సాహితీ.. మహాసముద్రం

Retiree professor maha samudran Devaki - Sakshi

అనంతను కార్యక్షేత్రంగా మలుచుకుని సాహితీ సేవలు అందిస్తున్న వారిలో విశ్రాంత ప్రొఫెసర్‌ మహాసముద్రం కోదండరెడ్డి దేవకి ఒకరు. చిత్తూరు జిల్లా వరిగిపల్లి గ్రామంలో జన్మించిన ఆమె ఉద్యోగరీత్యా 1979 నుంచి 2011 వరకు ఎస్కేయూలోని తెలుగు విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. బాలల సాహిత్యంలో పరిశోధనలు చేసిన తొలి మహిళ దేవకితో ‘సాక్షి హృదయరాగం’ మీ కోసం..  

మహిళా స్వేచ్ఛను హరిస్తున్నారు
నాటి కన్యాశుల్కం రోజుల నుంచి నేటిదాకా నిత్యమూ బాధలనుభవిస్తోంది మహిళలే. అన్ని చోట్లా స్త్రీ.. దారుణంగా మోసపోతోంది. చిన్నతనంలో తల్లిదండ్రుల వద్ద, యుక్తవయసులో భర్త వద్ద వివక్ష కొనసాగుతోంది. భద్రత పేరుతో స్వేచ్ఛను హరిస్తున్నారు. మా పొలాల్లో కూలికి వచ్చే మగవారికి రెండు రాగి ముద్దలు, కొంత డబ్బు ఇస్తే.. అదే పని చేసిన ఆడవారికి అందులో సగం డబ్బు, ఒక రాగి ముద్ద ఇచ్చేవారు. అప్పట్లోనే దీన్ని నేను బాగా వ్యతిరేకించాను. యూనివర్సిటీలో చేరాక కూడా అనేక ఘోరాలు చూడాల్సి వచ్చింది. మహిళలను ఆటవస్తువులుగా చూడొద్దంటూ అరవడం అరణ్యరోదనే అని అర్థమైపోయింది. సమాజంలో మార్పు రానంత వరకు ఏమీ చేయలేం.        
– మహాసముద్రం కోదండరెడ్డి దేవకి   

ఇల్లే విద్యాలయం
మా కుటుంబ నేపథ్యం చాలా ఆసక్తిగా ఉంటుంది. కేవలం మూడో తరగతి వరకు చదువుకున్న మా నాన్న కోదండరెడ్డి శ్రీ వేంకటేశ్వరస్వామిపై వేల కొద్ది పాటలు, పద్యాలు రాశారు. అవన్నీ ఛందోబద్ధంగా ఉన్నాయి. చిన్నాన్న బి.ఎన్‌.రెడ్డి..  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్సలర్‌గా పనిచేశారు. అమ్మ, అక్కలు కూడా ఆసువుగా జానపద గేయాలను ఆలపించగలరు. ఈ నేపథ్యంలోనే నేను కూడా రాయగలననే నమ్మకంతో ప్రయత్నించాను. ఎదుటి వారిలో శక్తిని గుర్తిస్తే మనలోని ఎంత ప్రతిభనైనా వెలికితీయొచ్చన్నది నా కుటుంబం ద్వారా నేర్చుకున్నాను.

టాలెంట్‌ హంట్‌ చేపట్టాలి
మా ఆయన (ఆచార్య పీఎల్‌ శ్రీనివాసరెడ్డి)తో కలిసి నేను ‘రసలాస్య’ అనే కళా సాంస్కృతిక సంస్థను ఎస్కేయూలో ఏర్పాటు చేశాను. వర్సిటీలో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకులు,  విద్యార్థులలోని టాలెంట్‌ను గుర్తించడం,  వాటిని ప్రదర్శించేందుకు  సంగీతాన్ని ఆలంబనగా చేసుకున్నాము. దానికి మేము పెట్టిన ‘పురమాయిస్తుంది సమాజాన్ని సంగీతం సరిగ పదమని’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. అందరూ ఓ చోట చేరి మనసారా ఆడిపాడుకోవడం వల్ల ఓ చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి ప్రయత్నం అన్ని చోట్లా సాగినపుడే అంతరాలు, అహం తొలిగిపోతాయి.

ప్రతి కథలోను బాలసాహిత్యం
బాల సాహిత్యం కోసం ఎన్నో ఊర్లు తిరగాల్సి వచ్చింది. ఎన్నో పుస్తకాలను అతి కష్టంపై సేకరించాను. నేను రాసిన ‘ తారంగం తారంగం,  గోరుముద్దలు, బాలసాహిత్యం, జాతిరతనాలు, తెలుగు నాట జానపద వైద్య విధానాలు, దాక్షిణాత్య సాహిత్యం–తులనాత్మక పరిశీలన, ఇర్ల చెంగి కథలు, ముళ్ల దోవ, మండల వడిలో’ వంటి బాలల గేయాలు, వ్యాస సంపుటిలు..ఇలా ప్రతి దానిలో ఉత్తమ విలువలే చోటు చేసుకున్నాయి. మరో 10 పుస్తకాలు నా సంపాదకత్వంలో వెలువడ్డాయి. ‘జాతి రత్నాలు’  పేరిట ఉపవాచకంలో నా రచనలను 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు.  ప్రపంచ తెలుగు సభల సందర్భంగా తెలుగు అకాడమీ వారు ‘బాల సాహిత్యం’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఇది అనంతకు దక్కిన గౌరవంగానే భావించాను.

ఇప్పుడు సామెతలెక్కడున్నాయి?
విస్తృతమైన భావాన్ని అతి కొద్ది మాటల్లో చురుగ్గా, సూటిగా అందించే సామెతలు ఒకప్పుడు నిత్య వ్యవహారంలో ఉండేవి. ఏ సందర్భంలో, ఏ అర్థంలో వాటిని వాడాలో మన తెలుగు వారికి తెలిసినంతగా మరెవరిలోనూ కనిపించదు. వాటి వాడకం తెలుసుకుంటే తెలుగు భాష మరింత అందంగా ఉంటుంది. దాని కోసమే నేను ‘సామెతల సూరమ్మత్త’ పాత్రతో వేలాది సామెతలు, పొడుపుకథలు సేకరించాను. వివిధ పత్రికల్లో వచ్చాయి. త్వరలో వాటికి  గ్రంథ రూపం ఇవ్వాలనుకుంటున్నా. విద్యార్థులకు  ఆటల పాటల రూపంలో పొడుపు కథలను విప్పమని చెప్పడం, లేదంటే వారు సేకరించిన పొడుపు కథలను చెప్పాలన్న నియమం పెట్టడంతో చాలా మంది ఆసక్తికరంగా నేర్చుకున్నారు. ఈ ప్రయోగాన్ని నేను పాతికేళ్ల పాటు కొనసాగించాను.

‘అనంత’ ఎప్పుడూ ప్రత్యేకతే
అనంత ప్రత్యేకత ఎప్పటికీ భిన్నమే.  వేరుశనగ గురించి చెప్పుకోవాలంటే దేశంలోనే అనంత పేరే ముందుగా గుర్తొస్తుంది. కానీ అనంత రైతాంగమే విలవిలలాడిపోతోంది. వారి ఆవేదన కూడా అనేక వ్యాసాలు, కథల రూపంలో వెలువరించాను. ఈ ప్రాంతంలో రేగిన ఉద్యమాలు కూడా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. కానీ ఇక్కడ కూడా మహిళలకు అన్యాయమే జరుగుతోంది. ఎంత మంది మహిళలను ఉద్యమకారులుగా, నడిపించే నేతలుగా గుర్తిస్తారు చెప్పండి. కాబట్టే మేము  మా సాహిత్యంతోనే ఉద్యమాలలో పరోక్ష పాత్ర పోషించాం.   

కథలు రాయించిన నిరుద్యోగ జీవితం
నేను పరిశోధన గ్రంథం సమర్పించిన తర్వాత నిరుద్యోగిగా ఆరు నెలల పాటు స్వగ్రామంలో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ‘తరం మారింది, సెలయేట్లో గులకరాళ్లు’ అనే రెండు నవలలు రాశాను.వరకట్న దురాచారాన్ని  వ్యతిరేకిస్తూ రాసిన మొదటి నవలే ఎందరినో కదిలించింది. అలాగే మొదటి కథ ‘ఎంగిలాకు’ను అధ్యాపకులందరూ బాగుందన్న తర్వాత ‘ఆకలి చెప్పిన తీర్పు’ కథను రాశాను. కథల కాణాచి కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) అంతటి వారు నా కథల్ని ప్రశంసించడం పెద్ద అవార్డుగానే భావిస్తాను. తర్వాత ఎన్నో కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. స్త్రీ వాదంపై ఎన్నో వ్యాసాలు రాశాను.

ఫకృద్దీన్‌ ఆలీ అహ్మద్‌తో కలిసి..
రాష్ట్రపతిగా 1974 – 77లో ఫకృద్దీన్‌ ఆలీ అహ్మద్‌ ఉండేవారు. ఆ సమయంలో నేను బాలల అకాడమీలో సభ్యురాలిగా ఉండేదాన్ని. అప్పట్లో హైదరాబాదులో నాలుగురోజుల పాటు  జరిగిన బాలల సదస్సులో ఆయన పూర్తిగా సమయాన్ని కేటాయించి విలువైన సలహాలు,  సూచనలు అందించారు. బాలల సాహిత్యం పట్ల నేను చేస్తున్న కృషిని గుర్తించి ప్రత్యేకంగా నన్ను అభినందించడం మరచిపోలేను.

ఇతరుల ప్రతిభను మెచ్చుకోవడం తక్కువ
ఇటీవల ఇతరులలోని ప్రతిభా పాటవాలను గుర్తించకపోవడం, తెలిసినా వెనక్కు లాగడం ఎక్కువైంది. దీని వల్ల మంచి సాహిత్యం వెలుగులోకి రాకుండా పోయింది. బాలల సాహిత్యంలో నేను సాగిస్తున్న కృషికి  తిక్కవరపు రామిరెడ్డి బంగారు పతకం, వెంకటకృష్ణారావు స్మారక పురస్కారం, సీతామహాలక్ష్మి పురస్కారం,  ఉగాది పురస్కారాలతో పాటు భారత మహిళా  పురస్కారం నన్ను వరించాయి. కర్నూలు తెలుగు భాషా వికాస ఉద్యమం వారు విశిష్ట మహిళా పురస్కారమందించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డునందించింది.

జానపద సాహిత్యాన్ని మరవొద్దు
మన జీవన విధానంలోని విభిన్న కోణాలు మన ఆచార వ్యవహారాలలో వ్యక్తమవుతాయి. ఏ తరం వారికైనా జానపద సాహిత్యం దిశానిర్దేశం చేస్తుందనేది నా భావన. ఆ దిశగా నేను రాసిన ఎన్నో జానపద సాహితీ గ్రంథాలు నాకు అవార్డులు, రివార్డులతో పాటు కొత్త ఒరవడికి నాంది పలికాయి. ఇవన్నీ మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర లాంటి చోట్ల కూడా అనంత వాసుల రచనలు పాఠ్యాంశాలుగా మారడం గర్వించదగిన విషయం. స్వయంగా నేను ఓ జానపదుల ఇంట పుట్టడం వల్ల జానపదుల స్థితి గతులపై విస్తారంగా చర్చించే అవకాశమొచ్చింది.

బయోడేటా
పూర్తిపేరు    : మహాసముద్రం  కోదండరెడ్డి దేవకి
జన్మస్థలం    : వరిగిపల్లి గ్రామం,   చిత్తూరు జిల్లా
తల్లిదండ్రులు : కోదండరెడ్డి, కమలమ్మ
భర్త    : ఆచార్య పి.ఎల్‌. శ్రీనివాసరెడ్డి
విద్య    : ఎంఎ.. పీహెచ్‌డీ.,
వృత్తి    : ఎస్కేయూ ప్రొఫెసర్‌గా   ఉద్యోగ విరమణ
రచనలు    : ‘ తారంగం తారంగం’,
‘గోరుముద్దలు’,  ‘బాలసాహిత్యం’,
‘జాతిరతనాలు’, ‘తెలుగు నాట జానపద వైద్య విధానాలు’ మొదలైనవి
స్ఫూర్తి    :  కుటుంబమే
పురస్కారాలు : ఉగాది పురస్కారం,  
భారత మహిళా పురస్కారం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top