
అనునిత్యం నెత్తుటి చరిత్ర రచిస్తున్న రహదారులపై దుర్మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేసింది. సోమవారం విడుదలైన ఒక నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నవారికి ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్స వెనువెంటనే అందుతుంది. ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకూ చికిత్స సదుపాయం లభించటంతోపాటు వారం రోజుల వరకూ వైద్య సేవలు పొందే వెసులుబాటునిచ్చారు.
దేశంలో ఏ రోడ్డుపై ప్రమాదం జరిగినా ఈ పథకం వర్తిస్తుందని నోటిఫికేషన్ చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాక 2015 జూలైలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలను ప్రస్తావించారు. బాధితులకు చికిత్స చేయటంలో ఆస్పత్రులు వెనుకంజ వేయకుండా నగదురహిత వైద్యానికి వీలుకల్పిస్తామని ఆ సందర్భంలోనే చెప్పారు. అది ఇన్నాళ్లకు సాకారమైంది.
ప్రమాదాల నియంత్రణకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటూనేవుంది. కానీ పెద్దగా ఫలితాన్నిస్తున్న జాడ కనబడదు. ఏటా వెల్లడయ్యే గణాంకాలే ఇందుకు సాక్ష్యం. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మొన్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మాట్లాడుతూ ఏటా మన రహ దారులపై దాదాపు 4,80,000 ప్రమాదాలు సంభవిస్తున్నాయని, 1,78,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పినప్పుడు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాద మృతుల్లో 60 శాతం మంది 18–34 యేళ్ల మధ్య వయస్కులేనని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా తన మంత్రిత్వశాఖ నిస్సహాయతను కూడా వివరించారు. 2024 ఆఖరుకల్లా రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య 50 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించుకున్నా ఏమాత్రం సాధ్యపడలేదని, పైపెచ్చు అవి మరింత పెరిగాయని ఆయన ఒప్పుకున్నారు. ప్రమాదాల నివారణ మాట అటుంచి బాధితులకు సకాలంలో వైద్యసాయం అందితే చాలామందిని మృత్యుముఖం నుంచి బయటకు తీసుకురావొచ్చని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు.
ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవిస్తే చికిత్స ఆలస్యం కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ డబ్బు విదిలిస్తే తప్ప చికిత్సకు ముందుకురాని ఆస్ప త్రుల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది గమనించే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందే వెసులుబాటు కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అదికాస్తా అటకెక్కింది.
ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల బెడదపై నాలుగేళ్లక్రితం ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. 2021–30 మధ్య ఈ ఉదంతాల్లో మరణాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని లక్ష్యనిర్దేశం చేసింది. ఆ మాటెలా వున్నా కేవలం పెను వేగంతో వెళ్లే వాహనాల వల్లనే ప్రమాదాలు చోటుచేసుకుంటా యన్నది నిజం కాదు. మొన్న మార్చిలో జరిగిన సదస్సులో కేంద్రమంత్రి గడ్కరీయే ఈ విషయాన్ని అంగీకరించారు.
ఇరుకురోడ్డని, మలుపు వున్నదని, వేగం తగ్గించాలని సూచించే బోర్డులూ, మార్కింగ్‌లూ అవసరమైనచోట్ల లేకపోవటం దగ్గర్నుంచి నిర్మాణపరంగా వుండే లోపాల వరకూ అనేకానేక మైనవి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. సివిల్ ఇంజనీర్లు మొదలుకొని కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ల వరకూ ఎవరికీ దీనిపై జవాబుదారీతనం లేదు. సవివర ప్రణాళికా నివేదిక (డీపీఆర్)లు నాసిరకంగా వున్నా అడిగేవారు లేరు.
ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి రావటం వల్ల లోపాలను ముందు గానే సులభంగా పసిగట్టడం సాధ్యమవుతోంది. వాటిని అనుసరిద్దామన్న ఆలోచన కూడా రాదు. అతి తక్కువ ప్రమాదాలు జరుగుతున్న ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, స్పెయిన్ దేశాల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో గమనించి, వాటిని అమల్లోకి తెచ్చినా ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
అసలు మన రోడ్ల నాణ్యతకూ, అమ్మే వాహనాలకూ సంబంధమే లేకుండా పోయింది. అమ్మ కాలు పెంచుకోవటం కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి, బ్యాంకు లోన్ల సదుపాయం కల్పించి జనంలో వ్యామోహాన్ని పెంచటం రివాజైంది. ద్విచక్ర వాహనాలు సైతం వాయు వేగంతో పోయేలా డిజైన్ చేస్తుంటే...అవి నిండా ఇరవయ్యేళ్లు లేనివారి చేతికొస్తుంటే ప్రమాదాలు జరగటంలో వింతేముంది? రోడ్డు ప్రమాదాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం చొరవ తీసుకుని అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
కేరళ, యూపీ, నాగాలాండ్ మినహా మరే రాష్ట్రమూ రహదారి భద్రతకు సంబంధించిన విధానమే రూపొందించుకోలేదని ఆ కమిటీ నివేదిక ఎత్తిచూపింది. డ్రైవింగ్ లైసె న్సుల జారీలో, భద్రతా నిబంధనల అమలులో ప్రభుత్వాలు అలసత్వాన్ని చూపుతున్నాయని చెప్పింది. ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలూ ఈ లోపాలన్నిటినీ సరిదిద్దుకున్నాయో లేదో సందేహమే!
తొలి గంటలో చికిత్స ప్రారంభిస్తే గాయపడినవారిలో కనీసం 50 శాతంమందికి ప్రాణాపాయం తప్పుతుందని వైద్య నిపుణులంటున్న మాట. గతంలో అయితే అసలు ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆస్పత్రికి తరలించటానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. పోలీసులు తమనే అనుమాని తులుగా చూస్తారని, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందని చాలామంది భయపడేవారు.
ఇందుకు సంబంధించిన నిబంధనలు మార్చాక ఈ విషయంలో చాలా మార్పువచ్చింది. నగదు రహిత చికిత్స అందించటానికి వీలుకల్పించే చర్య ప్రశంసనీయమైనది. కానీ అంతకన్నా ముందు ప్రమాదా లకు దారితీస్తున్న పరిస్థితుల్ని చక్కదిద్దటానికి ప్రయత్నించాలి. అన్ని స్థాయుల్లో జవాబుదారీతనం నిర్ణయించాలి. అప్పుడుగానీ ప్రమాదాల నియంత్రణ సాధ్యంకాదు.