ముంబై ‘సిక్సర్‌’ రాజస్తాన్‌ ‘అవుట్‌’ | Mumbai Indians beat Rajasthan by 100 runs | Sakshi
Sakshi News home page

ముంబై ‘సిక్సర్‌’ రాజస్తాన్‌ ‘అవుట్‌’

May 2 2025 3:38 AM | Updated on May 2 2025 8:48 AM

Mumbai Indians beat Rajasthan by 100 runs

వరుసగా ఆరో మ్యాచ్‌లో గెలుపు

రోహిత్, రికెల్టన్‌ అర్ధసెంచరీలు

‘ప్లే ఆఫ్స్‌’ రేసు నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ నిష్క్రమణ

ఐపీఎల్‌–2025లో ‘ప్లే ఆఫ్స్‌’ రేసుకు దూరమైన రెండో జట్టుగా రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచింది. సీజన్‌లో ఎనిమిదో పరాజయంతో ఆ జట్టు కథ ముగియగా, టాప్‌–4 బ్యాటర్లంతా చెలరేగడంతో ముంబై పట్టికలో ‘టాప్‌’కు దూసుకెళ్లిపోయింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు భారీ స్కోరు చేసే అవకాశం కల్పించిన రాయల్స్‌... ఆ తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసింది. తిరుగులేని ఆటతో చెలరేగుతున్న హార్దిక్‌ పాండ్యా బృందం ఖాతాలో ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.

జైపూర్‌: ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై తర్వాత ఇప్పుడు రాజస్తాన్‌ రాయల్స్‌ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు చేజార్చుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 100 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 

రికెల్టన్‌ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో శుభారంభం అందించగా... సూర్యకుమార్‌ యాదవ్‌ (23 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అదే జోరును కొనసాగించారు. 

రికెల్టన్, రోహిత్‌ తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 116 పరుగులు జోడించగా... సూర్య, పాండ్యా మూడో వికెట్‌కు 44 బంతుల్లో అభేద్యంగా 94 పరుగులు జత చేశారు. అనంతరం రాజస్తాన్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్‌ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ మేనేజ్‌మెంట్‌ ‘పింక్‌ ప్రామిస్‌’ పేరుతో సౌరశక్తికి సంబంధించి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించింది. దీని ప్రకారం ఆటగాళ్లంతా పూర్తిగా ‘పింక్‌’ కిట్‌ ధరించగా... బ్యాటర్‌ కొట్టే ఒక్కో సిక్స్‌కు ఆరు ఇళ్లకు సౌరశక్తి సదుపాయాన్ని కల్పిస్తారు.  

టాప్‌–4 విధ్వంసం... 
ముంబై బ్యాటింగ్‌ మొదటి నుంచీ దూకుడుగా సాగింది. ఫారుఖీ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రికెల్టెన్‌... ఆర్చర్‌ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. తీక్షణ ఓవర్లో రోహిత్‌ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. కార్తికేయ ఓవర్లో భారీ సిక్స్‌తో 29 బంతుల్లో రికెల్టన్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 31 బంతుల్లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

వీరిద్దరు 7 పరుగుల తేడాతో వెనుదిరిగిన తర్వాత సూర్య, పాండ్యా ధాటి మొదలైంది. ఫారుఖీ ఓవర్లో పాండ్యా 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్చర్‌ ఓవర్లో సిక్స్‌తో స్కోరును 200 దాటించిన సూర్య...ఆఖరి బంతికి సిక్స్‌తో ఇన్నింగ్స్‌ ముగించాడు.  

టపటపా... 
ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్‌ గెలుపు అవకాశాలు అక్కడే ముగిసిపోగా, ఆ తర్వాత లాంఛనమే మిగిలింది. గత మ్యాచ్‌ సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ (0) ఈసారి డకౌట్‌ కావడంతో రాయల్స్‌ పతనం మొదలైంది. బౌల్ట్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన యశస్వి జైస్వాల్‌ (13) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌల్ట్‌ తర్వాతి ఓవర్లో నితీశ్‌ రాణా (9) అవుట్‌ కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో పరాగ్‌ (16), హెట్‌మైర్‌ (0)లను వెనక్కి పంపించాడు. ధ్రువ్‌ జురేల్‌ (11) ప్రభావం చూపలేకపోవడంతో రాజస్తాన్‌ కుప్పకూలింది.  

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (బి) తీక్షణ 61; రోహిత్‌ (సి) జైస్వాల్‌ (బి) పరాగ్‌ 53; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 48; హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–116, 2–123. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–42–0, ఫారుఖీ 4–0–54–0, తీక్షణ 4–0–47–1, కార్తికేయ 2–0–22–0, మధ్వాల్‌ 4–0–39–0, పరాగ్‌ 2–0–12–1.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) బౌల్ట్‌ 13; వైభవ్‌ (సి) జాక్స్‌ (బి) చహర్‌ 0; నితీశ్‌ రాణా (సి) తిలక్‌ (బి) బౌల్ట్‌ 9; పరాగ్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 16; జురేల్‌ (సి అండ్‌ బి) కరణ్‌ శర్మ 11; హెట్‌మైర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 0; శుభమ్‌ దూబే (సి) బౌల్ట్‌ (బి) పాండ్యా 15; ఆర్చర్‌ (సి) బుమ్రా (బి) బౌల్ట్‌ 30; తీక్షణ (సి) సూర్య (బి) కరణ్‌ శర్మ 2; కార్తికేయ (సి) చహర్‌ (బి) కరణ్‌ శర్మ 2; మధ్వాల్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్‌) 117. వికెట్ల పతనం: 1–1, 2–18, 3–41, 4–47, 5–47, 6–64, 7–76, 8–87, 9–91, 10–117. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 2–0–13–1, బౌల్ట్‌ 2.1–0–28–3, బుమ్రా 4–0–15–2, బాష్‌ 3–0–29–0, హార్దిక్‌ పాండ్యా 1–0–2–1, కరణ్‌ శర్మ 4–0–23–3.  

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌ X హైదరాబాద్‌ 
వేదిక: అహ్మదాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement