
రొయ్య రైతుల నిరసన
పాలకోడేరు: రొయ్యల తూకం సమయంలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. కాటా మోసంపై రొయ్య రైతుల సంక్షేమ సంఘం నాయకులు పాలకోడేరు మండలం గొల్లలకోడేరు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొంతమంది ట్రేడర్లు, కొనుగోలుదారులు రొయ్యలు కొనుగోలు చేసినప్పుడు కాటా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. కాటా మోసానికి పాల్పడటం వల్ల టన్ను రొయ్యలకు 60 కేజీలు నష్టం పోతున్నామన్నారు. ఈ మోసాలు బయటికి రాకుండా కొందరు రకరకాల ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. కొందరు ట్రేడర్లు, కొనుగోలుదారులు కాటా ట్యాపరింగ్ చేస్తున్నారన్నారు. కేజీ రొయ్యలకు 60 గ్రాములు ఎక్కువ వచ్చే విధంగా కాటాను ట్యాంపరింగ్ చేస్తున్నారని, లీటర్లలో వెయిట్ పెట్టి, కిలోల్లో రొయ్యలను చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్.గజపతిరాజు, ప్రధాన కార్యదర్శి జీకేఎఫ్ సుబ్బరాజు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.