
Photo Courtesy: BCCI
వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (మే 1) జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.
2011 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడుతున్న హిట్‌మ్యాన్ ఆ ఫ్రాంచైజీ తరఫున 231 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీల సాయంతో 6017 పరుగులు చేశాడు.
ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రోహిత్ తర్వాత కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. పోలీ ఎంఐ తరఫున 211 మ్యాచ్‌ల్లో 18 హాఫ్ సెంచరీల సాయంతో 3915 పరుగులు చేశాడు. పోలార్డ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.
స్కై ఈ ఫ్రాంచైజీ తరఫున 109 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 3460 పరుగులు చేశాడు. ఈ జాబితాలో స్కై తర్వాతి స్థానాల్లో అంబటి రాయుడు (2635), సచిన్ టెండూల్కర్ (2599) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (53), ర్యాన్ రికెల్టన్ (61) ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించారు.
అనంతరం స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔటయ్యారు. 15 ఓవర్ల ముగిసే సమయానికి ముంబై స్కోర్ 146/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (18), హార్దిక్ పాండ్యా (10) క్రీజ్‌లో ఉన్నారు.