పాసైతేనే పై తరగతికి.. | Lok Sabha Granted No Detention Method Cancel | Sakshi
Sakshi News home page

పాసైతేనే పై తరగతికి..

Jul 27 2018 2:13 PM | Updated on Jul 27 2018 2:13 PM

Lok Sabha Granted No Detention Method Cancel - Sakshi

విద్యాప్రమాణాల్లో పెనుమార్పు చోటు చేసుకోనుంది. ఇప్పటి వరకు విద్యాహక్కు చట్టం కింద 8వ తరగతి వరకు విద్యార్థులను డిటైన్‌ (వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుంటే అదే తరగతిలో కొనసాగించడం) చేయడానికి వీల్లేదు. వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా వారిని పైతరగతికి పంపాల్సిందే. కానీ ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు. తాజాగా విద్యాహక్కు చట్టంలో చేసిన సవరణ ప్రకారం నో డిటెన్షన్‌ విధానం రద్దు కానుంది.ఈ విధాన విద్యార్థులు, ఉపాధ్యాయులను టెన్షన్‌ పెడుతోంది.

కడప, బద్వేలు : నో డిటెన్షన్‌ విధానం రద్దుకు విద్యాహక్కు చట్టంలో తీసుకువచ్చిన సవరణ బిల్లుకు ఈ నెల18న లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పాఠశాల విద్యలో డిటెన్షన్‌ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థులు ఐదు, ఎనిమిది తరగతుల్లో ఉత్తీర్ణులైతేనే తర్వాత తరగతికి వెళతారు. లేదంటే మళ్లీ చదివి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అయితే ఫలితాలు వచ్చిన వారంలో మరో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని రద్దు చేయాలా... కొనసాగించాలా.. అనే నిర్ణయం రాష్ట్రాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తరువాత ఉపాధ్యాయులు, విద్యావేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా బిల్లుతో పాఠశాల విద్య మరింత బలోపేతం అవుతుందని పలువురు పేర్కొంటున్నా.. డ్రాపౌట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయులపై ఒత్తిడి కూడా పెరుగుతుందంటున్నారు.

సదుపాయాలు కల్పిస్తే...
కార్పొరేట్‌ పాఠశాల విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. డిటెన్షన్‌ విధానం అమలైతే ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ప్రయివేట్‌ పాఠశాలలైతే తమ పిల్లలను తప్పనిసరిగా ఉన్నత తరగతికి వెళ్లేలా చేయగలరనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఏర్పడవచ్చు.  రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగిన అభిప్రాయ సేకరణలో ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తల్లో 90 శాతం మంది ఈ విధానాన్ని వ్యతరేకించారు.

అమలు ఎందుకంటే...
డిటెన్షన్‌ విధానం అమల్లో లేకపోవడం విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతమని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన ఉండటంతోపిల్లల్లో అభ్యసన నైపుణ్యాలు, వికాసం అభివృద్ధి వంటివి రోజురోజుకు తగ్గుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం  8వతరగతి వరకు డిటెన్షన్‌ విధానం లేకపోవడం సరి కాదని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంట్‌లో నివేదిక సమర్పించింది. చాలా రాష్ట్రాల్లో  8వ తరగతి వరకు వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణలు కావాలనే నిబంధన లేదు. గత యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా నేడు ఏన్‌డీఏ ప్రభుత్వం ఇదే నివేదిక సమర్పించడం విశేషం.

చట్టంలో సవరణ ఇలా...
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ఏ ద్వారా 8వ తరగతి వరకు విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించి ఉన్నారు. బడికి చేరిన విద్యార్థులకు 8 పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ అపకూడదు... బహిష్కరించకూడదని సెక్షన్‌16లో ఆదేశం. ఈ నిబంధనను సవరించి 5వ, 8వ తరగతిలో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత చెందని వారిని అదే తరగతిలో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యాహక్కు చట్టానికి విఘాతం
తాజా బిల్లుతో విద్యాహక్కు చట్టానికి విఘాతం కలిగినట్లే నని  ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్యలో పరీక్షలు పెట్టి పాసైన వారిని ప్రమోట్‌ చేసి, ఉత్తీర్ణత సాధించని వారిని డిటైన్‌ చేయడం బాలల హక్కులకు విరుద్ధం. పలు సర్వేలు, విద్యాశాఖ నివేదిక ప్రకారం ప్రతి తరగతిలోనూ నిర్థేశిత కనీస అభ్యసన సామర్థ్యాలను సగం మంది విద్యార్థులే సాధించగలుగుతున్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలనా విశ్వవిద్యాలయం ప్రచురించిన 2017–18 యూడైస్‌ గణాంకాల ప్రకారం 5, 8వ తరగతి విద్యార్థులు 58శాతం మాత్రమే పై తరగతులకు ప్రమోట్‌ అవుతున్నారు.

సీసీఈ విధానం నిర్వీర్యం
విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడానికి, సృజనాత్మకతను పెంచడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని 2012 నుంచి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరీక్షల విధానంలో చాలా మార్పులు చేశారు. అయితే ఈ విధానం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం డిటెన్షన్‌ విధానం అమలు చేస్తే సీసీఈ మరింత నిర్వీర్యమవుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. 

ప్రయివేట్‌ ఇష్టారాజ్యం
గతంలో ఏడు, పది తరగతుల్లో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేవారు. ప్రయివేట్‌ యాజమన్యాలు పాస్‌ గ్యారంటీ పేరుతో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు మార్కుల కోసం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. 2005లో ఏడో తరగతికి పబ్లిక్‌ పరీక్షల విధానాన్ని విద్యాశాఖ రద్దు చేసింది. తిరిగి డిటెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ప్రయివేట్‌ విద్యాసంస్థలు ఫలితాల కోసం, మార్కులు, ర్యాంకులంటూ చిన్నారులను మానసిక ఒత్తిడికి గురి చేస్తారని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రయివేట్‌ సంస్థల వైపే మొగ్గు చూపుతారని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement