
నెలలో భూ సమస్యలు పరిష్కారం
కలెక్టర్ క్రాంతి
కొండాపూర్(సంగారెడ్డి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ క్రాంతి అన్నారు. సోమవారం కొండాపూర్ మండలం తొగర్ పల్లి, అలియాబాద్ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద కొండాపూర్ మండలాన్ని ఎంపిక చేశామన్నారు. భూ సమస్యలు లేని మండలంగా కొండాపూర్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సదస్సులు అనంతరం నెలలోపు భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వలన భూ సమస్యలు ఏర్పడ్డాయని టీజీ ఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి విమర్శించారు. దీంతో రైతులు కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే వారన్నారు. ఈ సదస్సులో ఆర్‌డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.