బాలికను పెళ్లి చేసుకొమ్మని బంధువులు ఒత్తిడి చేస్తుండటంతో తట్టుకోలేక
ముషీరాబాద్: బాలికను పెళ్లి చేసుకొమ్మని బంధువులు ఒత్తిడి చేస్తుండటంతో తట్టుకోలేక అగ్నిమాపకశాఖ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముషీరాబాద్ ఎస్‌ఐ సురేందర్ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సదాశివపేట మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ శివారెడ్డి (29) గాంధీనగర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో నివసిస్తూ గౌలిగూడలోని ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన బంధువులు కొందరు తమ బంధువుల అమ్మాయి (మైనర్)ని వివాహం చేసుకొమ్మని శివారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. బాలికతో తనకు పెళ్లి ఇష్టంలేదని చెప్పినా వినిపించుకోవడంలేదు.
ఈ నేపథ్యంలో శివారెడ్డి తన విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నాడు. బాలికను పెళ్లి చేసుకొమ్మని బంధువులు స్టేషన్ ఫైర్‌ఆఫీసర్ రాజ్‌కుమార్ ద్వారా కూడా ఒత్తిడి చేశారు. శివారెడ్డి నిరాకరించడంతో ఫైర్ ఆఫీసర్ వేధించడం మొదలెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన శివారెడ్డి తాను ఉంటున్న రూమ్‌లో తవల్‌తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్‌నోట్ దొరికింది. అందులో ‘‘నా మరణానికి నాగిరెడ్డి, మంజులతో పాటు బంధువులు 75 శాతం కారణం కాగా... ఆర్‌ఎంపీ హనుమంత్‌రెడ్డి పది శాతం, ఎస్‌ఎఫ్‌ఓ రాజ్‌కుమార్ 15 శాతం కారణం’ అని శివారెడ్డి పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.