
అన్నదాతలకు తీవ్ర అన్యాయం
● రైతు భరోసా కేంద్రాలను
నాశనం చేశారు
● టీడీపీ నాయకుల ఇళ్లలోకి
ఎరువుల బస్తాలు
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
పాణ్యం: దేశానికి అన్నం పెట్టే రైతులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో రైతులతో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. పెట్టుబడి వ్యయం, గిట్టుబాటు ధర, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో కాటసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులను టీడీపీ నాయకుల ఇళ్లలో ఉంచుతున్నారన్నారు. చేసేదేమి లేక రైతులు వేరే ప్రాంతానికి వెళ్లి యూరియా బస్తా రూ. 400 ప్రకారం కొనాల్సి వస్తోందన్నారు. కనీస మద్దతు ధర లేకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడడం లేదన్నారు.
సాగు నీరు అందలేదు
‘పది రోజులుగా కల్లాల్లో ధాన్యం ఉంచినా కొనుగోలు చేసేందుకు ఎవరూ రావడం లేదు’ అని కన్నీటితో తమ కష్టాలను కాటసానికి రైతులు వివరించారు. ‘సాగు నీరు సరిగ్గా రాలేదని, తెగుళ్లు ఎక్కువయ్యాయని, మందు బస్తాల రేటు చాలా పెరిగిందని.. ఇలా ఉంటే రైతులు ఏమి చేయాలి’ అని వాపోయారు. గత ప్రభుత్వంలో ఆర్‌బీకేల్లో బుకింగ్ చేస్తే ఊర్లోనే మందులు, విత్తనాలు, పనిముట్లు ఇచ్చేవారని, నాటి పరస్థితులు నేడు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు
అన్నదాత సుఖీభవ కింద రూ. 20వేలు రైతులకు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని కాటసాని అన్నారు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. మోసం చేస్తే ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారన్నారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీలు వెంకటేశ్వర్లు, పార్వతమ్మ, మల్లు జయచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రామలక్ష్మయ్య, గోపాల్‌రెడ్డి, ఉపేంద్రారెడ్డి, దేవేంద్రరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.