
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డెలీవరి సమయంలో బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి చేరింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 28వ వార్డుకు చెందిన సంగినీడి మనోజ్, జయశ్రీ (28) దంపతులు. ఎనిమిదేళ్ల క్రితం వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం వీరికి ఒక బాబు జన్మించాడు. అనంతరం మరో బిడ్డకు జన్మనిస్తూ జయశ్రీ దురదృష్టవశాత్తూ మృతి చెందింది. మంగళవారం స్కానింగ్ తీసుకుని రమ్మని వైద్యులు సూచించడంతో స్కానింగ్ తీసుకువెళ్లారు. అంతాబాగానే ఉందని, నార్మల్ డెలీవరికి రిపోర్టులు కూడా అనుకూలంగానే ఉన్నాయని వైద్యులు చెప్పడంతో మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం డెలీవరి చేస్తుండగా పాప జన్మించినా తల్లి జయశ్రీకి అధికంగా బ్లీడింగ్ అవ్వడంతో మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. శిశువు పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఎంతో ఇష్టపడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నామని, ఇటీవల ఆమె డీఎస్పీ పరీక్షలకు కూడా హాజరైందని, ఇంతలోనే ఇలా మృతి చెందిందని భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు.

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి