అట్టుడుకుతున్న హాంకాంగ్‌

Hong kong Protests Over The Extradition Bill - Sakshi

ఒప్పందంలో ఇచ్చిన హామీలను నీరుగార్చాలని చూసిన చైనా ఎత్తుగడలకు వ్యతిరేకంగా ఇప్పుడు హాంకాంగ్‌ భగ్గుమంటోంది. తమ స్వేచ్ఛాస్వాతంత్య్రాలపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్న చైనా నాయకత్వాన్ని హాంకాంగ్‌ పౌరులు నిలదీస్తున్నారు. వారంరోజులుగా ఆ నగరం నిరసనలతో హోరె త్తుతోంది. హాంకాంగ్‌లో నేరాలకు పాల్పడే వారిని చైనాకు  అప్పగించడానికుద్దేశించిన నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు ఈ ఆగ్రహావేశాలన్నిటికీ మూలం. బ్రిటన్‌కున్న లీజు ముగిశాక 1997 జూలై 1న హాంకాంగ్‌ మళ్లీ చైనాకు వశమైంది. ఈ విలీనం కావడం తమకు సమ్మతం కాదని స్వతంత్ర నగర రాజ్యంగా ఉంటామని ఆనాడు అక్కడివారు పట్టుబట్టారు. అయితే హాంకాంగ్‌ ప్రజాస్వామ్య వ్యవస్థ యధాతథంగా ఉంటుందని చైనా నేతలు హామీ ఇచ్చారు. వారికి సార్వత్రిక ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. తమ నాయకుడు డెంగ్‌ జియావో పెంగ్‌ అంతకు కొన్నేళ్లక్రితం హాంకాంగ్‌ చైనా పరిధిలోకొస్తే ‘ఒక దేశం–రెండు వ్యవస్థలు’ విధానాన్ని పాటిస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. చైనా విధానాలేవీ హాంకాంగ్‌ను తాకబోవని చెప్పారు. అది పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకొచ్చేవరకూ... అంటే 2047 వరకూ నగర స్వయంపాలనే ఉంటుందని వాగ్దానం చేశారు.

1997లో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఖరారైనప్పుడు చైనా, తైవాన్‌లను అందులో చేర్చలేదు. హాంకాంగ్‌ అనుసరిస్తున్న ప్రమాణాలకు ఆ రెండుచోట్లా అమలవుతున్న నేర న్యాయవ్యవస్థ విరుద్ధం గనుక ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకు చైనా కూడా అంగీకరించింది. కానీ హాంకాంగ్‌కు ఇచ్చిన ఇతర హామీల్లాగే దీన్ని కూడా నీరు కార్చాలని చైనా ప్రయత్నిస్తోంది. తన అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడేవారిని అది ఇప్పటికే శత్రువులుగా పరిగణిస్తోంది. రకరకాల సాకులతో అపహరించడం కూడా రివాజే. ఇప్పుడు నేరస్తుల అప్పగింత చట్టానికి తీసుకురాదల్చిన సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే అటువంటి వారందరినీ చైనాకు ‘చట్టబద్ధంగా’ తరలించి అక్కడి చట్టాల కింద విచారించి దశాబ్దాలపాటు ఖైదు చేయడమో, మరణశిక్ష వంటివి విధించడమో చేసే ప్రమాదం ఉన్నదని ఉద్యమకారులు ఆందోళనపడుతున్నారు. అయితే ఇవన్నీ ఉత్త అనుమానాలే నని నగర చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కారీ లామ్‌ చెబుతున్నారు. ఎవరినైనా నేరుగా చైనాకు అప్పగించడం ఉండదని, ప్రతి కేసునూ పరిశీలించి అవసరాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటామని ఆమె అంటు న్నారు. కానీ దీనికొక మెలిక ఉంది. తాజా సవరణలు గత కాలంనుంచి అమల్లోకొచ్చేవిధంగా రూపొందించారు. సారాంశంలో బిల్లు ఆమోదం పొందగానే పాత కేసుల్ని తవ్వి తీసి, వాటిల్లో నిందితులుగా ఉన్నవారిని చైనాకు అప్పగించే అవకాశం లేకపోలేదు. 

వాస్తవానికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థే పెద్ద ప్రహసనంలా నడుస్తోంది. స్వయంపాలన అమలు చేస్తామని, నగర నిర్వహణ చూసే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను ప్రజలే ఎన్నుకోవచ్చునని 1997లో చైనా హామీ ఇచ్చింది. అది 2017 నుంచి అమలు చేస్తామని చెప్పింది. అంతవరకూ పాలనా వ్యవహా రాలు సాఫీగా సాగడానికి భిన్న రంగాలనుంచి కొందరు వ్యక్తుల్ని తానే ఎంపిక చేసి ఒక కమిటీని ఏర్పరిచింది. ఆ కమిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకునే విధానాన్ని ఏర్పరిచింది. కానీ 2017 నుంచి అమల్లోకి రావాల్సిన ఎన్నికల విధానాన్ని చైనా నీరుగార్చింది.  ఇప్పటికీ చైనా అనుకూలురదే నగర నిర్వహణ వ్యవస్థలో మెజారిటీ. వారిద్వారా ఎన్నికైన కారీ లామ్‌ ఆచరణలో చైనా ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారు. 2017లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించాక పాలనావ్యవస్థలోని చైనా వ్యతిరేకుల్ని అనర్హులుగా ప్రకటించారు. ఉద్యమకారులు ఎన్నికల్లో పాల్గొనడాన్ని నిషేధిం చారు. వారిని అరెస్టు చేయించారు. ఇవన్నీ చైనా మెప్పు పొందడానికి ఆమె తీసుకున్న చర్యలే. మరోపక్క చైనా వ్యతిరేకులుగా ముద్రపడినవారిని ఆ దేశం అపహరిస్తుంటే ఆమె నోరు మెదప లేదు. ఉద్యమకారుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటికైతే సవరణ బిల్లుపై జరిగే చర్చను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ ఉద్యమం మరికొన్నాళ్లకు చల్లారక తప్పదన్న అభిప్రాయంతో చైనా ఉంది. సరిగ్గా ఆ కారణం వల్లే ఉద్యమాన్ని దీర్ఘకాలం కొనసాగించాలని ఉద్యమకారులు నిర్ణయిం చుకున్నారు.

తాజా సవరణలు అమల్లోకొస్తే అక్కడుండే తమ పౌరుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉంది. అమెరికాకు చెందిన 1,300 సంస్థలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆ దేశ పౌరులు 85,000మంది వ్యాపారం, ఇతర రంగాల్లో పని చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా పౌరులు లక్షమంది, బ్రిటన్‌కు చెందిన 50,000మంది అక్కడుం టున్నారు. కొత్త చట్టం అమలైతే వీరందరూ చైనా ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని ఆ దేశాల భావన. బ్రిటన్‌ వలసగా ఉన్నప్పుడు హాంకాంగ్‌లో ఉదారవాద ప్రజాస్వామ్యం అమలయ్యేది. భావప్రకటనా స్వేచ్ఛ ఉండేది. కానీ ఆ నగరం చైనా ఛత్రఛాయలోకి వచ్చాక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే మీడియా సంస్థలపై నిఘా మొదలైంది. అప్రకటిత సెన్సార్‌ షిప్‌ అమలు ప్రారంభమైంది. కొన్ని చానెళ్ల లైసెన్స్‌ల గడువు తీరాక వాటిని పునరుద్ధరించడాన్ని నిలిపేశారు.

గతంతో పోలిస్తే హాంకాంగ్‌ ఆర్థిక వ్యవస్థ కూడా అంతంతమాత్రమే. 1997నాటికి చైనా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో హాంకాంగ్‌ వాటా 16 శాతం. ఇప్పుడది కేవలం 2 శాతం మాత్రమే. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకూ, ఎదుగుదలకూ హాంకాంగ్‌ ఇప్పటికీ తోడ్పడుతోంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని కనీసం హామీ ఇచ్చినవిధంగా హాంకాంగ్‌లో యధాతథ స్థితిని కొన సాగించాలని కూడా చైనా భావించడం లేదు. హాంకాంగ్‌ పౌరుల నిరసనోద్యమ ఉధృతిని గమ నించి ఇప్పటికైనా అది తన వైఖరిని మార్చుకోవాలి. తియనాన్మెన్‌ స్క్వేర్‌లో 1989లో వందల మందిని ఊచకోత కోసి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచిన తీరులోనే ఇప్పుడూ వ్యవహరిద్దా    మనుకుంటే ప్రపంచం ముందు దోషిగా నిలబడవలసి వస్తుందని అది గుర్తించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top