
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భావించిన పాక్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పీసీబీ అభ్యర్ధను తిరష్కరించినట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్దంగా లేనట్లు సమాచారం. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని పీసీబీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
"బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2021, ఐపీఎల్ ఎడిషన్లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడింది. యూఈఏలో చాలా మంది క్రికెట్ అభిమానులు దక్షిణాసియా నుంచే ఉన్నారు.
ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇరు దేశాల మైత్రి దెబ్బతింటుంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పీఎస్ఎల్‌ను నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సిద్దంగా లేదని" క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రావాల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరగడంతో పీఎస్ఎల్-2025 సీజన్‌ను పీసీబీ వాయిదా వేసింది.