
సన్నాహాలేవీ?
మహారాష్ట్రలో పుట్టిన చోటు నుంచి మహాసముద్రంలో కలిసే తావు వరకూ గోదారమ్మ ఎలాంటి కుల, మత, వర్గ, వర్ణ వివక్ష కనబరచదన్నది..ఆ తల్లి జీవనది అన్నంత నిశ్చిత సత్యం.
మహారాష్ట్రలో పుట్టిన చోటు నుంచి మహాసముద్రంలో కలిసే తావు వరకూ గోదారమ్మ ఎలాంటి కుల, మత, వర్గ, వర్ణ వివక్ష కనబరచదన్నది..ఆ తల్లి జీవనది అన్నంత నిశ్చిత సత్యం. అయినా.. ఎందుకో ఆ తల్లి సాచిన అనేక బాహువుల నడుమ ఒదిగిన బిడ్డలా ఉండే కోనసీమను చూస్తే మాత్రం మరోమాట అనుకోబుద్ధేస్తుంది. ఆ గడ్డపై ఆయమ్మకు ఒకింత ఆపేక్ష ఎక్కువేననిపిస్తోంది. అలాంటి సీమలో పుష్కర సన్నాహాల జాడ ఇంకా లేదు. ఓవైపు ఆ మహాపర్వం చేరువవుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం చలనం రావడం లేదు.
అమలాపురం :పుష్కరాల సమయంలో జిల్లాలో రాజమండ్రి తర్వాత కోనసీమకే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సీమలో గత పుష్కరాల సమయంలో నిర్మించిన ఘాట్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. రాజమండ్రిలోని ఘాట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులకే కోత పెడుతున్న ప్రభుత్వం.. కోనసీమలో పుష్కర సన్నాహాలకు పుష్కలంగా నిధులు ఇస్తుందనే నమ్మకం లేకుండా పోయింది.
సప్తగోదావరి స్నానం.. సకల పాపహరణం
నదీపాయల మధ్య పచ్చదనం తొణికిసలాడే కోనసీమ గడ్డపై అడుగడుగునా ఓ గుడి ఉంది. ఆ గుడులన్నింటికీ పురాణేతిహాసాల ప్రశస్తీ ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేసినప్పుడు స్వయంగా ప్రతిష్టించారని చెప్పుకునే ఆలయాలే కాదు.. రుషులు, మహా పురుషులు నిర్మించిన దేవాలయాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. సువర్ణానికి సుగంధం తోడైనట్టు.. ఇటు ప్రకృతి సోయగాలు, అటు ఆధ్యాత్మిక పరిమళాలతో అలరారే కోనసీమను అటు సందర్శకులనూ, ఇటు భక్తులనూ సూదంటురాయిలా ఆకర్షిస్తూంటుంది. పుష్కరాల సమయంలో సప్తగోదావరి పాయల్లో స్నానం చేయడం వల్ల సకల పాపాలు పోతాయని ప్రతీతి. ఈ పాయల వెంబడి ఉండే ప్రముఖ స్నానఘట్టాలకే కాదు.. చిన్నచిన్న ఘట్టాలకు సైతం చరిత్ర ఉంది.
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, ఐ.పోలవరం మండలం మురమళ్ల, కాట్రేనికోన మండలం కుండలేశ్వరం, రాజోలు మండలం సోంపల్లి, మామిడికుదురు మండలం అప్పనపల్లి, పి.గన్నవరం మండలం పి.గన్నవరం, ఎల్.గన్నవరం, ఆత్రేయపురం మండలం వాడపాలెం, కొత్తపేట మండలం సూర్యగుండాల వద్ద గోదావరి స్నానమాచరిస్తే మహాపుణ్యమని భక్తులు భావిస్తారు. ఇటువంటి ప్రధాన ఘట్టాలే కాదు.. మలికిపురం మండలం దిండి, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి గీతామందిరం ఇలా గోదావరి పొడవునా ప్రముఖ పుష్కర స్నానఘట్టాలున్నాయి. అంబాజీపేట శివారు అప్పర్ కౌశిక వద్ద రామఘట్టం, అమలాపురం మండలం చిందాడమడుగు వంటి చోట్ల కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేస్తుంటారు. ప్రధాన స్నానఘట్టాల వద్ద పుష్కరాల సమయంలో సుమారు 25 లక్షల మందికి పైగా స్నానమాచరిస్తారని అంచనా. మిగిలిన రేవులకు కూడా పది లక్షలకు పైబడి భక్తులు వస్తుంటారు.
పక్కా ప్రణాళిక అవసరం
గత పుష్కరాల సమయంలో నిర్మించిన స్నానఘట్టాలు శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించాల్సి ఉంది. ఈసారి పుష్కరాలకు గతంలో కన్నా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున పాత వాటికన్నా పెద్ద ఘాట్లను నిర్మించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఘాట్లను చేరుకునేందుకు అనువుగా రహదారుల అభివృద్ధి, నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల సదుపాయాల కల్పనకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంది. ఇందుకు భారీఎత్తున నిధులు అవసరం. ఇప్పటి వరకు పుష్కర ఘాట్ల నిర్మాణాలకు మాత్రమే ప్రభుత్వం ప్రతిపాదనలు అడగ్గా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు ఇందుకనుగుణంగా అంచనాలు పంపించారు.
గతంలో ఘాట్ల నిర్మాణాలను ఇరిగేషన్ శాఖ చేపట్టగా, ఈసారి అవసరమైతే పంచాయతీరాజ్ శాఖ సైతం చేపట్టే అవకాశముంది. ఇంతవరకు బాగానే ఉన్నా మహా కుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం నిధుల కేటాయింపు వచ్చేసరికి అంత ఔదార్యం కనబరచడం లేదు. భక్తుల తాకిడి అధికంగా ఉండే రాజమండ్రిలో అవసరమైన పుష్కర పనులకు కావలసిన నిధులకే కోత పెడుతున్న ప్రభుత్వం కోనసీమలో చేపట్టే ఘాట్ల నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇస్తుందనే నమ్మకం అధికార యంత్రాంగానికే లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వీటిపై ఇంకా దృష్టి పెట్టలేదు. అధికారులు అంచనాలు రూపొందించి చేతులు దులుపుకోగా, ప్రజాప్రతినిధులు పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో కోనసీమలో పుష్కర మహాపర్వానికి మునుపటి కళ కష్టమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.