
చరిత్రలో తొలిసారి మహిళలు వీధుల్నే ఇళ్లుగా మార్చుకున్నారు. ఇంట్లో పిల్లలను చూసుకోవడం, నిరసనల్లో పాల్గొంటున్న తమ మహిళలకు ఆహారం అందించడం వంటి పనులు పురుషులు స్వీకరించారు.
మొట్టమొదటగా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకునే ముందు ఈ దేశంలో నిరసనలు తీసుకొచ్చిన సరికొత్త మార్పు పట్ల పండుగ చేసుకోవలసిందే. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ మహిళలకు స్ఫూర్తి కలిగించడానికి తన సోషల్ మీడియా ఖాతాలను మార్చి 8న మహిళలకు అప్పగించేస్తానని ప్రకటించారు. కానీ అదే సమయంలో ఈ దేశంలో మహిళలు తమ మనుగడ హక్కుకోసం తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్ని దశాబ్దాల తర్వాత దేశ చరిత్రలో మహిళలు నిరసన ప్రదర్శనలకు తీసుకొచ్చిన వినూత్న మార్పును మనం మనస్ఫూర్తిగా స్వాగతించాలి.
సాధారణంగా ఇల్లు, ప్రపంచం రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలుగా చూడటం పరిపాటిగా మారింది. ఇలాంటి వర్ణనల మధ్యే మహిళలపై గృహిణులు అనే ముద్రపడింది. అదేసమయంలో పురుషులు బయటి ప్రపంచాన్ని తమ స్థావరంగా చేసుకున్నారు. ఇటీవల నూతన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన వేలాది మంది మహిళలు (వారిలో చాలామంది గృహిణులు) తమపై ఈ తరహా భిన్నమైన సరిహద్దులకు సంబంధించిన ముద్రలను తోసిపడేశారు. ఇటీవలి చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళలు వీధులనే తమ ఇళ్లుగా మార్చుకున్నారు. గత రెండునెలలుగా ఢిల్లీలోని షహీన్‌బాగ్ వీధుల్లో మహిళా నిరసనకారులు (తల్లులు, అమ్మమ్మలు కూడా) కొలువుతీరి ఉంటున్నారు. అలాగే కోల్‌కతాలోని పార్క్ సర్కస్ మైదానంలోనూ మహిళలు నెలరోజులకంటే పైగా కొలువుతీరి సీఏఏకి వ్యతిరకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
తమ మనుగడ కోసం జరుపుతున్న పోరాటంలో, మహిళలకు, పురుషులకు ప్రత్యేక ప్రపంచాలూ, రంగాలూ అంటూ ఏవీ ఉండవు. మీ కాళ్ల కింది భూమి కదలడం ప్రారంభించినప్పుడు మీ సమస్య పరిష్కారం కోసం అసాధారణంగా మీరు అడుగులు వేస్తారు, సాహసిస్తారు కూడా. కోల్‌కతాలోని పార్క్ సర్కస్ మైదాన్‌లో నిరసన తెలుపుతున్న జమిల్ అనే మహిళ కవితా పంజాబీతో ఇదే విషయం హృద్యంగా చెప్పారు. అదేమిటంటే.. ’’ఒక గృహిణి ఇంటి బయటకు వచ్చిందంటే అసాధారణమైనది జరిగి ఉంటుంది. నిజంగానే భయంకరమైన ఘటన జరిగి ఉంటుంది. హిందూస్తాన్ అనే గొప్ప దేశం, ఘనమైన హిందూస్తాన్ మట్టి ఇప్పుడు మమ్మల్ని సైగ చేసి పిలుస్తున్నాయి’’ విశేషం ఏమిటంటే జమిల్ తన కుటుంబంలోని 18 మంది సభ్యులను వీధుల్లోకి లాక్కొచ్చింది.
ఇంటి నుంచి ప్రపంచంలోకి రావడం అనేది ఈ సందర్భంలో అత్యంత సహజమైనది. నూతన పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశంలో తమకు నివాసమే లేకుండా పోవడం, స్వేచ్ఛను కోల్పోయి తిరిగి బానిసత్వ స్థితిలోకి వెళతామేమో అన్న భీతి కారణంగా మహిళలు చేస్తున్న కొత్తతరహా ప్రదర్శనలు స్వతంత్ర భారత చరిత్రలో మనమెన్నడూ చూసి ఉండలేదు. పార్క్ సర్కస్ మైదానంలోని దృశ్యాలను మీరు చూసినట్లయితే మహిళలు ఇళ్లు వదిలిపెట్టి అంత దూరం ఎందుకు వచ్చారో స్పష్టమవుతుంది. రాత్రి పూట కూడా ఇంటికి పోకుండా వారు అక్కడే కూర్చుని ఉన్నారు. వారితోపాటు కాలేజీ విద్యార్థినులు, టీచర్లు కూడా ఉన్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇలాంటి మహిళలకే చెందుతుంది. నిన్నటివరకు వీరు రాజకీయ వ్యవస్థ, పితృస్వామిక కుటుంబం, సామాజిక చట్రాల వెనుక మరుగున పడి ఉన్నారు. దశాబ్ది కాలంగా మహిళా సంస్థలు పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ వర్గాలపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు బిల్లుకు మద్దతు పలి కినవారు కూడా పైపైనే తమ సమ్మతి తెలపడం గమనార్హం. అదే సమయంలో ఓబీసీలకు కోటాను గ్యారంటీ చేస్తూ తెచ్చిన చట్టాలు ఏమాత్రం అవరోధం లేకుండానే ఆమోదం పొందాయి. అయిదేళ్ల క్రితం కేంద్రంలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయింది.
రాజకీయవర్గాలు ఉద్దేశపూర్వకంగా లేక అనుద్దేశపూర్వకంగా బహిరంగ రాజకీయ వాతావరణంలోకి మహిళలు ప్రవేశించడాన్ని మినహాయిం చాయి. కాగా పౌరసత్వ సవరణ చట్టం, ఆ బిల్లు అమలు క్రమాన్ని గురించి, జాతీయ పౌర పట్టిక అమలు గురించి హోం మంత్రి పదే పదే నొక్కి చెప్పడం వల్ల రాజకీయవర్గాల పథకం విఫలమైపోయింది. ఉన్నట్లుండి మహిళలు అన్నిరకాల బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం మొదలైపోయింది. మహిళలు ఇలా వినూత్నంగా తమది కాని స్థలంలో కనిపించడం, ప్రత్యేకించి ముస్లిం మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం అనేది ఇతర మతాలకు సంబంధించిన మహిళలను కూడా ఆకర్షించింది. ఇదే ఈ ఏడాది మార్చి 8కి ఒక కొత్త రాజకీయ, సామాజిక, జెండర్ పరమైన చలనశీలతను ఆపాదించింది. బయటి ప్రపంచాన్ని కౌగిలించుకోవడం ద్వారా మహిళలు తమ ఇళ్లను రక్షిం చుకుంటున్నారు.
పౌరసత్వ సవరణ చట్టానికి తది తర చట్టాలకు వ్యతిరేకంగా సహజసిద్ధంగా మహిళలు వెల్లువెత్తడం, పోరాటంలో పట్టు సడలించ కుండా కృతనిశ్చయాన్ని వ్యక్తపర్చడం అనేవి రాజ కీయ పార్టీల ఉద్యమాలకు పూర్తి భిన్నంగా సాగడం విశేషం. రాజకీయ పార్టీల జన సమీకరణలు పూర్తిగా పురుషులతో నిండి ఉండగా మహిళలే తమ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. అందుకే ఇది ఉద్యమాలకు సంబంధించి అత్యంత సహజమైన మార్పును ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం మహిళల స్థానానికి సంబంధించిన పరివర్తన గానే కాకుండా ఇళ్లలో జెండర్ పరమైన పాత్రలు తారుమారు కావడం కూడా చూడవచ్చు. మహిళలు చాలామంది నిరసనల్లో పాల్గొంటుండగా పురుషులు మాత్రం తమ పిల్లలను చూసుకుంటూ ఇళ్ల వద్దే ఉండిపోయారు. పైగా నిరసన కార్యక్రమాల్లో ఉన్న తమ మహిళలకు ఆహారాన్ని సరఫరా చేయ డం, అక్కడి స్థలాలను నిత్యం శుభ్రపర్చే బాధ్యతను కూడా పురుషులు తీసుకున్నారు.
మార్చి 8 చారిత్రక మూలాలను తిరిగి స్మరిం చుకుంటున్న వేళ ఇది చక్కటి మార్పు. ఈ మార్పుకు మొదటగా 1908లో న్యూయార్క్ నగరంలో తొలి బీజం పడింది. ఆరోజు వేలాది మంది వస్త్రపరిశ్రమల్లోని కార్మికులు అధిక వేతనాలు, మెరుగైన పరిస్థితులను డిమాండ్ చేస్తూ వీదుల్లోకి వచ్చారు. కానీ అలాంటి చరిత్రాత్మక ఘటనలు సాధారణ వ్యవహారాలుగా మిగిలిపోతాయి. ఆ ఉద్యమాల సారాంశం మరుగునపడి వాటిపేరుతో జరిగే వేడుకలు లాభాలను తెచ్చిపెట్టే మార్కెట్ ప్రేరేపిత ప్రాజెక్టులుగా మారిపోతాయి. ఇలాంటి ఘటనల వెనుక ఉన్న చరిత్రను వినియోగదారులు మర్చిపోతారు. మార్చి 8 వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరిగే అలాంటి సందర్భాల్లో ఒకటిగా మారిపోయాయి. మహిళలు స్ఫూర్తి పొందడానికి తన సోషల్ మీడియా ఖాతాలను ఈరోజు వారికే అప్పగిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. కానీ ఇప్పుడు స్ఫూర్తి పొందుతున్న మహిళలు గజగజలాడించే చలిలో, చలిగాలుల్లో కూడా సాహసించి ఇంటి బయటకు వచ్చారనేది మరవరాదు. తమ అస్తిత్వ హక్కు కోసం వారు పోరాడుతున్నారు.
మనోబినా గుప్తా
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, రచయిత