
మార్కెట్‌లోకి పచ్చడి మామిడి
భువనగిరి: మార్కెట్‌లోకి పచ్చడి మామిడి పెద్ద ఎత్తున వస్తోంది. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ రోడ్డు పక్కన.. పచ్చడి మామిడి విక్రయాలకు పెట్టింది పేరు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు జనగాం, సిద్ధిపేట, మేడ్చల్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వినియోగదారులు ఇక్కడ కాయలు కొనుగోలు చేసుకుని తీసుకెళ్తారు. ప్రస్తుతం నీలం, నాటకు పచ్చడి కాయలు విక్రయిస్తున్నారు. కాయ రకాలు, సైజను బట్టి ఒకటి రూ.8 నుంచి రూ.12లకు అమ్ముతున్నారు. మృగశిర కార్తె ప్రారంభం వరకు అమ్మకాలు కొనసాగుతాయని వ్యాపారులు తెలిపారు.
నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామివారిన సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీ దళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన తదితర పూజలు చేశారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
స్వర్ణగిరీశుడికి తిరుపావడ సేవ
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తిరుపావడ సేవ వైభవంగా నిర్వహించారు. 450 కిలోల అన్నప్రసాదం, లడ్డూ, వడ తదితర పిండి వంటలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు.

మార్కెట్‌లోకి పచ్చడి మామిడి

మార్కెట్‌లోకి పచ్చడి మామిడి