చంద్రబాబూ ఇప్పుడేమంటారు? | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ ఇప్పుడేమంటారు?

Published Tue, Sep 19 2017 2:02 AM

చంద్రబాబూ ఇప్పుడేమంటారు? - Sakshi

- మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 
ఇది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనతే
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: సదావర్తి సత్రం భూములను అప్పనంగా బొక్కేయాలని భావించిన సీఎం చంద్రబాబుకు తాజా వేలం పాట ఫలితం చెంపపెట్టు వంటిదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. చెన్నైలో సోమవారం వేలంపాట ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద బ్రాహ్మణుల ప్రయోజనాల కోసం దాతల నుంచి సంక్రమించిన వేల కోట్ల రూపాయల విలువైన భూములను రూ.22.44 కోట్లకే కారుచౌకగా కాజేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారన్నారు. ఈ ప్రయత్నాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అలుపెరుగని న్యాయపోరాటం చేసి అడ్డుకుందని చెప్పారు.

తాజా వేలంలో ఈ భూములు రూ.60.30 కోట్లకు అమ్ముడవడంతో ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.38 కోట్లు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుంటారని నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని పేద బ్రాహ్మణుల కోసం ఈ సొమ్మును వినియోగించాలని ఆయన హితవు పలికారు. తొలి వేలం పాటల మొత్తానికి అదనంగా రూ.5 కోట్లు ఇచ్చి సొంతం చేసుకొమ్మని సీఎం చంద్రబాబు సవాలు చేయడం, కోర్టు కూడా అంగీకరించడం వల్లనే చెల్లించాను గానీ భూములను పొందాలనే ఆలోచనే లేదన్నారు. ముమ్మాటికీ అవి అత్యంత విలువైన భూములేనన్నారు. తన శక్తి మేరకు రూ.45 కోట్ల వరకు పాడానని చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement