స్వల్ప లాభాలతో సరి | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాలతో సరి

Published Fri, Apr 20 2018 12:22 AM

What changed your markets while you were sleeping - Sakshi

పరిమిత శ్రేణి లాభాలతో కదలాడిన గురువారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు ఎగియడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. అయితే ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరడంతో చమురు షేర్లు కుదేలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 96 పాయింట్లు లాభపడి 34,427 పాయింట్ల వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి 10,565 పాయింట్ల వద్ద ముగిశాయి.  

టీసీఎస్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వంటి కొన్ని కీలక కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ ఆశావహంగా ఉండటం సానుకూల ప్రభావం చూపించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. టీసీఎస్‌ మంచి ఫలితాలను వెల్లడిస్తుందనే అంచనాలు, డాలర్‌తో రూపాయి మారకం ఏడు నెలల కనిష్టానికి పడిపోవడంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 147 పాయింట్ల లాభంతో 34,479 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. 

లోహ షేర్లు జిగేల్‌.. 
అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు ఎగియడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. అల్యూమినియమ్‌ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడంతో నాల్కో, హిందాల్కో, వేదాంత, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్‌ స్టీల్, హిందుస్తాన్‌ జింక్, టాటా స్టీల్, ఎన్‌ఎమ్‌డీసీ, హిందుస్తాన్‌ కాపర్, ఎమ్‌ఓఐఎల్‌ 2–12 శాతం రేంజ్‌లో ఎగిశాయి. కాగా మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని) షేర్‌ మరో 10 శాతం ఎగసి, రూ.169 వద్ద ముగిసింది. ఇటీవల చెన్నైలో జరిగిన డిఫెక్స్‌పోలో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామని బుధవారం మిధాని వెల్లడించింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ 82 శాతం ఎగసింది.  

Advertisement
Advertisement