
పిడుగులతో అప్రమత్తం
పాలకొల్లు సెంట్రల్: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి. పిడుగుల మూలంగా ఏటా సుమారు రెండువేల మంది చనిపోతున్నట్లు అంచనా. అలాగే పిడుగుల మూలంగా గృహోపకరణాలు కాలిపోతుంటాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో పిడుగుల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులను చూసి కొందరు చాలా భయపడతారు. దీనిని అస్ట్రఫోబియా అంటారు. పిడుగు ఒకసారి పడినచోట రెండోసారి మళ్లీ పడదనుకోవడం అపోహ మాత్రమే. ఒకే చోట ఒకే ప్రదేశంలో ఎన్నిసార్లయినా పడే అవకాశం ఉంటుంది.
పిడుగు పడిందంటే...
పిడుగు శబ్ధం వినగలమే తప్ప చూడాలంటే మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. పిడుగు పడే సమయంలో మెరుపు మేఘాల నుంచి భూమికి తాకినట్టుగా కనిపిస్తుంది. అలా తాకినప్పుడు మేఘాలలో తయారైన పాజిటివ్ శక్తి, భూమిలోని నెగెటివ్ శక్తిని చేరుతుంది. ఒకవేళ మేఘాలలో నెగటివ్ శక్తి తయారైతే అప్పుడు భూమిలో ఉన్న పాజిటివ్ శక్తిని చేరుతుంది. ఏ విధంగానైనా సర్క్యూట్ పూర్తవుతుంది. పిడుగు పడిన సమయంలో ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల ఫారన్‌హీట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కాపర్ ఎర్త్ ముఖ్యం
పిడుగుల ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే ఎత్తయిన భవనాల నుంచి లేదా టవర్లు, పొగ గొట్టాలు ఇలా ఏదైనా సరే పై నుంచి భూమిలోపలి వరకూ కాపర్ ఎర్త్‌ను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలి. ఇది దాదాపుగా కిలో మీటరు దూరంలో పడిన పిడుగును సైతం నేరుగా భూమిలోకి లాక్కునే అవకాశం ఉంటుంది. కాపర్ ఎర్త్ వేసే ముందు ఉప్పు, కర్పూర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్‌ను భూమిలోపలకు ఏర్పాటుచేయడం వల్ల ప్రమాదాలను నివారించుకునే అవకాశం ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి పిడుగులు పడే అవకాశం ఉందని సమాచారం రాగానే ప్రధానంగా పశువులు లేదా మేకలను చెట్లకింద కట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
● రహదారులపై హోర్డింగ్‌లు, ఎత్తయిన, బలహీనమైన చెట్లు కింద నిలబడరాదు.
● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఆరు బయట తిరగకూడదు.
● ఇంట్లో కేబుల్ టీవీ, కంప్యూటర్లు, ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకుండా కనెక్షన్‌లు తొలగించాలి.
● పొలం దగ్గర మైదాన ప్రాంతంలో ఉన్నట్లయితే ఎత్తయిన చెట్ల కింద నిలబడకూడదు. ట్రాక్టర్లతో పనులు నిలుపుదల చేసుకోవాలి. లేదంటే పిడుగు పడితే వాహనాల్లో ఉన్న లోహపు పరికరాలను ఆకర్షించే ప్రమాదం ఉంటుంది.
● హైటెన్షన్ వైర్లు, సెల్ టవర్లు కింద ఉండకుండా చూసుకోవాలి.
● చెరువు, కొలనులు ఉన్నట్లయితే దూరంగా ఉండాలి.
● మోటార్‌సైకిల్, స్కూటర్, సైకిల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రయాణం చేసే సమయాల్లో వాహనాలు పక్కకు ఆపి ఎత్తయిన చెట్లు పక్కన కాకుండా నిలబడడం మేలు.
● ఉరుములతో వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లో షవర్‌బాత్ చేయడం, నీళ్లతో పాత్రలు శుభ్రం చేయడం వంటి పనులను చేయకూడదు. పైపుల గుండా పిడుగు ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఇంటికి ఎర్తింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
లైట్నింగ్ అరెస్టర్ అవసరం
పిడుగు విద్యుత్ ప్రవాహం అధికంగా ఉండడం వల్ల విద్యుత్ పరివర్తకాలు, సామగ్రిని కాపాడుకోవడానికి లైట్నింగ్ అరెస్టర్ (పిడుగును అరెస్ట్ చేసేది) ఉపయోగిస్తుంటాము. ఎత్తయిన భవనాలకు కూడా ఇది అమర్చుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది. సోలార్ ప్యానల్‌లకు లైట్నింగ్ అరెస్టర్ ఏర్పాటుచేసుకోవాలి. సోలార్ ప్యానల్లోనే వీటిని బిగిస్తున్నారు. – చిటికెన రామకృష్ణ, డీఈఈ తూర్పు ప్రాంత విద్యుత్ శాఖ, పాలకొల్లు

పిడుగులతో అప్రమత్తం