ఆత్మగల మనిషి జస్టిస్‌ బి. సుభాషణ్‌ రెడ్డి

Justice B Subhash Reddy Died On May 1 - Sakshi

ప్రజలకి చేరువ కావడంలో న్యాయ వ్యవస్థకి ఎన్నో అవరోధాలు ఉన్నాయి. న్యాయం అందించడంలో జాప్యం ఉంది. కోర్టులకి రావాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ విష యాలు అన్నీ తెలిసిన న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుభాషణ్‌ రెడ్డి మే 1, 2019 రోజున అనారోగ్యంతో మరణించినారన్న వార్త బాగా కృంగదీసింది. గత పదిహేను రోజులుగా ఆయన అనారోగ్యం గురించి కొంత తెలిసినప్పటికీ ఇంత త్వరగా మరణిస్తారని ఊహించలేదు. లోకాయుక్తగా పదవీ విరమణ చేసిన తరువాత ఓ రెండుసార్లు ఆయన్ను కలిశాను. మనిషి ఆరో గ్యంగా, ఆనందంగా కనిపించారు. అలాంటి వ్యక్తి చనిపోతారని ఊహించలేం. న్యాయ వ్యవస్థలోని అవరోధాలని గమనించి ఆయన మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా ఎనలేని కృషి చేశారు. చట్టాన్ని అధిగమించి ప్రజలకి చేరువగా న్యాయాన్ని తీసుకెళ్లారు. సుభాషణ్‌రెడ్డి అంటేనే మానవ హక్కులు అనే పరిస్థితులు కల్పించారు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా మానవ హక్కుల కమిషన్‌ దగ్గరికి వెళ్లే విధంగా ప్రజలని తీసుకొని వెళ్లారు. మామూలు ప్రజలే కాదు రాజ కీయ నాయకులు కూడా చాలా సమస్యల పరి ష్కారానికి కమిషన్‌ దగ్గరికి వెళ్లేవారు. ఆయన వేసిన దారి ఇంకా చెరిగిపోలేదు. మానవ హక్కుల కమిషన్‌లో ఎవరూ లేకున్నా, ఈరోజు కూడా ప్రజలు, నిరుద్యోగులు ఇంకా మానవ హక్కుల కమిషన్‌ వైపు పరుగులు తీస్తున్నారు. ఏదో ఉపశమనం లభిస్తుందన్న ఆశతో వెళుతున్నారు. ఆయన మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న కాలంలో చాలా విషయాల్లో, చాలా మందికి ఉపశమనాలు లభించాయి.

ఒక విధంగా చెప్పాలంటే కోర్టుల భారాన్ని ఆయన తగ్గించారు. మరీ ముఖ్యంగా హైకోర్టు భారాన్ని, కోర్టులు ప్రజలకి చేరువ కాలేని పరిస్థితిని ఆయన కమిషన్‌ ఛైర్మన్‌గా తొలగించారు. అక్కడికి వెళ్తే ఏదో ఒక ఉపశమనం లభిస్తుందన్న ఆశని ప్రజలకి కలిగించారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ తరువాత కొంత కాలానికి ఆయన లోకాయుక్తగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మానవ హక్కుల కమిషన్‌ మాదిరిగా ఆ సంస్థ కూడా ప్రజలకి చేరువైంది. ప్రజల సమ స్యలు తొలగించడంలో లోకాయుక్తగా ఆయన కీలక పాత్రని పోషించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినప్పుడు కూడా తీర్పులని సత్వరంగా పరిష్క రించడంలో విశేషమైన కృషి చేశారు. మరీ ముఖ్యంగా దంపతుల మధ్య ఉన్న లీగల్‌ సమస్యలని లోకజ్ఞానంతో (కామన్‌సెన్స్‌)తో పరిష్క రించేవారు. హైకోర్టు న్యాయవాదిగా ఉన్నా, న్యాయ మూర్తిగా ఉన్నా, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నా, ఏ పదవిలో ఉన్నా సామాన్యుడిగా ఎలాంటి ఆడం బరాలు లేకుండా ఉండటం ఆయన నైజం. అందరినీ అభిమానంగా పలకరించేవారు. అపాయింట్‌మెంట్‌ లేకుండా వెళ్లినా, డిక్టేషన్‌లో ఉన్నా కూడా క్రింది కోర్టు న్యాయమూర్తులని పలకరించేవారు. వారి సమస్యలను వినేవారు, పరిష్కరించడానికి ప్రయ త్నించేవారు.

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డికి డాక్టర్‌ కావాలని కోరిక. వారి తండ్రికి డిప్యూటీ కలెక్టర్‌ కావాలని, వాళ్ల తాతకి ‘లా’ చదవాలని. చివరికి ఆయన ‘లా’ చదివారు. కింది కోర్టు నుంచి, రెవెన్యూ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఆయన కేసులని వాదించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా 1991లో పదవీ బాధ్యతలు చేపట్టారు. మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆ తరువాత కేరళ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా పనిచేశారు. ఆయనను కలిస్తే ఓ న్యాయ మూర్తిని కలిసినట్టుగా అనిపించేది కాదు. ఇంటిలోని పెద్దవాళ్లని కలిసినట్టు అనిపించేది. ఇంత త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళతారని ఎవరూ ఊహించలేదు. మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా ఆయనను ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారు. ఓ గొప్ప ఆత్మ మనలని వదలి వెళ్లింది.

మంగారి రాజేందర్‌
వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులుగా పనిచేశారు.
మొబైల్‌ : 94404 83001

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top