
జీవితం
ప్రకృతి నుండి
పాట నుండి
విడదీసి చూడలేమని
నేను ఎన్నోసార్లు గొంతు చించుకుని నినదిస్తే
అది ఏదో నా పాటల గొడవనుకున్నారు
నిజమే అనుకొన్నా
నేను మర్చిపోయాను
ముచ్చర్ల సత్తెన్న బతుకు కథ సదివితే
బతుకే ఓ పోరాటం
ఓటమి గెలుపుల పయనం
ఏటికి ఎదురీదడం
ప్రకృతి నేర్పిన సత్యం, సత్యం, సత్యం
మా సత్తెన్న బతుకు పాటల బతుకు
ఉత్తుత్త నీటి పాటలు, చప్పట్ల పాటలు కావు
అవి జ్ఞాన పాటలు, విజ్ఞాన బాటలు
రాజును, రాజ్యాన్ని ప్రశ్నించే పాటలు
ప్రశ్నించే వరకే ఊరుకోడు
ఆ ప్రశ్నలకు తానే పరిష్కరించే మార్గాలను
అన్వేషిస్తాడు
ఒక ఆచరణ కార్యక్రమం రూపొందిస్తాడు
కార్యక్రమానికి ఒక నిర్మాణరూపం పొందిస్తాడు
ఆ నిర్మాణంలో భాగమవుతాడు
నడిపించే నాయకుడవుతాడు
రాజకీయంగా పరిష్కరించే
ఓ రాజనీతిజ్ఞుడవుతాడు
అప్పుడు మేము పాటల కవులం
సత్యాన్ని శోధించి, ప్రశ్నించి, ఆచరించి
అక్షరానికి అమరత్వాన్ని సమకూర్చుతామంటాడు
రాజును, రాజ్యాన్ని ప్రశ్నించేవాడే
ఆ కాలం వాగ్గేయకారుడని నిరూపిస్తాడు
ముచ్చర్ల సత్తెన్న/ ధిక్కార కెరటం
రూపమై, దీపమై/ వెలుగుతూ, ఆరిపోతూ
ఆరిపోతూ, వెలుగుతూ/ కొనసాగిపోతాడు
మనం ముచ్చర్ల సత్తెన్న
అడుగులో అడుగై/ నడకలో నడకై
ఆయన బాటలో/ సాగిపోదాం
గద్దర్
రెండు పక్షులూ ఒక జీవితం
‘పగలే
శూన్యాన్ని తిడుతూ కూర్చునే
భర్త పరిస్థితిని తలుచుకొని
ఆమె
తన తల్లిగారింటిలో
ఇలా అనుకుంటుంది
ఇప్పుడు గుర్తుకొస్తుందా
వెలుతురుతోనే ఇల్లు వెలగదని
ఇక అతడికి
ఈ రాత్రేం కానుందో’
కొత్తగా జీవితంలోకి ప్రవేశించిన ఇరువురు స్త్రీ–పురుషులు తమలో తాము, తమతో తాము చేసుకునే సంభాషణల్లాగా రాసిన కవిత్వం ‘రెండు పక్షులూ ఒక జీవితం’. దీన్ని మొదట ఫేస్‌బుక్ వేదికగా మూడు నెలల పాటు ధారావాహికగా రాశారు బూర్ల.
‘దంపతుల మధ్య లోపిస్తున్న అవగాహనను సరిచేయడానికి సున్నిత సరస సంభాషణే ఔషధం’ అన్న ఎరుక దీనికి మూలకందం.
కవి: బూర్ల వేంకటేశ్వర్లు; పేజీలు: 94; వెల: 100; ప్రచురణ: సాహితీ సోపతి; ప్రతులకు: బి.సంతోష, 2–10–1524/10, ఫ్లాట్ నం: 403, వెంకటేశ్వర టవర్, జ్యోతినగర్, కరీంనగర్–505001. ఫోన్: 9491598040
సోహం
యింకా వుపయోగించని శంఖం వుంది
చేతిలో
వంచని తల వుంది
గుండె వుందిరా
నడచిన దారి వుంది
వెలుగుతూ
విచ్చుకొనే లక్ష రక్త కణాలున్న దేహం వుంది
కాంక్షతో
లోనికి లోనికి లోనికి చూచుకొనే అద్దం వుంది
మెరుస్తూ
నిరంతరం ప్రవహించే నది లాంటి
దుఃఖం వుంది కదా
నీతో నువ్వు నిశ్శబ్దించే స్వప్నం వుంది
కురుస్తూ
యింకా తెరవని మరణం వుంది కదా
మోహంతో
దాము