దుఃఖిస్తున్న తెలుగు తల్లి

సందర్భం

ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, మారిషస్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా ఇలా ఎక్కడకు వెళ్లినా అక్కడ తెలుగు వారు తమ భాషా సంస్కతులను కాపాడుకునేందుకు చేస్తున్న కషి చూసి నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అనేక దేశాల్లో తెలుగు వారు తమ పిల్లలకు తెలుగు నేర్పేం దుకు తహతహలాడుతున్నారు. ఆ దేశాల్లో తెలుగు సదస్సులకు హాజరైనప్పుడు అక్కడి పిల్లలు చక్కటి తెలుగులో మాటా ్లడుతుండటం విని నేను దిగ్భ్రమ చెందుతుంటాను. ఇవాళ ఇక్కడ మెల్బోర్న్‌లో వంగూరి చిట్టెం రాజు ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్, లోకనాయక్‌ ఫౌండే షన్,  ఆస్ట్రేలియా తెలుగు సంఘం కలిసికట్టుగా ఏర్పాటు చేసిన ఆరవ ప్రపంచ సాహితీ సదస్సులో ఆస్ట్రేలియా లోని వివిధ ప్రాంతాలకు చెందిన పెద్దలూ, పిల్లలూ పాల్గొని దాన్ని విజయవంతం చేయడం చిన్న విషయం కాదు.

కానీ నేనూ నా రాష్ట్రం నుంచి మీకు ఏ సందేశం ఇవ్వగలను? ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా సంస్కృతులు అద్భుతంగా పరిఢవిల్లుతున్నాయని చెపితే అది నన్ను నేను మోసగించు కున్నట్లవుతుంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పరిపాలన సాగిస్తున్నాయి. తెలంగాణలో తెలుగు వెలిగి పోతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తల్లి ముఖం వెలవెలబోతోంది. ఇక్కడ ఒక ఖండంలో, పరాయిగడ్డపై, మన స్వంత ప్రాంతాలను విడిచివచ్చిన మీరు ఒక్కటై తెలుగు భాషను సంస్కృతినీ అద్భుతంగా కాపాడుతూ, ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నందుకు నేను పులకించి పోతున్నాను. కాని అదే సమయంలో మాతృ భూమిలో తెలుగు భాష పరిస్థితిని తలుచుకుని నాకు దుఃఖం కలుగుతోంది.

ఒకప్పుడు హైదరాబాద్‌ సంస్థానంలో  అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడేభాష అయినప్పటికీ ప్రాంతీయభాషగా తెలుగు నిరాదరణకు గురైంది. అన్నింటా అధికార భాషగా ఉర్దూ పీఠం వేసుకుంది. అమ్మ భాషకోసం తెలంగాణలో నాటితరం భారీ ఉద్యమాలు,పోరాటాలు చేయాల్సి వచ్చింది. తెలుగు ప్రజలకు కనీసం సభలూ సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారు తెలంగాణలో తెలుగు వైభవానికి కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌ తెలుగుకు అత్యున్నత స్థాయి కల్పించారు. జలగం వెంగళరావు ప్రధమ ప్రపంచ మహాసభలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంఘాలు పురుడు పోసుకోవడానికి దోహదం చేశారు.

కాని ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత నందమూరి వారసులమనీ, అమరావతిని రాజధానిగా నెలకొల్పామనీ చెప్పకుంటున్న వారి రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుకు ఆదరణ తగ్గిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా మార్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీఓ నంబర్‌ 21ను విడుదల చేసింది. ఈ మేరకు చట్టాన్ని ప్రవేశపెట్టింది. తెలుగులో తప్పనిసరిగా బోధన జరగాలని ఆదేశాలు జారీ చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి దేశ విదేశాలనుంచి తెలుగు సాహితీవేత్తలను పిలిచి సత్కరించిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుంది.

తెలుగుపై మమకారం లేని బాబు పాలన
కాని ఎన్టీఆర్‌ వారసులు నడుపుతున్న ప్రభుత్వంలో తెలుగు భాష అమలు మాటేమిటి? తెలుగు అనే పదాన్ని తన సంస్థకు తగిలించుకున్న ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుని నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ ఆ భాషా పరి రక్షణకు ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రకటించిన వాగ్దా నాలను నెరవేర్చిన పరిస్థితులు కనపడటం లేదు. పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తామన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ పాలనా భాషగా తెలు గును అమలుచేస్తామని, నవ్యాంధ్రలో తెలుగు విశ్వ విద్యా లయం ఏర్పాటు చేస్తామని సీఏం స్వయంగా పలుసార్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక తెలుగు కేంద్రం ఏర్పాటు చేస్తామని, తెలుగు పండితుల శిక్షణా కళాశాలలు ఏర్పాటు చేస్తామని, తెలుగు ప్రాచీన తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ చేస్తామని ఏవేవో ప్రకటనలు గుప్పించారు. ఏ ఒక్కదాన్నీ ఆమలు చేయలేదు. పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్‌ మీ డియంను ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి ఆంగ్లభాషపై ఉన్న మమకారంలో నూరో వంతు కూడా తెలుగు భాషపై లేదని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడాల్సిన అవసరం కనపడదు.

తెలుగు భాష అంటే తమకు పట్టింపు లేదని, తమకు ఆంగ్ల భాషా వ్యామోహమే ఉన్నదని, తాము, తమ పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదివారు కనుక ప్రజలను తెలుగులో చదవమని చెప్పే అధికారం తమకు లేదని, తెలుగు నేర్చు కుంటే బతుకుతెరువు లభించదని ఆనాడే ప్రకటించి ఉంటే ఇవాళ వారిని నిలదీసి ఎవరూ అడిగేవారు కాదు. కానీ తెలుగు భాషను కాపాడతామని, తెలుగులోనే ప్రధానంగా వ్యవహారాలు సాగిస్తామని 2014లోనే తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాట నిజం కాదా? అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాల మాటేమిటి? ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌  వరకు విద్యాసంస్థల్లో తెలుగు భాషను తప్పని సరి చేస్తాం, ఆ మేరకు జీవోలు జారీ చేస్తామని నాలుగేళ్ల పాటు వాగ్దానాలు గుప్పించలేదా?

పైగా,  మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధనను రద్దు చేస్తూ రెండేళ్ల క్రితం జీవో జారీ చేశారు. ఇవాళ మాతృభాష మా జన్మహక్కు అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో మాతృభాషను ప్రధాన భాషగా విద్యాబోధన చేస్తుంటే మన రాష్ట్రంలో మాతృభాష మీడియంను రద్దు చేయడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంగన్‌వాడీలలోను తెలుగు లేకుండా చేశారు. తెలుగు భాషను కూకటివేళ్లతో పెకలించేందుకు ఇవాళ ప్రభుత్వంలో మంత్రులు కూడా కంకణం కట్టుకున్నట్లు కనపడుతున్నారు. ఒక కార్పొరేట్, వ్యాపార సంస్కృతి ఇవాళ ఏపీలో తెలుగు భాషను పూర్తిగా కబళించేందుకు ప్రయత్నం చేస్తున్నది.

ప్రతి ఏడాది ఆగస్టు 29 వచ్చేసరికి గంభీరమైన వాగ్దా నాలకు కొదువ ఉండదు. పాఠశాలలనుంచి ఇంటర్మీడియట్‌ వరకు మాతృభాషలో విద్యాబోధన తప్పని సరిచేస్తామన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. పాఠశాలల్లో తెలుగు ప్రవే శించడం మాట దేవుడెరుగు,  పసిపిల్లలను కూడా అమ్మా అనే బదులు మమ్మీ అనడమే సరైనదని చెప్పారు. తెలుగుకు పీఠాలు కడతామని మరో వాగ్దానం చేశారు. తీరా చూస్తే ఆ పీఠం సమాధి అన్న విషయం అర్థమవుతోంది. ప్రత్యేక కేంద్రం కోసం కేటాయిస్తామన్న పదివేల చదరపు అడుగుల భూమి అంటే తెలుగును పూడ్చి పెట్టడానికి ఏడడుగుల స్థలం కోసం అన్వేషణగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్ప టికైనా ఏపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా తెలుగు అమలుకు కంకణం కట్టుకోవాలి. ఇవాళ తెలుగుభాష ఉనికిని కాపాడేం దుకు ప్రభుత్వాలు విదేశాల్లో తెలుగు సంస్థలనుంచి నేర్చుకో వాల్సిన అవసరం కనపడుతోంది.

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తల్లి తనను కబళిస్తున్న భాషా హంతకులనుంచి రక్షించమని విలపిస్తోంది. అమ్మ జోలపాట అంతర్ధానమవుతోంది.  చెదలు పట్టిన పెద్ద బాలశిక్ష పుటలు చేతులు చాచి రెపరెప కొట్టుకుంటూ ఆర్తనాదం చేస్తున్నది. నినాదాల ఘోషలోభాష మరణిస్తోంది. వాగ్దానాల హోరులో అక్షరాల ఆర్తనాదం కలిసిపోయింది. కూలిన పాఠశాల భవనాల మధ్య  మహాకవులూ, కవిసామ్రాట్టులూ కవిత్ర యాలూ, కవికోకిలలూ ఆత్మలై సంభాషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాక తెలంగాణలోనో,  అమెరికా లోనూ, ఆస్ట్రేలియాలోనో, మారిషస్‌లోనో  పుడితే మళ్లీ జీవిస్తామేమోనని చర్చించుకుంటున్నాయి.
(నవంబర్‌ 3,4 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆచార్య యార్లగడ్డ లక్ష్షీ్మప్రసాద్‌ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు)
వ్యాసకర్త రాజ్యసభ మాజీఎంపీ, ఏపీ హిందీ అకాడెమీ చైర్మన్‌

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top