
గందరగోళంగా డీఎస్సీ
గత నెల్లో ప్రకటించిన నూతన డీఎస్సీ నోటిఫికేషన్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తోంది.
నెల్లూరు(విద్య): గత నెల్లో ప్రకటించిన నూతన డీఎస్సీ నోటిఫికేషన్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తోంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీవ్ర కసరత్తు చేశామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం, తన విధానాలతో అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ‘టెట్’ నిబంధనల మేరకు ఒకసారి క్వాలిఫై అయితే ఏడేళ్ల వరకు ఆ అర్హత వర్తిస్తుంది.
ప్రస్తుతం రెండు పరీక్షలు ఒకేసారి రాయాల్సి రావడంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. తాజా నిర్ణయం మేరకు టెట్ సబ్జెక్టులను కూడా డీఎస్సీలో కలపడంతో అధికమార్కులు సాధించడం కష్టమనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఆయా రిజర్వేషన్ల వర్గాలకు అర్హత మార్కులను పెంచడం సైతం అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. పరీక్ష కోసం కేటాయించిన మూడు గంటల సమయం సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భాషాపండితుల కష్టాలు
తెలుగు, హిందీ, ఉర్దూ పండిత అభ్యర్థుల కష్టాలు మరోలా ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా సిలబస్ మార్పుతో ప్రశ్నపత్రంలో ఇతర సబ్జెక్టులకు అధిక మార్కులు ఇవ్వడంవంటి మార్పులు చేశారు. భాషాపండితులుగా తాము చదివిన అర్హత విద్యలో లేని ఇతర సబ్జెక్టులకు ప్రశ్నపత్రంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 200 మార్కుల్లో అర్హత సబ్జెక్టుకు 70 మార్కులు, తాము చదవని సాంఘికశాస్త్రం నుంచి 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. టీచర్ పోస్టులకు సైకాలజీ, జీకే వంటి అంశాలపై ప్రశ్నలుండడం సహజం. అయితే లాంగ్వేజీ పండిట్ పోస్టులకు అర్హత పరీక్షలో తాము చదవని సాంఘికశాస్త్రం సిలబస్‌ను ఇవ్వడం అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భాషాపండితుల పోస్టులకు జిల్లాలో 2 వేల నుంచి 3 వేల మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. గతంలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు 14 నుంచి 16వేల మంది వరకు ఉన్నారు. తాజా టెట్ కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ను వీరు మళ్లీ రాయాల్సి ఉంది.
అర్హత మార్కులపై ఆందోళన
కొత్త డీఎస్సీలో రిజర్వేషన్ల కేటాయింపుల మార్పు చేశారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ, వికలాంగుల కేటగిరిలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం, బీసీలకు 50 శాతం, ఓసీలకు 80 శాతం మార్కులు తెచ్చుకోవాలని కొత్త నిబంధన. గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఎస్సీ,ఎస్టీలు, వికలాంగులు టీచర్ పోస్టులు సాధించేవారు. తాజా నిబంధనలతో ఆయా రిజర్వేషన్ల వర్గాల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది.
భాషా పండితులకు తీరని నష్టం: ఎన్.సంపత్‌కృష్ణ, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్
తాజా డీఎస్సీలో 200 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తున్నారు. వారు చదివిన సబ్జెక్టులో 70 మార్కులు ఇచ్చి మిగిలిన 130 మార్కులకు సాంఘికశాస్త్రం, భాషేతర ప్రశ్నలను ఇవ్వనున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. 100 మార్కులకు పైగా సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉండేవి.
భాషా పండితులను విస్మరిస్తున్నారు: ఎన్.శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు
భాషా పండితులను ప్రభుత్వం తీవ్రంగా విస్మరిస్తోంది. పదోన్నతుల విషయంలో ఒకే జీవోలో రెండు విద్యార్హతలను పొందుపరచి ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోంది. 1984లో భాషాపండితులుగా ఉద్యోగాల్లో చేరిన వారికి ఇంతవరకు ప్రమోషన్లు రాలేదు. సిలబస్, సమయం విషయంలో భాషాపండిత అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
మెథడాలజీ క్లిష్టతరం: పెంచలనరసింహ,
భాషా పండిత అభ్యర్థి
అర్హత విద్యలో అభ్యసించని మెథడాలజీనీ టెట్ కమ్ టీఆర్‌టీలో రాయాల్సిరావడం లాంగ్వేజ్ పండిట్‌లకు క్లిష్టమవుతోంది. ఉమ్మడి పరీక్షలో టీచర్‌పోస్టు సాధించాలంటే కచ్చితంగా క్వాలిఫై మార్కులు సాధించక తప్పదు. మిగిలిన సబ్జెక్టుల మాదిరిగానే లాంగ్వేజ్‌పండిట్‌లకు వారు అభ్యసించిన మెథడాలజీ మార్కులను 100కు చేస్తే సమన్యాయంగా ఉంటుంది.