నాన్న నేర్పేవే ఎక్కువ! | Sakshi
Sakshi News home page

నాన్న నేర్పేవే ఎక్కువ!

Published Tue, Feb 18 2014 11:49 PM

నాన్న నేర్పేవే ఎక్కువ!

బంధం
  మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవోభవ అంటూ ఓ ఆర్డర్ చెప్పారు పెద్దలు. కడుపులో మోసి కన్నందుకు మాతృమూర్తి ఒక దేవత అవుతుంది. కానీ పితృదేవుడికి ఓ సౌలభ్యం ఉంది. ఒక్క మాతృమూర్తి తప్ప... అన్ని దేవతామూర్తులుగా అవతరించగల సౌలభ్యం ఉన్నది నాన్నకే. పితృదేవుడే చాలాసార్లు ఆచార్యదేవుడయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే విజయసాధకులు చాలామంది తమ తండ్రే తొలి గురువు అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక శ్లోకం, ఒక సుభాషితం, ఒక నీతి కథ చెప్పి... పై శ్లోకంలోని రెండు స్థానాలను ఏకకాలంలో ఆక్రమించగల సౌలభ్యం మాతృమూర్తి కంటే... పితృదేవుడికే ఎక్కువ. అందుకే... ఒట్టు....
 ఆ దేవుడు... అనేక దేవతల పెట్టు!
 
 ఏడుపు, నవ్వు, కోపం, బాధ వంటి భావోద్వేగాలు పుట్టుకతో కొన్ని, తల్లి పాఠాలతో కొన్ని అబ్బుతాయి. జీవించి ఉన్నంత వరకు ఇవి మనతో ఉండే లక్షణాలు. అమ్మ తినడం నేర్పుతుంది, మాట్లాడటం నేర్పుతుంది, నడవడం నేర్పుతుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే అమ్మ అన్నీ నేర్పుతుంది. కానీ, సమాజంలో మనుగడ సాగించడానికి ఇవన్నీ వస్తే చాలదు. ఇవి కేవలం ఒక శరీరం బతకడానికి అవసరమైన విషయాలు. కానీ, సంఘజీవి అయిన మనిషి సమాజాన్ని చూడటం నేర్చుకోవాలి. లోకజ్ఞానం సంపాదించుకోవాలి. అంటే పరిస్థితులను అర్థం చేసుకోవడం, వాటిని అన్వయించుకోవడం తండ్రి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాడు. అందుకే తండ్రి వల్ల తెలుసుకునే విషయాలకు స్పందించే గుణాలు... తల్లి ఇచ్చిన జ్ఞానంలో ఉంటాయి. అంటే తల్లి ద్వారా బిడ్డ ఎమోషనల్ కొషెంట్ (ఈక్యూ) నేర్చుకుంటే తండ్రి ద్వారా ఇంటెలిజెంట్ కొషెంట్ (ఐక్యూ) నేర్చుకుంటాడు. సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమాజాన్ని అనునయించడం రాకపోతే... ఎంత అక్షర జ్ఞానమున్నా వృథా.
 
 ఇక తండ్రితో మాత్రమే ఉండే లాభాలయితే బోలెడుంటాయి. అవి భలే ముచ్చటగా ఉంటాయి. అమ్మతో కొన్నేళ్లే ఆడుకోగలం. కానీ నాన్నతో అయితే ఎక్కువ కాలం ఆడుకోగలం. నాన్న గుడ్ టీమ్ ప్లేయర్. అమ్మకు ఏమైనా చెబితే మనతోపాటు తను కూడా బాధపడుతుంది. కానీ నాన్నకు చెబితే తను మన బాధనే తగ్గిస్తాడు. అమ్మ ప్రేమనిస్తుంది. నాన్న ప్రేమతో కూడిన రక్షణనిస్తాడు, భద్రతాపరమైన రక్షణ ఇస్తాడు. అమ్మ... ఆనందం. నాన్న... ఆనందం, అండ... రెండూను!
 
 అమ్మ అటాచ్‌మెంట్ నేర్పితే, నాన్న డిటాచ్‌మెంట్ నేర్పుతాడు; డిటాచ్డ్‌గా ఉంటూ అటాచ్డ్‌గా ఉండటమెలాగో చెబుతాడు. నాన్న ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోడు... స్వేచ్ఛనిస్తాడు. అలాగని అమ్మ అడ్డుకోదు... జాగ్రత్త పేరుతో కట్టడి చేయాలనుకుంటుంది. అందుకే... సాహసాలు నాన్నతోనే పరిచయం అవుతాయి. కొడుకు ఎప్పుడూ ఒక స్త్రీ గురించి తెలుసుకోవడానికి తల్లిని ఆధారం చేసుకోడు. ఎందుకంటే... అమ్మను కొడుకు ఎప్పుడూ ఒక స్త్రీ అనే కోణంలో చూడడు. అదే కూతురయితే... ఇతర పురుషుల గురించి ఒక అవగాహన తెచ్చుకోవడానికి తండ్రి (లక్షణాలు)ని ఆధారం చేసుకుంటుంది. పిల్లల జీవితంలో తండ్రి స్థానం అదీ మరి!
 
 తండ్రితో మాత్రమే ఉండే లాభాలయితే బోలెడుంటాయి.అవి భలే ముచ్చటగా ఉంటాయి.అమ్మతో కొన్నేళ్లే ఆడుకోగలం. కానీ నాన్నతో అయితే ఎక్కువ కాలం ఆడుకోగలం. నాన్న గుడ్ టీమ్ ప్లేయర్. అమ్మకు మైనా చెబితే మనతోపాటు తను కూడా బాధపడుతుంది.కానీ నాన్నకు చెబితే తను మన బాధనే తగ్గిస్తాడు.
 

Advertisement
 
Advertisement