
ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మండిపడ్డారు.
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనాన్ని పచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. సూపర్ సిక్స్ అడిగితే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘‘ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పథకాల గురించి అడిగితే సంపద సృష్టి తర్వాతనే అమలు చేస్తామని అంటున్నారు. చంద్రబాబు ఆర్ధిక అరాచక వాది. కాగ్ లెక్కలను కూడా తప్పుగా మార్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనులను మాపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్లోమీడియా ఉందని ఎలా చెప్పినా జనం నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు. 7 నెలల్లోనే లక్షా 13 వేల కోట్ల అప్పు చంద్రబాబు చేశారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు’’ అని అరుణ్‌కుమార్ నిలదీశారు.
వైఎస్ జగన్ హయాంలో నీతి ఆయోగ్ ప్రకటించిన జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఏపీ ఉంది. ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి అడిగితే డబ్బులు లేవంటున్నారు. చంద్రబాబు మోసగాడనీ, ఆయన్ను నమ్మవద్దని జగన్ అనేకమార్లు చెప్పారు. జగన్ మాటలతో ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి’’ అని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ‘బాబు మోసాలను పవన్ ప్రశ్నించరా?’