
ఇందిరమ్మ ఇదేం కిరికిరి?
ప్రహసనంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ●
● పెరిగిన రాజకీయ జోక్యంతో అర్హులకు చోటు ప్రశ్నార్థకం ● నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు ● జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదానికి సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
లబ్దిదారుల ఎంపిక కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాలుగా రూపొందించారు. ఇంటి స్థలం ఉండి.. అన్ని అర్హతలు ఉన్న వారికి ఎల్–1లో చేర్చారు. ఇలా ఎల్–1 జాబితాలో ఉన్న వారికే లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రస్తుతం ఈ జాబితాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ జాబితాతో ప్రమేయం లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ లబ్ధిదారుల జాబితాల తయారీ కొలిక్కి వచ్చిందని, మంజూరు కోసం త్వరలోనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపుతామని సంబంధిత శాఖల అధికారులు పేర్కొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రహసనంగా తయారైంది. ఇందులో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో అర్హులైన నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం ప్రశ్నార్థకంగా మారింది. పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలకు 17,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇళ్ల కోసం ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించిన విషయం విదితమే. ఇలా స్వీకరించిన దరఖాస్తుల వెరిఫికేషన్ చేసి అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో అర్హులైన నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక కావడం ప్రశ్నార్థకంగా తయారైంది. స్థానికంగా ఉండే నాయకులు, చోటా మోటా నాయకులు తమకు అనుకూలమైన వారి పేర్లను అర్హుల జాబితాలో చేర్చాలని పట్టు బడుతుండటంతో ఈ జాబితా రూపకల్పన అధికారులకు తలనొప్పిగా తయారైంది.
ఇందిరమ్మ కమిటీల కిరికిరి
ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఈ కమిటీల విషయంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ ఇందిరమ్మ కమిటీల విషయంలో మంత్రి దామోదర ముందే పార్టీ జిల్లా ఇన్‌చార్జిగా నియమించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ను నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ నాయకులు తమ అనుచరులకే ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయిస్తున్నారని, .. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా చాలా చోట్ల వారి పెత్తనం నడుస్తోందని వేదికపై ఉన్న నేతలను ప్రశ్నించారు. ఇందుకు ఇందిరమ్మ కమిటీలదే ఉదాహరణ అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లోనే కాదు, ఇటు అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఇన్‌చార్జి
మంత్రి ఆమోదం కోసం..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సూచించిన వారే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సూచించిన వారి పేర్లు జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నాయి.

ఇందిరమ్మ ఇదేం కిరికిరి?