
చాపాడు మండలంలో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ
చాపాడు : మండల పరిధిలోని సీతారామాపురం, కుచ్చుపాప, నరహరిపురం, అనంతపురం తదితర గ్రామాల పరిధిలోని పంట పొలాల్లో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో గత పది రోజులుగా మండలంలోని వివిధ గ్రామాలలోని పంట పొలాల్లో బోర్లు, ఫిల్టర్ల ద్వారా రిగ్గు వేసి లోపల ఉండే ఖనిజాలను అన్వేషిస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలతో జరుపుతున్న ఈ పరిశోధనలో ఆయిల్, ఇతర ముడి ఖనిజాల కోసం అన్వేషణ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎకరా పొలం పొడవునా 20 చోట్ల బోర్లు వేస్తూ అందులో అన్వేషణ చేసి వెంటనే వాటిని పూడ్చి వేస్తున్నారు. పంట పొలాల్లో జరుగుతున్న ఖనిజ అన్వేషణను స్థానిక ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.