భరోసా ఇవ్వని ‘ఆహార భద్రత’ | The statement of 'food security' | Sakshi
Sakshi News home page

భరోసా ఇవ్వని ‘ఆహార భద్రత’

Dec 13 2013 12:58 AM | Updated on Oct 2 2018 8:49 PM

పథకం ఎంత గొప్పదైనా ఫలితం క్షేత్రస్థాయికి చేరితేనే ప్రయోజనం. ఏటా కోట్లాది రూపాయలు రాయితీగా ఇవ్వాలని నిర్ణయించినా వాటిని సకాలంలో...

=మురుగుతున్న నిధులు
 = రైతుల దరిచేరేందుకు యత్నించని అధికారులు

 
సాక్షి, విశాఖపట్నం : పథకం ఎంత గొప్పదైనా ఫలితం క్షేత్రస్థాయికి చేరితేనే ప్రయోజనం. ఏటా కోట్లాది రూపాయలు రాయితీగా ఇవ్వాలని నిర్ణయించినా వాటిని సకాలంలో అందించికపోతే ఫలితం శూన్యం. ఆ కోవలోకి ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం చేరింది. దీంతో విడుదలైన కోట్లాది రూపాయల నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. సుస్థిరమైన పద్ధతిలో సాగుచేసి ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా జాతీయ ఆహార భద్రతా మిషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఈ మేరకు నూతన యాజమాన్య సాగు పద్ధతులు, శ్రీ వరి సాగు, హైబ్రిడ్ వరిసాగు, పప్పు దినుసుల సాగు ప్రదర్శన, సస్య రక్షణ రసాయనాలు, జీవ సంబంధిత మందులకు ప్రోత్సాహకాలు, వ్యవసాయ పనిముట్లకు ప్రోత్సాహకాలు, పొలంబడి పద్ధతిలో రైతులకు శిక్షణ ఇవ్వవల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాలేవి సక్రమంగా జరగడం లేదు. సాగు ప్రదర్శనలు తప్ప మిగతావేవి రైతులకు చేరడం లేదు.

ఈ ఏడాది వరి, పప్పు దినుసుల సాగు ప్రోత్సాహం కోసం 50 శాతం సబ్సిడీతో వివిధ పనిముట్లు అందజేసేందుకు జిల్లాకు రూ.1.13 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 1248 యూనిట్లు పంపిణీ చేయాలన్ని లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఇంతవరకు రూ.43 లక్షల విలువైన 443 యూనిట్లు మాత్రమే రైతులకు చేరాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1097 యూనిట్లు పంపిణీ చేసేందుకు గాను రూ.2.01 కోట్లు విడుదలవ్వగా వీటిలో రూ.6.19 లక్షలు విలువైన 313 యూనిట్లు మాత్రమే రైతులకు అందజేశారు.
 
అక్కరకురాని నిధులు

జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద ఈ ఏడాది 100 హెక్టార్లను ఒక క్లస్టర్‌గా తీసుకొని, ప్రదర్శన కోసం వరి సాగు చేయడానికి రూ.2.68 కోట్లు విడుదల చేయగా ఇంతవరకు కేవలం రూ.1.64 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే 100 హెక్టార్లను ఒక క్లస్టర్‌గా చేసుకుని పప్పు దినుసులు సాగు చేయడానికి రూ.1.21 కోట్లు విడుదల చేయగా ఇంతవరకు కేవలం రూ. 3 లక్షలు మాత్రమే వెచ్చించారు. దీన్ని బట్టి జిల్లాలో ఆహార భద్రతా మిషన్ కార్యక్రమం అమలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వాటి కోసం విడుదలైన నిధులు ఎంతమేర అక్కరకు రాకుండా ఉన్నాయో గమనించొచ్చు. వాస్తవానికైతే వీటిని రైతుల దరిచేర్చేందుకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రైతు సదస్సులు, కిసాన్ మేళాలు ద్వారా అర్హులైన సాగు రైతుల్ని గుర్తించి, యూనిట్లు అందజేయవచ్చు. అలాగే రైతు మిత్ర సంఘాలు, ఆదర్శ రైతుల ద్వారా అర్హులైన రైతులను ఎంపిక చేసి ప్రయోజనం కల్పించడానికి అవకాశం ఉంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విడుదలైన కోట్లాది రూపాయల నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement