బాబుతో ముగ్గురు మంత్రుల భేటీ | 3 ministers meet with chandra babu naidu | Sakshi
Sakshi News home page

బాబుతో ముగ్గురు మంత్రుల భేటీ

Feb 28 2014 2:12 AM | Updated on Mar 18 2019 9:02 PM

బాబుతో ముగ్గురు మంత్రుల భేటీ - Sakshi

బాబుతో ముగ్గురు మంత్రుల భేటీ

కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఆపద్ధర్మ మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు గురువారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు.

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఆపద్ధర్మ మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు గురువారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఉదయం బాబును కలిశారు. మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేశ్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, కాంగ్రెస్ నుంచి గెలిచిన రమణమూర్తి (కన్నబాబు) సాయంత్రం ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలో చేరేందుకు వారు పెట్టిన షరతులన్నింటికీ బాబు సరేనన్నట్టు సమాచారం. తాము సూచించిన వారికే టికెట్లివ్వడం, ఎన్నికల లావాదేవీలు తదితరాలపై టీడీపీకి చెందిన పారిశ్రామికవేత్తలతో ముందే చర్చోపచర్చలు సాగించిన అనంతరమే కాంగ్రెస్ నేతలంతా బాబుతో భేటీ అయ్యారు.

 

గంటా బృందాన్ని తాజా రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహనరావు, టీజీని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దగ్గరుండి బాబు నివాసానికి తీసుకొచ్చారు. అంతకుముందు వీరంతా గంటా నివాసంలో సమావేశమయ్యారు. బాబుతో అరగంట పాటు భేటీ అయ్యాక గంటా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఏరాసు, టీజీ ఇద్దరూ సీఎం రమేశ్‌తో ఆయన నివాసంలో గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మార్చి 5న నెల్లూరులో జరిగే ప్రజాగర్జనలో ఆదాల తోపాటు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించారు. ఇక గంటా బృందం మార్చి 8న విశాఖలో జరిగే మహిళా గర్జన సందర్భంగా టీడీపీలో చేరతారు. కర్నూలుకు చెందిన ఆపద్ధర్మ మంత్రులు, నేతలు స్థానికంగా జరిగే ప్రజాగర్జన సందర్భంగా పార్టీలో చేరతారు. ఎమ్మెల్యేలు శిల్పా మోహన్‌రెడ్డి, లబ్బి వెంక టస్వామి శుక్రవారం బాబును కలుస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కూడా గురువారం రాత్రి బాబును కలిశారు. కాగా వీరంతా గతంలో  వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నించారు. అయితే ఆ పార్టీలో ఖాళీ లేకపోవడంతో చివరికి టీడీపీలో చేరడం గమనార్హం.
 
 ...అందుకే టీడీపీలో చేరుతున్నాం: ఏరాసు, టీజీ
 
 బాబుతో భేటీ అనంతరం ఏరాసు, టీజీ మీడియాతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడతానని తమకెప్పుడూ చెప్పలేదన్నారు. ‘‘మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. కాబట్టి బాబు తనకున్న సంబంధాలను ఉపయోగించి సీమాంధ్రను దూర దృష్టితో స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారని మేం టీడీపీలో చేరాలని నిర్ణయించాం. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ మాదిరిగా సీమాంధ్రకు కూడా రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరాం. 1956కు ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను మేం కోరుకుంటున్నాం. కర్నూలును రాజధానిగా పరిశీలించాలని కోరాం. ఇంకా పలువురు టీడీపీలోకి వస్తారు’’ అని చెప్పారు.
 
 సినీ ప్రముఖులతో భేటీ: దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నట దర్శకుడు రవిబాబు తదితర సినీ ప్రముఖులతో బాబు గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై వారితో చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement