
పట్టిసీమ నీరు విడుదల
పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం నీటిని విడుదల చేశారు. ముందుగా 24 పంపులకు పూజలు నిర్వహించి కుడి కాలువలోకి నీరు విడుదల చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం రెండు పంపుల ద్వారా కుడి కాలువలోకి నీరు విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి విడుదలను క్రమేపీ పెంచే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు.
నేడు మునిసిపల్ కార్మికుల మహాధర్నా
ఏలూరు (టూటౌన్): విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న మహాధర్నాకు మునిసిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, పారిశుద్ధ్య విభాగం వారికి 17 రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఉదయం 10 గంటలకు విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో ఈ మహాధర్నా జరుగుతుందని ఆయన తెలిపారు.