
విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు
రంపచోడవరం: రంపచోడవరం డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో పీసా గ్రామ సభ తీర్మానాలు లేకుండా మద్యం షాపులు నడుస్తున్నాయని ఆదివాసీ సంఘాల కూటమి ప్రతినిధులు, ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తీగల బాబురావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినా పోలీస్, ఎకై ్సజ్ శాఖలు పట్టించుకోవడం లేదన్నారు. ఏజెన్సీలో పేదలు కూలికి వెళ్తే రోజుకు రూ.300 వస్తుందని, వాటిని మద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. బెల్టు షాపుల నిర్వహణకు మద్యం వ్యాపారులు, పోలీసు, ఎకై ్సజ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రంపచోడవరం డీఎస్పీ స్పందించి ఏజెన్సీలో బెల్టు షాపులు లేకుండా నిరోధించాలని కోరారు. కొన్ని చోట్ల బెల్టు షాపుల నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసులు కూడా పెట్టలేదన్నారు. బెల్టు షాపుల్లో విక్రయించే మద్యం ఏ షాపుల నుంచి వస్తుందో విచారణ జరిపి వాటి అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మండలస్థాయిలో పోలీసు అధికారుల సహకారంతో నిర్వహణ
పీసా గ్రామ సభ తీర్మానం లేకుండా గ్రామాల్లో దుకాణాల ఏర్పాటు
ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విమర్శ