
సెక్స్ వీడియో కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ నాగేశ్వరరావు
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : నరసాపురం తీరప్రాంతంలో సంచలనం సృష్టించిన సెక్స్ వీడియో కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసు వెలుగులోకి వచ్చి వారం రోజులు గడుస్తున్నా కీలక నిందితుడి ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పేరుపాలెం గ్రామంలో సెల్ పాయింట్ నడిపే ఆగిశెట్టి సాయి అనే యువకుడు ఓ యువతిని వలలో వేసుకుని ఆమెతో రాసలీలలు సాగించిన దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియోను సాయికి తమ్ముడు వరసయ్యే ఆగిశెట్టి గోపీనాథ్ దొంగిలించాడు.
గోపీనాథ్ సదరు అశ్లీల వీడియోను కటికల బాబులు, గుత్తుల నాగసత్తిబాబుకు ఇవ్వడం వారు సాయిని రూ.5 లక్షలు ఇవ్వమని బెదిరించారు. సాయి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో వీడియోను వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో పెట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కేసులో కటికల బాబులు మినహా మిగతా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాబులు అత్యంత కీలకమైన వ్యక్తి. అతడి ఆచూకీ ఇంతవరకూ లభ్యం కాలేదు. అంతేకాక కేసులో అతడిని ఏ–4గా నమోదు చేశారు. దీనిపై స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం కేసును నిష్పక్షపాతంగానే దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
చాలాకాలంగా బాబులు లీలలు
శృంగార బలహీనతలు ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని కటికల బాబులు చాలాకాలంగా లీలలు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. మహిళలను మోసగించడం, అతని ట్రాప్‌లో పడ్డ మహిళలను ఉపయోగించుకుని బెదిరింపు వ్యవహారాలు నడిపి, లక్షలకు లక్షలు చాలామంది వద్ద గుంజినట్టుగా వార్తలు వస్తున్నాయి. భీమవరంలో ఓ వైద్యుడు వద్ద రూ.50 లక్షలపైనే వసూలు చేశారని చెపుతున్నారు. అలాగే బాబులు బారిన పడి సాక్షాత్తూ అతడి సమీప బంధువులే డబ్బులు పోగొట్టుకుని ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తోంది. ఇతని వ్యవహారాలపై గ్రామంలో కథలు, కథలుగా చెప్పుకుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇతని బారిన పడి రోడ్డునపడ్డ బాధితుల జాబితా పెద్దగానే ఉంటుందని సమాచారం.
అన్ని కోణాల్లో దర్యాప్తు
గతంలో నరసాపురంలో జరిగిన శ్రీగౌతమి హత్య కేసులో పోలీసుల ప్రతిష్ట పూర్తిగా మసక బారింది. యాక్సిడెంట్ మాటున శ్రీగౌతమిని పక్కా స్కెచ్‌తో హత్య చేస్తే, పోలీసులు మాత్రం 15 రోజుల్లోనే కేసును యాక్సిడెంట్‌గా క్లోజ్ చేశారు. గౌతమి సోదరి పావని సీబీసీఐడీని ఆశ్రయించి పోరాటం చేయడంతో చివరికి అది హత్యకేసుగా తేల్చారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వంలా ప్రస్తుతం పరిస్థితులులేవు. నేరాల అదుపు విషయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. బాబులు స్కెచ్‌తోనే వీడియోలు నెట్‌లో పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు బాబులు మొత్తం వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి బయటకు చెప్పలేని బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం. మొత్తంగా బాబులు దొరికితేనే గానీ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు.