కలత ఘటనల నుంచి కోలుకొని సాగిపోవాలి ముందుకు

Should Be A Positive Outlook On The Future And Move On From The Events - Sakshi

మైండ్‌ స్టోరీ

స్పందించడం మంచిదే. ఆరోగ్యకరమైన స్పందన ఉండాల్సిందే. కాని అతి స్పందన అవసరం లేదు. సమాజంలో జరుగుతున్న దారుణమైన ఘటనలకు అతిగా స్పందించి, అవి మనకే జరిగితే అని పదేపదే ఆలోచిస్తూ వ్యాకుల పడితే ప్రమాదం. ఈ దశను దాటాలి. భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. కలత ఘటనల నుంచి ముందుకు సాగాలి. అలా సాగమని చెప్పేదే ఈ కథనం.

సృజనను సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆమెకు నలభై ఏళ్లుంటాయి. మనిషి కలతగా ఉంది. కన్నీరుగా ఉంది. ఉలికిపాటుగా ఉంది. అపనమ్మకంగా ఉంది. తనకేదో ప్రమాదం రాబోతున్నట్టుగా ఉంది. ‘ఏమిటి సంగతి?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్‌ ఆమెను తీసుకొచ్చిన భర్తని. ‘వారం రోజులుగా తన పరిస్థితి బాగోలేదు డాక్టర్‌. ఒళ్లు హటాత్తుగా చల్లబడిపోతూ ఉంటుంది. అర్ధరాత్రి లేచి కూచుంటోంది. ఎప్పుడూ పక్కన మనిషి ఉండాలంటుంది. మాటిమాటికి వెళ్లి మా అమ్మాయి ఉన్న తలుపు తెరిచి అమ్మాయి లోపల ఉందా లేదా అని చూసి వస్తుంటుంది. దేనిమీదా ధ్యాస లేదు. ఎప్పుడూ టీవీ చూస్తూ ఉలికులికిపడుతుంటుంది. ఏమిటి నీ భయం అంటే ఏమీ చెప్పదు.

మాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు తీసుకొచ్చాము’ అన్నాడు భర్త. ఆయన హైస్కూల్‌ టీచర్‌గా పని చేస్తున్నాడు. ‘మీ అమ్మాయి వయసెంతా?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్‌. ‘21 సంవత్సరాలు’ ‘ఏం చేస్తుంటుంది?’ ‘కొత్తగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరింది. షిఫ్ట్‌లుంటాయి. క్యాబ్‌ వచ్చి పికప్‌ చేసుకుంటుంది. ఇవాళ లీవ్‌ పెట్టి తోడొచ్చి బయట కూచొని ఉంది. తనకేం ప్రాబ్లం లేదు. తను బాగుంది. ఈమే’... అని ఆగాడు. ‘సరే.. మీరెళ్లండి.. మాట్లాడతాను’ అని చెప్పి పంపించాడు. అతను వెళ్లాక సృజనను అడిగాడు – ‘చెప్పండమ్మా.. ఎందుకిలా ఉన్నారు?’ ‘ఏమో డాక్టర్‌... నాకు భయంగా ఉంటోంది. నిద్రపోతే నలుగురు మనుషులు నా కూతురిని చుట్టుముట్టినట్టుగా అనిపిస్తోంది. లాక్కెళుతున్నట్టుగా కనపడుతుంది. ఒకటే భయం.

నిద్ర లేచేస్తాను’ ‘ఎందుకలాంటి కలలొస్తున్నాయి?’ ‘ఈ మధ్య జరిగిన ఘటనను టీవీలో పదేపదే చూశాను. చాలా బాధ కలిగింది. పాపం ఆ అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. ఆ తల్లిదండ్రుల దుఃఖం చూడలేకపోయాను. అలా టీవీ చూస్తూ ఉంటే సడన్‌గా నాకు ఏమిటోగా అనిపించింది. ఆ తల్లి స్థానంలో నేనున్నట్టుగా, ఆ అమ్మాయి స్థానంలో నా కూతురు ఉన్నట్టుగా అనిపించడం మొదలెట్టింది. అంతే. నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. కన్ను తెరిచినా మూసినా అలాంటి నరకం నా కూతురికి ఎదురైతే నేనేం కావాలి అన్నదే నా భయం’ అందామె. ‘మీరు మీ బాల్యంలోగాని టీనేజ్‌లోగాని ఇలాగే ఏ విషయానికైనా కలత పడ్డారా?’ ‘పడ్డాను డాక్టర్‌. నేను ఎవరి కష్టాన్నీ గట్టిగా చూళ్లేను. ఒకవేళ చూస్తే ఆ కష్టం నాకే వచ్చినట్టు బాధ పడి ఇబ్బంది తెచ్చుకుంటాను’ అందామె.

డాక్టర్‌ ఆమెకు మంచినీళ్లిచ్చాడు. ‘చూడండమ్మా... మీకు పెద్ద జబ్బేమీ లేదు. కొంచెం సున్నితంగా ఉన్నారు. పెను ఘటనలు చూసినప్పుడు అవి నాలుగు రకాల మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. సెన్సిబుల్‌ పర్సనాలిటీస్, డిపెండెంట్‌ పర్సనాలిటీస్, యాంగ్జియస్‌ పర్సనాలిటీస్, డిప్రెసివ్‌ పర్సనాలిటీస్‌... ఈ నాలుగు రకాల్లో మీరు ఏదో ఒక రకం అయి ఉండాలి. ‘దిశ’లాంటి ఘటనలు జరిగినప్పుడు పౌరులుగా మనం స్పందించాలి. మార్పు జరగాలని ఆశించాలి. అది కరెక్ట్‌. కాని తీవ్రంగా దాని గురించే ఆలోచిస్తూ అనుక్షణం అదే బుర్రలో నింపుకోవడం సరికాదు. ఫస్ట్‌ మీరు రిలాక్స్‌ కండి. ఊహించని చెడు ఘటనలు, ప్రమాదాలు, వైపరీత్యాలు అనాదిగా జరుగుతున్నాయి అని గుర్తు చేసుకోండి.

మనం ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత జాగ్రత్తలో ఉండాలి, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా చెక్‌ చేసుకొని ముందుకు సాగిపోవాలి. అంతే తప్ప అక్కడే ఆగిపోకూడదు’ అని బెల్‌ నొక్కాడు. భర్త, కూతురు లోపలికి వచ్చారు. ‘చూడండి.. ముందు మీ భార్యను మాట్లాడనివ్వాలి. ఆమె చెప్పేది మీరు పదే పదే వినాలి. ఆమె దేనికి భయపడుతోందో దానికి వెంటిలేషన్‌ ఇవ్వాలి. కసరొద్దు. ఆపు అనొద్దు. అదంతా మాట్లాడి మాట్లాడి ఖాళీ అయిపోవాలి. అప్పుడు మీరు ఆమెకు ధైర్యం మాటలు మాట్లాడాలి. ఆమెను నార్మల్‌గా ఉంచాలి. పాజిటివ్‌ విషయాలను చూపించాలి. పాటలు వినిపించాలి. ఆమెకు ఏదైనా వ్యాపకం ఉంటే అందులో బిజీగా ఉంచాలి. ఒకటి రెండు మందులు రాస్తాను అవి కూడా సాయం చేస్తాయి.’

అన్నాడు డాక్టర్‌. ఆ తర్వాత సృజనతో మళ్లీ అన్నాడు. ‘సృజనగారూ... రాక్షసులు ఎప్పుడూ ఉన్నారు. కాని వారి సంఖ్య చాలా తక్కువ. మరి దేవతలు? ముక్కోటిమంది ఉన్నారని మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే చెడు కంటే ఎప్పుడూ మంచి శాతమే ఎక్కువగా ఉంటుంది. మంచి తనను తాను కాపాడుకుంటుంది. మీకూ మీ అమ్మాయికి ఎప్పుడూ ఏమీ కాదని మనస్ఫూర్తిగా అనుకోండి. ఇప్పటికే మీ అమ్మాయి తన హ్యాండ్‌బ్యాగ్‌లో పెప్పర్‌ స్ప్రే పెట్టుకొని తిరుగుతోంది. తన ఫోన్‌ డిస్‌ప్లేలో పోలీస్‌ నంబర్‌ను క్విక్‌ డయల్‌గా పెట్టుకుని ఉంది. ఇంకేం భయం చెప్పండి’ అని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆమె మెల్లమెల్లగా తేరుకోవడం కనిపించింది. ఎవరైనా చేయాల్సింది అదే. తేరుకుని ముందుకు సాగడం.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top