
పందుల పెంపకానికి ప్రత్యేక స్థలాలు
విజయనగరం అర్బన్: మున్సిపాలిటీ ప్రాంతాల్లో పందుల సమస్యను నివారించేందుకు వీలుగా వాటి పెంపకానికి ప్రత్యేక స్థలాలు కేటాయించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. మున్సిపాల్టీల్లో పందుల సమస్య పరిష్కారంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, పందుల పెంపకందారులతో కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పందుల పెంపకందారుల అభిప్రాయాలను తీసుకున్నారు. విజయనగరం కార్పొరేషన్‌లో సుమారు 1,085, బొబ్బిలిలో 45, రాజాంలో 40, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో 16 పందులు ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారని జేసీ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా మున్సిపల్ పరిధి నుంచి 5 కిలోమీటర్ల లోపల పందుల పెంపకానికి స్థలాన్ని కేటాయించాలన్నారు. విజయనగరంలో సుమారు 2 ఎకరాలు, బొబ్బిలిలో 30 సెంట్లు, రాజాంలో ఎకరా, నెల్లిమర్లలో 15 సెంట్లు స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. వెంటనే స్థలాలను గుర్తించి పెంపకం దారుల సంఘం ప్రతినిధుల అభీష్టం మేరకు సాయంత్రంలోగా వారికి కేటాయిస్తూ ఉత్తర్వులను సిద్ధంచేయాలని ఆదేశించారు. పందుల పెంపకం వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, డీపీఓ టి.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు మోహనరావు, ఆశయ్య, మెప్మా పీడీ సత్తిరాజు, విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య ఇతర మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్