ కనుక్కోవాలంటే ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. అందుకే అమెరికా, ఇటలీ వంటి దేశాలు అత్యవసర విధులు అందించే వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ నుంచి రక్షణ కోసం బీసీజీ వ్యాక్సిన్‌ వెయ్యాలని సిఫారసులు చేస్తున్నాయి. ఇక మిగిలిన దేశాలు ఆచితూచి వ్యవవహరిస్తున్నాయి. కెనడాలో టొరాంటో యూనివర్సిటీ ఇమ్యూనాలజీ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ ఎలీనార్‌ ఫిష్‌ దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు చెయ్యాలన్నారు. నెదర్లాండ్స్‌ కరోనా కట్టడికి బీసీజీ వ్యాక్సిన్‌ను 200 మంది వైద్య సిబ్బందికి ప్రయోగాత్మకంగా ఇచ్చింది. అయితే ఇది పని చేస్తుందా అనే అన్నది తెలియడానికి మరో మూడు నెలలు పడుతుంది. ఈలోగా ఇదే అంశంపై సంపూర్ణ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ ఒటాజు వెల్లడించారు.

చదవండి: ‘కరోనాకు నా రక్తంలోనే సమాధానం ఉందేమో’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top