
పరాన్న 'చిరు' జీవి
గంజన్నాడు... బెంజన్నాడు... అన్ని తెలుసన్నాడు. తనతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నాడు.
గంజన్నాడు... బెంజన్నాడు... అన్ని తెలుసన్నాడు. తనతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నాడు. ప్రజా సేవే పరమావది అని ప్రజా రాజ్యం పార్టీ పెట్టాడు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు... తొక్కలో పార్టీలని, ప్రజలకు సామాజిక న్యాయం చేయలేక చేతులెత్తేసాయని ఎద్దేవా చేశాడు. ఆ పార్టీలను పాతాళంలోకి తొక్కాలన్నాడు. వృద్ధ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా ఢిల్లీ నుంచే, టీడీపీ అంతా 'బాబు' చట్టూనే తిరుగుతోందని దుయ్యబట్టాడు. తన పార్టీతో ప్రజలదే అధికారం కట్టబెడతానన్నాడు. ఎన్నికల్లో సత్తా చాటి 180 స్థానాలు గెలుచుకుని పాలన పగ్గాలు చేపట్టి రాష్ట్రంలో కొత్త పరిపాలనకు నాంది పలుకుతానని ఊదరగొట్టేశాడు. 'మెగాస్టార్' సినిమా డైలాగులకు ఓట్లు రాలేదు. మనోడికి తర్వాత ఎట్లాగో రాజకీయ 'శూన్యం' తప్పదని రాష్ట్ర ప్రజలు ముందుగానే ఊహించారు. అందుకే కేవలం రెండు అంకెలు అంటే 18 సీట్లులో గెలిపించి ఉరుకున్నారు. ఇది ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009 నాటి మాట.
ఎంతో ఊహించుకుని పార్టీ పెట్టిన చిరంజీవికి నిదానంగా పాలిటిక్స్ అర్థమవుతూ వచ్చాయి. దాంతో జెండా పీకేసి తన పార్టీని హస్తం పార్టీతో కలిపేశాడు. కొన్ని 'షరతు'లతో తన పరివారంతో కాంగ్రెస్లో చేరిపోయాడు. ఒప్పందం ప్రకారం తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజ్యసభలో అడుగుపెట్టాడు. ఆనక కేంద్ర అమాత్య పదవిని కూడా అలంకరించాడు. అంతేకాకుండా తనకు అత్యంత అనుకూలమైన ఇద్దరు వ్యక్తులకు రాష్ట్ర మంత్రి పదవులు ఇప్పించాడు. సామాజిక న్యాయం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఆ మాటే మర్చిపోయి స్వలాభం చూసుకున్నారు. సొంత పార్టీని నడిపే దమ్ములేక కాంగ్రెస్లో పరాన్న జీవిగా వాలిపోయారు. పరాయి పార్టీలోనూ కనీసం సొంతవారికి కూడా న్యాయం చేయలేక పరాన్న'చిరు'జీవిగా మిగిలారు.
విభజన విషయంలోనూ గట్టిగా వ్యవహరించలేకపోయారు చిరంజీవి. హైదరాబాద్ యూటీ అంటూ 'ఒకే ఒక్కరాగాన్ని' పట్టుకుని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆలపిస్తు రాష్ట్ర విజభనపై కిమ్మనకుండా ఉండిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన విషయంలో దూసుకువెళ్లిన ఎక్కడా ఎటువంటి అడ్డుచెప్పకుండా, అడ్డంకులు సృష్టించకుండా మంచి బాలుడుగా మార్కులు కొట్టేసేందుకు తాపత్రయపడ్డారు. దీనికి బహుమానంగా రాష్ట్రానికి చివరి సీఎం పోస్టు దక్కుతుందని ఆశించినా నిరాశే ఎదురయింది. సొంత పార్టీ ద్వారా తీరని 'ముఖ్య' కొరికను కాంగ్రెస్ తీరుస్తుందని భావించినా సాకారం కాలేదు. అయితే అధిష్టానం మరోసారి 'చిరు' తాయిలం ఆశ చూపుతోంది. రానున్న ఎన్నికల్లో సీమాంధ్ర ప్రచార బాధ్యతలు ఆయనకు కట్టబెట్టాలని భావిస్తోంది. పెట్టిన పార్టీని పాతిపెట్టి పరాయి పార్టీలో 'చిరు'జీవిగా చెలామణి అవుతున్న ఈ సీనియర్ నటుడు తర్వాతి స్టెప్ ఏంటో చూడాలి.