భగదత్తుడు | Sakshi
Sakshi News home page

భగదత్తుడు

Published Sun, Feb 7 2016 1:04 AM

భగదత్తుడు

భగదత్తుడు నరకాసురుడి కొడుకు; భూ దేవికి మనవడు. అసురుడి కడుపున పుట్టి అసురుల లక్షణాలు బాగానే పుణికి పుచ్చుకున్నాడు. భూదేవి శ్రీకృష్ణుణ్నించి తన కొడుకు రక్షణ కోసం, దేవతల చేతిలో గానీ దానవుల చేతిలో గానీ చనిపోకుండా ఉండడం కోసం వైష్ణవాస్త్రాన్ని అర్థించింది. నరకుడు పోయిన తరవాత ఆ అస్త్రం భగ దత్తుడికి చేరింది. వైష్ణవాస్త్రానికి ఎదురుండదు. ఇంద్రుడూ రుద్రుడూ కూడా దానికి లొంగాల్సిందే. ఈ అస్త్రానికి తోడు భగదత్తుడికి సుప్రతికమనే పొగరు మోతు ఏనుగుంది. అది ఇంద్రుడి ఏనుగైన ఐరావత వంశానికి చెందిన ప్రసిద్ధమైన ఏనుగు.
 
  భగదత్తుడూ సుప్రతీకమూ కలిసి యుద్ధం చేస్తే ఎదుటివాడికి గెలుపు ఆకాశ పుష్పమే. అటువంటి భగదత్తుడు దుర్యో దనుడి వైపు చేరాడు. ఆకతాయి అయిన తన తండ్రిని చంపిన శ్రీకృష్ణుడికి వ్యతి రేకంగా పోరాడుదామనే తప్ప ధర్మా ధర్మాలను చూసే తెలివి లేదతనికి. అది అతని అసుర లక్షణానికి గుర్తు. భగదత్తుని రాజధాని ప్రాగ్జ్యోతిష పురం. అందుకని ఇతన్ని ప్రాగ్జ్యోతిషుడని కూడా పిలుస్తూ ఉంటారు. ‘ప్రాక్’ అంటే మునుపు అని అర్థం.
 
  ప్రాగ్జ్యోతిషుడంటే మునుపు కాంతిలోనే ఉండేవాడని అర్థం. మనుషులందరూ ముందు కాంతిలోనే ఉండేవాళ్లు. శరీరాల్లో చేరి, శరీరాలకే పరిమితమై అహంకారంగా మారి పోవడంతో అందరూ ప్రాగ్జ్యోతిషు లైపోయారు. ప్రయత్నంతోనే తిరిగి ప్రకాశంలోకి, అంటే, జ్ఞాన పరిధి లోకి రాగలుగుతారు మనుషులు. మహాభారత యుద్ధ సమయానికి భగదత్తుడు వయసు మీరినవాడే. అయినా అతని పరాక్రమమేమీ బీరుపోలేదు. అతని వెంట్రుకలు తెల్లబడిపోయాయి; నొసలూ కళ్ల దగ్గరంతా ముడతలు పడ్డాయి. అతనికి కళ్లు కనిపించనంతగా రెప్పలు వాలిపోయి మూసుకు పోయాయి.
 
  కళ్లను తెరిచి ఉంచ డానికి రెప్పల్ని పైకి పట్టి ఉంచేలాగ ఒక దళసరి పట్టీతో నొసటి మీద కట్టుకొని ఉంటాడు. ఈ పట్టీ రహస్యం శ్రీకృష్ణుడెరుగును.ద్రోణుడు సేనాధిపతిగా ఉన్న రెండోరోజున దుర్యోధనుడు తన గజసేనతో భీముడి మీద దొమ్మీకి దిగాడు. భీముడేమీ తక్కువ తిన లేదు. ఏనుగుల గుంపుమీద విరుచుకుపడ్డాడు. అతని బాణాల వేటులకు ఆ ఏనుగులన్నీ దెబ్బతిని కుంగిపోడంతో వాటి మదం పూర్తిగా దిగిపోయింది. భీమసేనుడి చేతిలో దుర్యో ధనుడు బహుపీడితుడు కాడాన్ని చూసి, అతనికి సాయంగా మ్లేచ్ఛుడైన అంగరాజు తన నాగేంద్రం మీద, అంటే, పెద్ద ఏనుగు మీద కూర్చొని భీముడికి ఎదురయ్యాడు. భీముడు ఆ ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టడంతో అది, కుప్పకూలిపోయింది.
 
  అంగరాజు కిందకు ఉరుకుదామని ప్రయత్నిస్తూంటే భీముడు అతడి తలను తెగేశాడు. అంగరాజు పతనం కావడంతో గాభరా పుట్టి కౌరవ సైనికులందరూ కకావికలై అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు.  సేనావ్యూహం భంగం కావడాన్ని చూసి భగదత్తుడు తన సుప్రతీకంతో భీముడి మీద ఎదురుదాడికి దిగాడు.భగదత్తుడి గజరాజు తన ఉక్కు పాదాలతో తొక్కడానికీ తొండంతో చుట్ట బెట్టడానికీ భీమసేనుడి మీదకు ఉరికింది. అయితే, భీముడికి ఒక గజ యోగం తెలుసు. ఆ యోగాన్ని అంజలికావేధమని అంటారు. ఏనుగు కింద ఒకచోట రెండు చేతులతో థపథపా తాకడంతో దానికి చాలా హాయిగా ఉంటుంది.
 
 ఆ సుఖ సమ యంలో మావటీడు అంకుశంతో పొడిచినా అది పట్టించుకోదు. భీముడికది తెలుసు. అందుకే ఆ ఏనుగు తన చుట్టూరా తిరు గుతూ పట్టుకొందామని చూస్తూ ఉంటే, గభాలున దాని కింద నుంచి బయటికి వచ్చి దాని ముందు నిలుచున్నాడు. అది అతన్ని కిందపడేసి తొక్కేదామని ప్రయత్నించింది. దాన్ని భ్రమలో పడేసి, తొండం మెలిక నుంచి తప్పించుకొని మళ్లీ దాని కిందకి చేరాడు భీముడు. ఈసారి బయటికి వస్తూనే దూరంగా పారిపో యాడు. అక్కడివాళ్లందరూ భీముడు వెళ్లి పోవడం చూడక, దాని అట్టహాసం చూసి అతను దాని దాడికి చనిపోయాడన్న భ్రమలో పడి గాభరాపడ్డారు.
 
 ఆ తరవాత దశార్ణరాజు ఏనుగు, పక్క నుంచి భగదత్తుడి ఏనుగు మీద దాడిచేసింది. ఆ రెండు ఏనుగులూ రెండు కొండల్లాగ ఢీకొన్నాయి. సుప్రతీకం దశార్ణ రాజు ఏనుగును చంపేసింది. భగదత్తుడు దశార్ణరాజును ఏడు ఈటెలతో చంపేశాడు. తరవాత సాత్యకి రథాన్ని తొండంతో చుట్ట బెట్టడానికి ఊపుమీద వస్తూన్న సుప్రతీ కాన్ని చూసి రథాన్ని వదిలి వెళ్లిపోయాడు సాత్యకి. ఆ ఏనుగు మాత్రం తన ఉద్య మాన్ని ఆపకుండా ఆ ఖాళీ రథాన్నే వేగంగా ఎత్తి కుదేసింది. ఆ విధంగా చాలా రథాల్నీ రాజుల్నీ ఎత్తెత్తి ఎగరెయ్యడం మొదలెట్టింది. అందరూ ఆ ఒక్క ఏనుగునీ కొన్ని వందల ఏనుగుల పెట్టుగా భావిస్తూ భయంతో వణికిపోయారు.
 
 ఈవిధంగా, ఇంద్రుడు ఐరావతం మీద కూర్చొని దానవుల్ని పారిపోయేలాగ  చేసినట్టు, భగదత్తుడు తన సుప్రతీకం మీద కూర్చొని పాండవ సైన్యాలను సంహరిస్తూ వీరవిహారం చేశాడు. తమ సైన్యానికి ధైర్యం చెబుదామని భీముడు కోపంతో భగదత్తుడి మీదకు దూసుకొని వచ్చాడు. అప్పుడు భీమసేనుడి గుర్రాల మీద సుప్రతీకం తన తొండంతో నీళ్లను కుమ్మరించింది. ఆ గుర్రాలు భయపడి  భీముణ్ని తీసుకొని దూరంగా పారిపో యాయి. ఆ మీద అభిమన్యుడూ, ద్రౌపది కొడుకులూ, చేకితానుడూ ధృష్టకేతువూ యుయుత్సువూ కలిసి సుప్రతీకాన్ని చంపేద్దామని దాన్ని బాణధారలతో ముంచెత్తారు.
 
 సుప్రతీకం యుయుత్సుడి గుర్రాల్ని, అతని సారథిని చంపేసింది. ధృతరాష్ట్ర పుత్రుడైన యుయుత్సువు కంగారుగా రథం నుంచి తప్పుకొని వెళ్లి అభిమన్యుడి రథం మీద కూర్చున్నాడు. అభిమన్యుడూ యుయుత్సుడూ ద్రోపదేయులూ ఒక్కసారిగా ఆ ఏనుగు మీద చాలా బాణాలనే గుప్పించి దాన్ని దెబ్బతీశారు. అంత దెబ్బ తిన్నా కూడా అది తన కుడీ ఎడమా ఉన్న శత్రు పక్షీయుల్ని ఎగరేసి విసిరేస్తూనే ఉంది. దాని ఆగడాలకూ అంతులేకుండా పోయింది. భగదత్తుడు పాండవ సేనను మాటిమాటికీ ఆవరిస్తూ బాధించాడు. పాండవ యోద్ధలందరూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. దూరంగా సంశప్తకులతో యుద్ధం చేస్తూన్న అర్జు నుడికి వారి ఆర్తనాదాలు వినిపించాయి.
 
 ఏనుగు చేస్తూన్న వీర ఘీంకారాలనూ అక్కడ ఉవ్వెత్తుగా లేచిన దుమ్మూ ధూళీ చూసి శ్రీకృష్ణుడితో అర్జునుడు ‘ఇంద్రుడికి తీసిపోని యోద్ధ భగదత్తుడు. గొప్ప గజ యాన విశారదుడు; భూమ్మీద గజ యోద్ధల్లో ప్రప్రథముడు కూడాను. అతని ఏనుగూ ఎదురులేనిదే. అతను అన్ని శస్త్రాలకూ అతీతుడు. బహు పరాక్రమం చూపిస్తూ శ్రమను కూడా జయించాడు. అతనొక్కడూ సమస్త పాండవ సైన్యాన్నీ వినాశం చేయగలడు. మన ఇద్దర్నీ తప్పించి అక్కడ అతన్ని ఎదిరించగల మొనగాడు కనిపించటం లేదు. అంచేత నువ్వు ఆ భగదత్తుడున్న చోటుకు రథాన్ని నడిపించు. తన ఏనుగుకున్న బలంతో పొగరుగా ప్రవర్తిస్తూన్న అతని అహంకారాన్ని ఈ రోజునే అంతం చేస్తాను నడు’ అంటూ తొందరపెట్టాడు.
 
 తీరా రథాన్ని అటు మలిపేసరికల్లా పద్నాలుగు వేల సంశప్తకులు అర్జునుడి వెంటబడి కదలనివ్వలేదు: దానిలో పది వేల మంది త్రైగర్తులు; తతిమ్మా నాలుగు వేల మందీ నారాయణీ సేన తాలూకు వాళ్లు. ఇప్పుడు అటు వెళ్లాలా ఇటు వీళ్ల పీచమడచాలా అని తేల్చుకోలేక కొంత సేపు ద్వైధీ భావంతో కొట్టుమిట్టాడి చివరికి సంశప్తకుల వైపే తిరిగాడు. ఆ సంశప్తకులందరూ అర్జునుణ్ని ఒక్కపెట్టున లక్ష బాణాలతో ముంచెత్తేసరికి కృష్ణుడికే ముచ్చెమటలు పోశాయి.
 
  అది చూసి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వేసి వాళ్లనందర్నీ చాలామటుకు నాశనం చేశాడు. రణ భూమంతా తలలూ మొండేలూ చేతులూ తొడలూ కాళ్లూ రక్తమ్మడుగులూ అయి కదలడానికి వీల్లేనంతగా తయారయింది. అదే అదను అని భగదత్తుడి వైపుకు నడి పించబోయాడు కృష్ణుడు పార్థ రథాన్ని. ఈసారి మళ్లీ సుశర్మ తన తమ్ముళ్లతో వెనకపడి వేధించడం మొదలుపెట్టాడు. అతన్ని అర్జునుడు తన బాణ సమూ హంతో వివశుడిగా చేశాడు. ఇక భగ దత్తుడి వైపు వెళ్లడానికి అర్జునుడికి అడ్డుపడే సాహసం ఎవడూ చేయలేదు.
 
 అర్జునుడు బాణవర్షం కురిపిస్తూ, పర్వతాన్ని ఢీకొన్న పడవకు పట్టే దుర్దశను కలిగించాడు మొత్తం కౌరవ సైన్యానికి. అది సహించలేక భగదత్తుడు తన ఏనుగుతో ధనంజయుడి మీదకు దూసుకొని వచ్చాడు. ఇద్దరూ తుములమైన యుద్ధం చేయడం ప్రారంభిం చారు. సుప్రతీకం అక్కడి ఏనుగుల్నీ రథాల్నీ రథికుల్నీ గుర్రాల్నీ ఆశ్వికుల్నీ యమలోకానికి పంపించే పని అవిచ్ఛి న్నంగా సాగిస్తూనే ఉంది. భగదత్తుడి పద్నాలుగు ఇనప గదల్ని ముక్కలు చేసేశాడు అర్జునుడు. ఏనుగు కవచాన్ని ఛేదించి, ఆ మీద బాణవర్షంతో దాన్ని ముంచెత్తాడు అర్జునుడు. అది వర్ష ధారలతో చిత్తడిసిన పర్వతంలా తయా రయింది. భగదత్తుడి రాజఛత్రాన్నీ ధ్వజాన్నీ ముక్కలు చేసి, వాడి అయిన బాణాలతో అతన్ని దెబ్బతీశాడు. కోపంతో భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశాన్నే వైష్ణవాస్త్ర మంత్రంతో అభిమంత్రించి అర్జునుడి మీదకు విసిరాడు.
 
 వైష్ణవాస్త్రం అన్నిటినీ సర్వనాశనం చేస్తుందని తెలిసిన కృష్ణుడు అర్జునుడికి అడ్డుగా వచ్చి ఆ అస్త్రాన్ని తన వక్షస్సు మీద గ్రహించాడు. అది కృష్ణుడి మెడలో వైజయంతీమాలగా మారిపోయింది. అర్జునుడు నొచ్చుకుంటూ కృష్ణుడితో, ‘నువ్వు యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడేం చేశావు కృష్ణా! నేను నన్ను రక్షించుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ పని చేయడం సరేమో గాని ఇప్పుడది సరి కాదు గదా’ అని చాలా బాధపడ్డాడు. అప్పుడు కృష్ణుడు వైష్ణవాస్త్రం తాలూకు అమోఘత్వాన్ని వివరించి చెప్పాడు: ‘దాన్ని నేను తప్ప ఎవరూ నాశనం చెయ్య లేరు. ఇప్పుడది పోయింది గనక ఆలస్యం చేయకుండా, వాడి నాన్నను లోకహితం కోసం నేను చంపినట్టు, నువ్వు ధర్మం కోసం భగదత్తుణ్ని అంతం చెయ్యి. ముందస్తుగా అతని రెప్పలక్కట్టిన పట్టీని కొట్టి వాడి కళ్లు మూసుకొనిపోయేలాగ చెయ్యి’ అంటూ ఉపాయాన్ని ఉపదే శించాడు.
 
 కృష్ణుడి ఉపదేశాన్ని పార్థుడు అమలు చేశాడు. భగదత్తుణ్ని బాణాలతో ముంచెత్తి, అతని ఏనుగు కుంభస్థలాన్ని బాణంతో వేటు వేశాడు. ఏనుగు తటాలున కూలిపోయింది. అతని రెప్పల్ని కట్టిన పట్టీని అర్జునుడు భగదత్తుడికి లోకమంతా చీకటిమయమై పోయింది. అప్పుడు ఒక అర్ధచంద్ర బాణంతో భగదత్తుడి గుండెను చీల్చగానే అతను నేలకూలిపోయాడు. పొగరుతోనూ కండ కావరంతోనూ కన్నూ మిన్నూ కానకుండా పరుల్ని విచక్షణ లేకుండా విధ్వంసం చేసే నిర్దయనూ నిరంకుశత్వాన్నీ ఇలాగే ఉపాయంతో నాశనం చేయాలి.
 

Advertisement
Advertisement