
ఆగని శిశుమరణాలు
రాష్ట్రంలో శిశుమరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. బోధనాసుపత్రుల్లోనే వందలాది మంది శిశువులు మృతి చెందుతున్నారంటే ఇక సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
రాష్ట్రంలో ప్రతి వెయ్యి జననాలకూ 42 మంది మృతి
రిమ్స్ శ్రీకాకుళం ఆస్పత్రిలో అసలు ప్రసూతికి సంబంధించిన గదే లేదు.
కేవలం 18 శాతం ఆస్పత్రుల్లోనే మరుగుదొడ్ల సౌకర్యం ఉంది
హిందూపురం జిల్లా ఆస్పత్రి, అనంతపురం పెద్దాసుపత్రి, రిమ్స్ శ్రీకాకుళంలో సైతం మరుగుదొడ్లు లేవు
55 శాతం ఆస్పత్రుల్లో మత్తుమందు ఇచ్చే వైద్యులు లేరు
బేబీ థర్మామీటర్లు లేని ఆస్పత్రులు 91 శాతం ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశుమరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. బోధనాసుపత్రుల్లోనే వందలాది మంది శిశువులు మృతి చెందుతున్నారంటే ఇక సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేవలం సకాలంలో వైద్య సేవలు అందని కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని తేలింది. గత రెండేళ్లలో శిశుమరణాల నియంత్రణకు కనీసం రూ.200 కోట్ల కేంద్ర నిధులు ఖర్చు చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోరుుంది. కుటుంబ సంక్షేమశాఖ తాజా సర్వే ఈ విషయూలు వెల్లడించింది. సర్వే ముఖ్యాంశాలను ఓ ఉన్నతాధికారి సాక్షికి వివరించారు. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుల్లో శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో మాత్రం ప్రతి వెయ్యి జననాలకు 42 మందికి పైగానే శిశువులు మృతి చెందుతున్నట్టు తేలింది. ఏటా 10 లక్షల ప్రసవాలు జరుగుతుంటే, అందులో పుట్టిన నెలలోపే 35వేల మంది, 6 నెలల లోపు 15 వేల మంది వరకు మృతి చెందుతున్నారు.
కర్నూలు టాప్
ఒక్క కర్నూలు పెద్దాసుపత్రిలోనే ఏడాదిలో 863 శిశుమరణాలు సంభవించినట్టు సర్వేలో తేలింది. అంటే రోజూ కనీసం ముగ్గురు శిశువులు మృత్యువాత పడుతున్నారన్న మాట. ఇక ఒంగోలు ఆస్పత్రిలో 580 మంది, గుంటూరు పెద్దాసుపత్రిలో 573 మంది, కడప రిమ్స్‌లో 160 మంది శిశువులు మృతి చెందారు. ఈ మూడూ బోధనాసుపత్రులే కావడం గమనార్హం. ఇక్కడ సైతం శిశువులకు అవసరమైన వెంటిలేటర్లు, రేడియంట్ వార్మర్లు, తదితర సౌకర్యాలు లేక మరణాలు సంభవించడం గమనార్హం. బోధనాసుపత్రులు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులన్నీ కలిపి 63 శాతం ఆస్పత్రుల్లో వసతుల లేమి కారణంగానే శిశువులు మృతి చెందుతున్నట్టు సర్వే స్పష్టం చేసింది. చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం పెద్దాసుపత్రుల్లో కనీసం కాన్పు చేసేటప్పుడు వేసే టేబుళ్లు (లేబర్ టేబుల్స్) కూడా లేనట్టు తేలింది. ఒక మహిళ పురిటినొప్పులతో వస్తే ఆమెను ప్రత్యేకంగా పరిశీలించడానికి కూడా గదులు లేవు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొరత, శిక్షణ పొందిన సిబ్బంది, సహాయకులు లేకపోవడం, మౌలిక వసతులు లేక శిశువులు మృతి చెందుతున్నట్టు తేలింది.