
నడకయాతన
గ్రేటర్‌లోని ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ఓవైపు జనం గగ్గోలు పెడుతున్నా... మరోవైపు గతంలో తానే స్వయంగా ఉత్తర్వులు జారీ చేసినా...
ఫుట్‌పాత్‌ల ఆక్రమణతో పాదచారులకు కష్టాలు
ఏటా భారీ సంఖ్యలో మృత్యువాత
ఆక్రమణలపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు
వ్యాపారులను తొలగించాలని ఆదేశం
సిటీబ్యూరో:గ్రేటర్‌లోని ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ఓవైపు జనం గగ్గోలు పెడుతున్నా... మరోవైపు గతంలో తానే స్వయంగా ఉత్తర్వులు జారీ చేసినా... అధికార గణం స్పందించకపోవడంతో ఉన్నత న్యాయస్థానం తాజాగా గట్టిగా స్పందించడం... మాట వినని వ్యాపారుల వస్తువులను స్వాధీనం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించడం...నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఈసారైనా అధికారులు పూర్తి స్థాయిలో స్పందించగలిగితే పాదచారుల ప్రాణాలకు కొంతైనా భద్రత ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. నగరంలోని 90 శాతం ఫుట్‌పాత్‌లను వ్యాపారులు సొంతం చేసుకున్నారు. గత్యంతరం లేని పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. దీంతో వారు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జంట పోలీసు కమిషనరేట్లలో 200కుపైగా పాదచారులు దుర్మరణం చెందగా... 400కుపైగా క్షతగాత్రులయ్యారు. మొత్తం 2,808 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటే... అందులో 40 శాతం పాదచారులే బాధితులుగా తేలింది. నగరంలో రోజుకు సగటున నలుగురు పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. దీనికి ప్రభుత్వ యంత్రాగమే బాధ్యత వహించక తప్పదు.
పాదచారులు వెళ్లడానికి సరైన మార్గాలు చూపకపోవడమే దీనికి ప్రధాన కారణం. నగరంలోని దాదాపు అన్ని రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. వాటిని సమీపంలోని దుకాణాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, చిన్నాచితకా వ్యాపారులు, కట్టెల దుకాణాలు, బట్టల దుకాణాలు, బస్టాండ్‌లు, ప్రైవేట్ ట్రావెల్స్, ఆటో స్టాండ్‌లు, పాన్‌డబ్బాలు, తోపుడుబండ్లు, టీ- టిఫిన్‌బండ్ల యజమానులు ఆక్రమించుకుంటున్నారు. కోఠి, అబిడ్స్, సుల్తాన్‌బజార్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, చార్మినార్, నారాయణగూడ, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, ఆర్టీసీ చౌరస్తా, విద్యానగర్, నల్లకుంట, అంబర్‌పేట్, బేగంపేట్ తదితర ప్రాంతాలలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.
షరా ‘మామూలే’
నిజానికి ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యాపార కేంద్రాలను తెరచుకోవాలి. అలాంటి వాటికే పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు లెసైన్స్‌లు జారీ చేయాలి. నగరంలో పార్కింగ్ లేని వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు కూడా అక్రమంగా లెసైన్స్‌లు జారీ చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దుకాణ యజమానులు ఫుట్‌పాత్‌లను కబ్జా చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమించుకున్న వారి నుంచి స్థానిక పోలీసులకు, మున్సిపల్ సిబ్బందికి నెలవారీ మామూళ్లు అందుతున్నందునేచూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనేఆరోపణలు ఉన్నాయి. పార్కింగ్ సౌకర్యం లేని వ్యాపార కేంద్రాలను మూసివేయాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంబంధిత అధికారులు బుట్టదాఖలు చేశారు. హైకోర్టు కొరడా ఝుళిపించినప్పుడల్లా ఒకటి రెండు రోజులు నామమాత్రంగా దాడులు చేయడం.. ఆ తరువాత షరా ‘మామూలు’గా వదిలేయడం అధికారులకు అలవాటుగా మారింది. రాజకీయ నాయకుల వత్తిడి కూడా మరో కారణంగా చెప్పుకుంటున్నారు.
తాజా తీర్పుతో స్పందించాలని...
ఆక్రమణదారుల చర్యలను స్థానికులు, పాదచారులు నిలదీసే ధైర్యం చేయలేకపోవడంతో వారు ఆడిందే ఆటగా మారుతోంది. పాదచారులు కూడా పెద్దగా పట్టించుకోకుండా రోడ్లుపై నడవడంతో ప్రాణాల మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయాలంటూ హెచ్చరించాలని, ఒకవేళ వినకుంటే, వారి వస్తువులను స్వాధీనం చేసుకొనిబహిరంగ వేలంలో విక్రయించాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని పాదచారుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.