శారద ఇన్‌స్పిరేషన్‌..శ్యామల రోల్‌మోడల్‌

Sharda Inspiration... Shyamala Rolmodel - Sakshi

కర్నూలు(కల్చరల్‌) :  ‘‘నేను  8వ తరగతి చదివేటప్పుడు  న్యాయం కావాలి సినిమా చూశాను. అందులో శారద పాత్ర నాపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది. అన్యాయానికి గురైన రాధికకు  అండగా నిలిచి న్యాయం జరిగేటట్లు లాయర్‌ శారద  పోరాటం చేయడం నాకు చాలా నచ్చింది. దీంతో నేను కూడా ఒక ‘అన్‌కాంప్రమైజింగ్‌’(రాజీలేని) ఫైటర్స్‌ పక్షాన నిలబడాలనే సదాశయంతో న్యాయవాద వృత్తి చేపట్టి ఈ స్థాయికి వచ్చాను’’ అని అన్నారు జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జి అనుపమ చక్రవర్తి. మౌనపోరాటం సినిమాలో యమున పాత్ర కూడా తనకు చాలా నచ్చిందని, మ హిళలు ధైర్యంగా నిలబడితే  న్యాయం వారి పక్షాన నిలుస్తుందనే వాస్తవికతను ఈ పాత్ర చూపిందన్నారు. అన్యా యానికి గురైనప్పుడు మహిళలు కుంగిపోకూడదని, చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు సైతం..మహిళలపై వివక్ష చూపకూడదని, వారి ఇష్టా ఇష్టాలను గౌరవించాలన్నారు. జిల్లా జడ్జి అనుభవాలు ఆమె మాటల్లోనే..    

‘‘ మా సొంత ఊరు శ్రీకాకుళం. అమ్మ మహాలక్ష్మి, నాన్న కృష్ణచందర్‌రావు..ఇద్దరూ నన్ను చాలా ప్రేమగా పెంచారు. ఆడపిల్లనని వివక్ష చూపలేదు. ఏం చదవాలో, ఏం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకిచ్చారు. ప్రాథమిక విద్య నుంచి మెట్రిక్యులేషన్‌ వరకు శ్రీకాకుళంలోని సెయింట్‌జోసెఫ్‌ స్కూలులో చదివాను. ఇంటర్‌ శ్రీకాకుళం గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీలో పూర్తి చేశాను.  

ఇంటర్‌ పూర్తి కాగానే పెళ్లి....
ఆ రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి నాకు ఇంటర్‌ పూర్తి కాగానే పెళ్లి చేశారు. అయితే నాన్న.. మా  బంధువుల వద్ద, మా వారి వద్ద నా చదువు పట్ల హామీ తీసుకునే పెళ్లి చేశారు. అందుకే నేను అమితంగా ఇష్టపడే ఐదేళ్ల లా కోర్సు విశాఖపట్టణంలోని నందమూరి బసవతారకం లా కళాశాలలో దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను. నేనొక్కదాన్నే కాదు.. నాతో పాటు మా తమ్ముడు కూడా అదే కాలేజీలో చేరి లా కోర్సు పూర్తి చేశాడు.  

మా నాన్న గర్వపడ్డారు...
నేను, మా తమ్ముడు హైదరాబాద్‌లో ఒకే రోజు లాయర్లుగా పేర్లు నమోదు చేసుకొని నల్ల కోటు తొడుక్కొని హైకోర్టులో అడుగుపెట్టాం. ఆ రోజున మా నాన్న చాలా గర్వంతో ఆనందించారు. 1994 నుంచి 2008 వరకు హైకోర్టు లాయర్‌గా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించాను. 2008లో ప్రవేశ పరీక్షరాసి జి ల్లా జడ్జిగా ఎంపికయ్యాను. చిత్తూరు, కడప జిల్లాల్లో జడ్జిగా పలు సవాళ్లను ఎదుర్కొన్నాను. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక   విజయవాడలో మహిళా సెషన్స్‌ జడ్జిగా, కృష్ణా జిల్లా ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ డిస్ట్రిక్ట్‌ ప్రిన్సిపల్‌ జడ్జిగా పనిచేశాను. 2016 జూలై నుంచి కర్నూలు జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా చేస్తున్నాను.  

స్త్రీ తల్లి పాత్రను బాగా పోషిస్తే..
సమాజంలో ప్రతీ స్త్రీ తల్లి పాత్రను బాగా పోషిస్తే బిడ్డలు నేరస్తులు కారు. ఏది తప్పో, ఏది ఒప్పో చక్కగా చెప్పి మానవీయ విలువలను  నేర్పితే సమాజం తీరుతెన్నులు మారిపోతాయి. స్త్రీల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలు వేధింపులు జరగడానికి దుర్మార్గులు ఒక కారణమైతే స్త్రీలలోని పిరికితనం, అవగాహన లోపం కూడా ఒక కారణం. మహిళా సాధికారత బాగా ప్రచారంలోనికి వచ్చిన ఈ రోజుల్లో కూడా స్త్రీలు వివక్షకు, వేధింపులకు గురికావడం సబబు కాదు. మహిళలు కూడా తమ వేషధారణ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. హక్కుల కోసమే కాకుండా బాధ్యతల నిర్వహణ కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.’’

గర్భిణిగా పరీక్షలకు హాజరు..
లా చదువుతున్న రోజుల్లో నేను నిండు గర్భిణిగా ఉండి పరీక్షకు హాజరై పాసయ్యాను. అంతేకాదు... బాబు పుట్టిన కొన్ని రోజులకే మరో పరీక్షకు వెళ్లవలసి వచ్చింది. ఏ మాత్రం మానసిక ఒత్తిడికి గాని, శారీరక ఒత్తిడికి గాని గురి కాకుండా అందరి ప్రోత్సాహంతో నేను హాయిగా పరీక్ష రాశాను. మానసికంగా బలవంతులైతే మనం ఏ పనినైనా సాధించవచ్చు. పిరికితనం, అధైర్యం వల్ల అడుగడుగునా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చట్టాలపై అవగాహన ఉండాలి..
మహిళలు చట్టాలు తెలుసుకొని వాటిని బాగా వినియోగించుకోవాలి. నిర్భయ, గృహహింస నిరోధక, చైల్డ్‌ అబ్యూజ్‌ , పీసీసీ.. చాలా అద్వితీయమైన చట్టాలు. వీటిని వినియోగించుకోవడంలో చదువుకున్న మహిళలు విఫలం కాకూడదు. ఈ చట్టాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు మేం నేషనల్‌ లీగల్‌ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్‌ లిటరసీ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకున్న నాడు నిర్భయంగా నిస్సంకోచంగా సమాజంలో జీవించగలరు.

ఆమె చూపిన అభిమానం మరువలేనిది..
సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ (శ్రీకాకుళం)లో చదువు చెప్పిన శ్యామలా టీచర్‌ నాకు రోల్‌ మోడల్‌. ఆమె ఇంగ్లిష్‌ బోధించిన తీరు ఇప్పటికీ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఎంత పెద్ద పదాన్నైనా సిలబల్‌ చేసి ఆమె నేర్పిం చిన తీరు మరచిపోలేను. నేర్చుకోకపోతే ఆమె వేసిన చిన్న శిక్షలు, నేర్చుకున్నాక ఆమె చూపిన అభిమానం నాలో క్రమశిక్షణను పెంచాయి.

మానవీయ బంధాలు ఏర్పడాలి..
‘‘ ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటారు’’ అన్నది ఒక ఆర్యోక్తి. కాని నా విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. నా విజయం వెనుక మా నాన్న, మా వారు, మా తమ్ముడు ఉన్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. సమాజంలో ఇటువంటి మానవీయ బంధాలు ఏర్పడితే స్త్రీలు ఏ ఆంక్షలు లేకుండా తమ ఆకాంక్షల మేరకు ఆశయాలు సాధిస్తారు. చాలా కుటుంబాల్లో కట్టుబాట్లతో స్త్రీల చదువును నిరోధిస్తారు. దీంతో స్త్రీలు ఆశయాలను, ఆకాంక్షలను అణగదొక్కుకోవాల్సి వస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top