విజేతలను వెంటాడే భయం

winners fear Shekhar Gupta writes on Modi - Sakshi

జాతిహితం

ఈసారి క్లీన్‌స్వీప్‌లు అసాధ్యమని బీజేపీ నేతలకు తెలుసు. ఆఖరికి గుజరాత్‌లో కూడా కొన్ని స్థానాలు నష్టపోవచ్చు. మోదీ మళ్లీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం వల్ల గుజరాతీయులు తమ అశాంతిని మరిచిపోయి ఓట్లు వేసినప్పటికీ సీట్లు తగ్గుతాయి. ఆ కోణం నుంచి ఇప్పుడు ఇండియా మ్యాప్‌ను పరిశీలిస్తే 272 ప్లస్‌ స్థానాలు రావడం గగనమన్న సంగతి తెలుస్తుంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (శివసేన దూరం కావడంతో), ఉత్తరప్రదేశ్‌లలో కూడా బీజేపీ సీట్లు కోల్పోతుంది.

ప్రధాని నరేంద్ర మోదీ హావభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వృథా ప్రయాస. ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆయన ఒక పరిపూర్ణ కళాకారుడు. కేవలం సౌజ్ఞలు చేస్తూ, వాటి మధ్య మాటతో చెప్పనివి, ప్రదర్శించనవి అనేకం మన ముందు ఆవిష్కరిస్తారు. ఆలోచనలలో వాస్తవంగా ఏముందో దానిని కూడా మోసం చేసి వచ్చిన అంశాలు ఏమిటో కూడా తెలియకుండా మాట్లాడడంలో చాలా తర్ఫీదు పొందినవారాయన. ఆయన నిరంతర ప్రచార యుద్ధ సంరంభంలో కనించే రాజకీయనాయకుడు. ఒక అవిశ్రాంత ప్రచారకుడు. తన ప్రచారంతోనే 2014 ఎన్నికలలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో, అలాంటి ఒక కొత్త ప్రచార సంరంభానికి ఆయన సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది.

ఈ వారంలోనే పార్లమెంట్‌ ఉభయ సభలలో మోదీ ఇచ్చిన రెండు ఉపన్యాసాలను ఆత్రంగా చదివిన వారి కోసమే ఈ చిన్న హెచ్చరిక. అందులోని కొన్ని అంశాలను మీరు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆయన నుదిటి మీది ముడతలు చాల లోతైనవని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రతిపక్షానికి సంబంధించి ఆ ముడతలు మరింత ఆగ్రహాన్ని, చిరాకును ప్రదర్శిస్తాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, చాలాకాలం తరువాత ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రధానంగా ఆయన తలపులను గట్టిగా తట్టింది. ఇంకోమాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఆయన గుబులు పడవలసిన విషయమైంది. లోక్‌సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో కనీసం పన్నెండు పర్యాయాలు కాంగ్రెస్‌ పేరు ప్రస్తావించారని మా లెక్కలో తేలింది. అంటే 48 మంది సభ్యులు ఉన్న ఆ పార్టీ ఎంపీలు ప్రతి నలుగురిలో ఒకరికి ఆ ప్రస్తావన వర్తిస్తుంది.

కాంగ్రెస్‌ గురించి ప్రస్తావించడం ఒక్కటే కాదు. నెహ్రూతో ఆరంభించి ‘రాజవంశం’ పేరుతో కూడా ప్రధాని పలుమార్లు ఆ కుటుంబం గురించి ప్రస్తావించారు. నెహ్రూతో పాటు, ఆయన వారసులందరి పాపాల గురించి మోదీ గుర్తు చేశారు. కశ్మీర్‌ అంశంలో నెహ్రూ పాపం, అత్యవసర పరిస్థితి విధింపు ఘనతలో ఆయన కుమార్తె ఇందిర చేసిన పాపం, 1984 నాటి సిక్కుల ఊచకోత పాపంలో ఇందిర కుమారుడు రాజీవ్‌గాంధీ వాటా, ఆంధ్రప్రదేశ్‌ను తొందరపాటుతో అనాలోచితంగా విభజించారంటూ ఆ పాపాన్ని సోనియా గాంధీకి, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను బహిరంగంగా చింపిన పాపం సోనియా కుమారుడు రాహుల్‌కు ప్రధాని ఆపాదించారు. ఇది రాజ వంశంలోని ఐదు తరాల వారిని రాజకీయంగా నిందితులుగా నిలబెట్టడానికి ఉద్దేశించిన బలమైన ఆరోపణల పత్రమే. కానీ తన ప్రభుత్వం గురించి మాట్లాడడానికి మాత్రం ఆయన చాలా తక్కువ సమయం మిగుల్చుకున్నారు. ఈ ఉపన్యాసాన్ని సంప్రదాయ పంథాలో విశ్లేషిస్తే, ప్రధాని మాటలు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేత మీద ఒక ప్రతిపక్ష నేత చేసిన విమర్శను స్ఫురింపచేస్తాయి. లేదా అధికారంలో ఉన్న నాయకుడు తనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న వాస్తవాన్ని గమనించి, మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆశతో, ఒక దుర్బల స్థితిలో చేస్తున్న ఉపన్యాసంలా కూడా అనిపిస్తుంది. ఇదంతా చూస్తే ప్రధాని మోదీ కాంగ్రెస్‌కు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి మోదీ ఉపన్యాసాన్ని సంప్రదాయ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు. ఆయన గురించి తెలిసిన వారు లేదా ఆయనతో కలసి పనిచేసినవారు మీకు ఒకటే చెబుతారు. విపక్షాన్ని తేలిక తీసుకోవడం తమ ఇంటా వంటా లేదనే వారు చెబుతారు. కాబట్టి మోదీ నిరంతరం ప్రచార యుద్ధ సంరంభంలో ఉంటారనడమే నిజం. అది నిజం కాకపోతే మొత్తం 19 రాష్ట్రాలలో మోదీ సొంత పార్టీ ప్రభుత్వాలు, లేదా ఇతర పార్టీలతో కలసి బీజేపీ సంకీర్ణాలు ఏర్పడడం ఎలా సాధ్యమయ్యేది.

మళ్లీ సంప్రదాయబద్ధమైన తర్కంతో ఆలోచిస్తే 48 మంది సభ్యులు మాత్రమే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గురించి తన ఉపన్యాసంలో ప్రధాని అన్ని సార్లు ప్రస్తావించడంలోని సహేతుకతని కూడా గ్రహించవచ్చు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తన ప్రబావాన్ని ఏ మేరకు చూపుతుందో గానీ, ఈ సంవత్సరం జరిగే ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి గట్టి సవాలే. ఇందులో త్రిపురను మాత్రం మినహాయించవచ్చు. కాంగ్రెస్‌ రెండు రాష్ట్రాలలో–కర్ణాటక, మేఘాలయలలో అధికారంలో ఉంది. అయితే ఉప ఎన్నికల ఫలితాలను బట్టి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఈసారి తమకు అవకాశం ఉండవచ్చునని నమ్ముతున్నది. 2018 సంవత్సరంలో జరిగే ఆ ఏడు లేదా ఎనిమిది మినీ ఎన్నికలే 2019 నాటి పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలకు సంకేతించేవిగా ఉంటాయని మోదీకి తెలుసు. ఒకవేళ కాంగ్రెస్‌ కర్ణాటకలో విజయం సాధిస్తే, ఈ సంవత్సరాతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి వాలుగాలి వీస్తుంది. ఆ మూడింటిలో రెండు గెలిచినా, 2019 ఎన్నికలలో బీజేపీ దూకుడుకు కాంగ్రెస్‌ కళ్లెం వేయగలుగుతుంది. అదే కర్ణాటకలో బీజేపీ కనుక విజయం సాధిస్తే పరిస్థితులు మారిపోతాయి. గుజరాత్‌ మిగిల్చిన గందరగోళం, రాజస్తాన్‌ ఉప ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బ గురించి కూడా అంతా మరిచిపోతారు.

ఇక, మోదీ అంటే కోచ్‌ సలహా మేరకు ఒక దశ తరువాత ఒక దశ మెలకువలు నేర్చుకునే వినయశీలి అయిన బ్యాట్స్‌మెన్‌ కాదు. బ్యాట్స్‌మెన్‌కు తన కోసమే విసిరే ఒకే బాల్‌ మీద దృష్టి పెడితే సరిపోతుంది. తరువాత వచ్చే బంతి గురించి అప్పటికి ఆ బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి ఆలోచన ఉండదు. అయితే పిచ్‌తోను, వాతావరణంతోను, అంపైర్‌తోను కూడా ఏకకాలంలో ఆడుకునే క్రీడాకారుడు మోదీ. మోదీ రాజకీయ విధానం కూడా మధ్యయుగాల నాటి గెలుపు తరహాలో విజయ ఫలితమంతా విజేతకే దక్కాలన్న తీరులో ఉంటుంది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్‌తో కలసి మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రంలో ఒక ముస్లిం ముఖ్యమంత్రిని ప్రతిష్టించడానికి చేతులు కలిపారని ఆరోపించడం ఇలాంటిదే. మోదీ శైలి లేదా మోదీ–అమిత్‌షా శైలి పూర్తిగా రాజకీయ మయమే. వాళ్లు కేవలం విజయాన్ని మాత్రమే కోరుకోరు. ప్రతిపక్షాన్ని ధ్వంసం చేసి, శంకరగిరి మన్యాలు పట్టిం చాలని కోరుకుంటారు. ఇందులో ఏది ఆమోదనీయమో, దానిని ఆ పార్టీ స్వీకరిస్తుంది. కానీ నేటి పరిస్థితి ఆరుమాసాల క్రితం వంటిది కాదు. గుజరాత్‌ ఎన్నికలలో ఆశించనదాని కంటే చాలా తక్కువ ఫలితం దక్కడం, రాజస్తాన్‌ ఉప ఎన్నికల ఓటమిలో కనిపించిన ఓట్ల భారీ తేడా బీజేపీని బాగా ఇరకాటంలో పడవేసే సంకేతాలు. ఇవి కాకుండా వేరే అంశాలు కూడా ఉన్నాయి. ఈ సుదీర్ఘ ఆరుమాసాల కాలంలో రాహుల్‌ గాంధీ తన దృష్టిని కేంద్రీకరించారు. తన పార్టీలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల జనాభాను కూడా తన వైపు ఆకర్షింపచేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఇతర విపక్షాలు కాంగ్రెస్‌ ఛత్రం కిందకు రావడానికి నిరాసక్తంగా ఉన్నాయి. ఒకవేళ కర్ణాటకను కాంగ్రెస్‌ నిలబెట్టుకోగలిగితే మళ్లీ ఈ పరిస్థితి కూడా మారిపోతుంది. మోదీ, అమిత్‌షా ఎన్నికల ప్రచారకులు, రాజకీయవేత్తలు మాత్రమే కాదు, ఎన్నికల నిర్వహణలో ఎన్నో మెలకువలు తెలిసిన నిపుణులు. 2014 లోక్‌సభలో కాంగ్రెస్‌కు వచ్చిన 44 స్థానాలను చూసి వారు ఆచితూచి మాత్రమే తృప్తి పొందుతున్నారు. ఆ ఎన్నికలలో బీజేపీ 17 కోట్ల ఓట్లు సాధించింది. 11 కోట్ల ఓట్లు సాధించుకున్నా కూడా కాంగ్రెస్‌ దారుణమైన ఫలితాలను దక్కించుకుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన కొన్ని అంచనాల ప్రకారం 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి అవకాశం ఉన్న కూట మిగా ఎన్టీయేనే ముందంజలో ఉంది. అయితే కాంగ్రెస్‌ ఓట్లు కనుక గత ఎన్నికలలో వచ్చిన 11 కోట్లను మించి 13 కోట్లకు చేరితే అప్పుడు ఎన్డీయే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అది జరగకూడదనే మోదీ, అమిత్‌షా పోరాడుతున్నారు.

భారతదేశంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఎదురవుతున్నప్పటి నుంచి (1984) ఏర్పడుతున్న సంకీర్ణాలలో ఒక తర్కాన్ని నేను గమనిస్తున్నాను. అది టెన్నిస్‌లో చెప్పే బెస్ట్‌ ఆఫ్‌ నైన్‌ సెట్స్‌ తర్కం. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయాల  తలరాతలను మారుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ (2014లో తెలంగాణ సహా), మధ్యప్రదేశ్, బిహార్, రాజస్తాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాజకీయ క్రీడలో టెన్నిస్‌ ఆటలో వలెనే తొమ్మిది సెట్లు. ఈ తొమ్మిదింటిలో ఏ ఐదు రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీ లేదా సంకీర్ణం ఆధిక్యం చూపగలిగితే అదే దేశాన్ని ఏలగలుగుతుందన్నదే నా వాదన. ఈ అన్ని రాష్ట్రాలలో కలిపి 351 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే ఒక పార్టీ అందులో 200 స్థానాలు గెలిస్తే చాలు. చిన్నా చితకా పార్టీలను చేర్చుకోగలిగితే 272 స్థానాల వరకు సాధించవచ్చు. కానీ 2014 ఎన్నికలలో మోదీ, షా ఇలాంటి విశ్లేషణకు కాలం చెల్లిందని నిరూపించారు. వారు కేవలం 272 స్థానాలు మాత్రమే కాదు, 282 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ సీట్లు అప్పుడు ఎలా వచ్చాయో గమనిస్తే, ఇప్పుడు బీజేపీ నేతల కలతకు కారణం తెలుస్తుంది. అప్పుడు 282 స్థానాలు వచ్చాయంటే మధ్యప్రదేశ్‌లో రెండు మినహా మిగిలిన అన్ని సీట్లు, రాజస్తాన్‌లో మొత్తం సీట్లు వచ్చాయి. మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 42 దక్కాయి. ఉత్తరప్రదేశ్‌లో 80కి 70 స్థానాలు, బిహార్‌లో 40 స్థానాలకు గాను 31 స్థానాలు లభిం చాయి. గుజరాత్‌లో అన్ని సీట్లు బీజేపీ గెలిచింది. జార్ఖండ్, చత్తీస్‌గడ్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ వంటి చిన్న చిన్న రాష్ట్రాల స్థానాలు మొత్తం బీజేపీకి వచ్చాయి. అయితే ఈసారి క్లీన్‌స్వీప్‌లు అసాధ్యమని బీజేపీ నేతలకు తెలుసు. ఆఖరికి గుజరాత్‌లో కూడా కొన్ని స్థానాలు నష్టపోవచ్చు. మోదీ మళ్లీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం వల్ల గుజరాతీయులు తమ అశాంతిని మరిచిపోయి ఓట్లు వేసినప్పటికీ సీట్లు తగ్గుతాయి. ఆ కోణం నుంచి ఇప్పుడు ఇండియా మ్యాప్‌ను పరిశీలిస్తే 272 ప్లస్‌ స్థానాలు రావడం గగనమన్న సంగతి తెలుస్తుంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (శివసేన దూరం కావడంతో), ఉత్తరప్రదేశ్‌లలో కూడా బీజేపీ సీట్లు కోల్పోతుంది. అయినప్పటికీ తక్కువ మెజారిటి సాధించిన బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయేకే అధికారం రావచ్చునని చెప్పవచ్చు. అలాగే ఇప్పటికి కాంగ్రెస్‌ను అధికార పీఠం మీద చూసే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ఆ పార్టీని మన్నించమని కోరాలి. æఆరుమాసాల క్రితం కనిపించిన చిత్రం ప్రకారం తక్కువ మెజారిటీ సీట్ల బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీయే వస్తుంది. అదొక అస్పష్ట చిత్రం. కానీ ఇప్పుడు అదే స్పష్టమైన చిత్రం.


- శేఖర్‌ గుప్తా

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top