
నల్ల అద్దాలపై నిర్లక్ష్యమేల?
తణుకు అర్బన్ : నల్ల అద్దాలు కలిగిన కార్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్నా రవాణా శాఖ, పోలీసు అధికారులు చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నల్ల అద్దాలు కలిగి ఉన్న కార్లలో అసాంఘిక కార్యకలాపాలు.. మద్యం అక్రమ రవాణా.. పిల్లల కిడ్నాప్‌లు.. సంఘ విద్రోహశక్తుల కదలికలను గుర్తించేందుకు వీలు పడదు. దీంతో ఈ తరహా అద్దాలను వాడకూడదని సుమారుగా పదేళ్ల క్రితమే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో అప్పట్లో రవాణా శాఖ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కార్లకు ఉన్న నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్‌లను తొలగింపజేశారు. కానీ ఇటీవల రహదారులపై తిరుగుతున్న కార్లు, ట్యాక్సీల్లో 30 శాతంపైగా నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్ ఏర్పాటుచేసుకుని లోపల ఉన్నవారు బయటకు కనిపించకూడదనే ఉద్ధేశ్యంతో హల్‌చల్ చేస్తున్నారు. మోటారు వెహికల్ యాక్ట్ 1989/100, సీఆర్‌పీసీ 188 ప్రకారం నలుపు రంగు ఫిల్మ్ వాడకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా బయటవారికి 70 శాతం విజిబులిటీ ఉండేలా ఏర్పాటుచేసుకోవాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
నల్ల అద్దాలతో యథేచ్ఛగా తిరుగుతున్న కార్లు
ప్రస్తుతం జిల్లాలో తిరుగుతున్న సుమారు లక్షన్నరకుపైగా ఉన్న కార్లలో 30 శాతం కార్లకు నల్ల అద్దాలతో తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం అక్రమ రవాణాలో కార్లకు నూరు శాతం నల్ల రంగు అద్దాలతో కార్లు తిరుగుతున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. గతనెలలో యానాం నుంచి వస్తున్న కారులో తణుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు అక్రమ మద్యాన్ని గుర్తించి పట్టుకున్న ఘటనలో సదరు కారుకు పూర్తిస్థాయిలో నల్ల అద్దాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కారు తణుకు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందే సీజ్ చేయబడి ఉంది. రహదారుల్లో ప్రయాణించే కార్లలో ఉన్న వారు రోడ్డుపై ప్రయాణించే వారికి పూర్తిగా బహిర్గతం కావాలని న్యాయస్థానం ఇచ్చిన నిషేదాజ్ఞలు కొందరు కార్ల యజమానులు పట్టించుకోకుండా యథేచ్ఛగా అదే కార్లలో తిరుగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలే కాకుండా కార్లలో చిన్నారులు ఆడుకుంటూ డోర్ లాక్ అయిపోయి లోపల ఇరుక్కుని ప్రాణాలు వదలిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి.
యథేచ్ఛగా తిరుగుతున్న నల్ల అద్దాల కార్లు
అసాంఘిక కార్యకలాపాలకు
అవకాశం ఉండే ప్రమాదం
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు కాని వైనం
చర్యలు తీసుకోవాలంటున్న ప్రజానీకం
జెడ్ ప్లస్‌కు ఓకే
ప్రముఖుల భద్రతా ప్రమాణాల్లో భాగంగా జెడ్‌ప్లస్ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ వినియోగించుకునే వెసులుబాటును న్యాయస్థానం కల్పించింది. చివరకు మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం బ్లాక్ ఫిల్మ్‌లేని వాహనాలనే వినియోగించాలనే నిబంధనలు సైతం రవాణా శాఖ నియమావళిలో పొందుపరిచారు. తప్పనిసరి పరిస్థితుల్లో గోప్యంగా ప్రయాణం చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర హోం సెక్రటరీ ఆధ్వర్యంలో డీజీపీతోపాటు ఇతర ప్రముఖ అధికారులతో కూడిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తుది నిర్ణయం ఆ కమిటీలో ఉన్న వ్యక్తులపై ఆధారపడి ఉంది.
నిబంధనలు మీరితే చర్యలు తప్పవు
కార్లకు ఉండే నల్ల అద్దాల విషయంలో కారులో ఉన్న వారిని బయటనుంచి చూసేవారికి 70 శాతం కనిపించే విధంగా ఏర్పాటుచేసుకోవాలి. నిబంధనలు మీరి వంద శాతం నల్ల అద్దాలు కలిగి ఉన్న వాహనాలకు రూ. వెయ్యి జరిమానా విధించి నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్‌ను తొలగింపజేస్తాం. నిబంధనలు పాటించకుండా రహదారులపై తిరిగే కార్లపై రానున్న రోజుల్లో స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా చర్యలు తీసుకుంటాం.
– ఎస్. శ్రీనివాస్, తణుకు మోటారు వెహికల్ ఇనస్పెక్టర్

నల్ల అద్దాలపై నిర్లక్ష్యమేల?