
నూజివీడు: ఆర్జియూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లోని ఇంజినీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు సోమవారం నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) పరీక్షలను రాశారు. ఈ పరీక్షలకు నాలుగు క్యాంపస్‌లలో కలిపి 10,300 మందికిపైగా విద్యార్థులు హాజరైనట్టు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఎన్‌పీటీఈఎల్ కోర్సులను ఐఐటీలు, ఐఐఎస్సీ లాంటి దేశవాళీ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల భాగస్వామ్యంతో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ రంగంలో సైతం అతి వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఉన్నవారికే సాంకేతిక రంగంలో ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్రాస్ ఐఐటీ నిర్వహిస్తున్న 500కు పైగా ఎన్‌పీటీఈఎల్ కోర్సులను నేర్చుకునేందుకు నాలుగు ట్రిపుల్ ఐటీలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఆసక్తి కనబర్చడంతో మద్రాస్ ఐఐటీతో ఆర్జీయూకేటీ ఒప్పందం చేసుకుంది.
యాక్సెలరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ నెట్‌వర్క్ అనాలసిస్, ఆప్టిమైజేషన్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్, ఆన్‌లైన్ ప్రైవసీ, బ్లాక్ చైన్, డేటాబేస్ సిస్టమ్స్, ఎథికల్ హ్యాకింగ్ తదితర అనేక సర్టిఫికెట్ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఐఐటీ మద్రాస్ రూపొందించిన ఈ కోర్సులు ప్రత్యేకమైనవి. విద్యార్థులు తమ సిలబస్ లేదా బ్రాంచ్‌కు సంబంధం లేకుండా, నేటి సాంకేతిక అవసరాలకు అనుగుణంగా అదనపు జ్ఞానం, నైపుణ్యాలను పొందడానికి ఈ కోర్సులు దోహదపడతాయి. ఈ కోర్సులను నేర్చుకోవడానికి సాధారణ ఫీజు రూ.1000 కాగా, ఆర్జీయూకేటీ విద్యార్థులకు రూ.500 రాయితీ ఇచ్చింది., మిగిలిన మొత్తం యాజమాన్యం చెల్లిస్తుండటంతో విద్యార్థులపై ఏమాత్రం ఆర్థిక భారం పడట్లేదు.
విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన డైరెక్టర్
ఇదిలా ఉండగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు. దీంతో పరీక్ష హాలులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తోటి విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు డైరెక్టర్ ఇలా పరీక్ష రాశారు.