గాయాలతో ఉన్న మహిళ వివరాలు లభ్యం | Sakshi
Sakshi News home page

గాయాలతో ఉన్న మహిళ వివరాలు లభ్యం

Published Thu, Mar 28 2024 7:05 AM

సిబ్బందికి పోర్టల్‌పై అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారి   - Sakshi

ధారూరు: అనుమానాస్పద స్థితిలో గాయాలతో ఉన్న మహిళ వివరాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు బుధవారం సాక్షి దినపత్రికలో ఇచ్చిన వార్తకు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం రాత్రి ధారూరు సమీపంలో స్పృహతప్పి పడిపోయిన మహిళ వివరాలను ఎస్‌ఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎస్‌ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని అవుసుపల్లి గ్రామానికి చెందిన ఇంటెంట లక్ష్మి(45)గా గుర్తించారు. ఆమె దినసరి కూలీ. మూడు రోజుల నుంచి కూలీ పనులకు వెళ్లకుండా హోలీ సందర్భంగా ఇళ్ల వద్ద పాటలు పాడుతూ ఆమె డబ్బులు తీసుకుంటుంది. ఈ క్రమంలో ధారూరులోని పిండి గిర్నికి వెళుతున్నట్లు భర్త లక్ష్మయ్యకు చెప్పి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు. రుద్రారం గ్రామంలో ఉన్న తన చెల్లెలు దగ్గరకు వెళ్లి ఉంటుందని భావించి పిల్లలతో కలిసి ఆయన నిద్రపోయారు. వార్తలో వచ్చి న ఆమె ఫొటోను చూసి గుర్తు పట్టిన భర్త పోలీసులను సంప్రదించి వివరాలను

తెలిపారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

యాలాల: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన మండల పరిధిలోని కోకట్‌ శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కోకట్‌ శివారులో చెక్‌డ్యాంలో సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తలపై తెల్లవెంట్రుకలు, ఒంటిపై నలుపు కలర్‌ టీషర్టు, ఖాకీ కలర్‌ ప్యాంటు ధరించి ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆచూకీ గుర్తించిన వారు 8712670054 సంప్రదించాలని కోరారు.

హెచ్‌ఐవీ కేసుల

నమోదుకు పోర్టల్‌

తాండూరు: హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ కేసుల నమోదును ఇక నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని హెచ్‌ఐవీ, లెప్రెసీ, టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి రవీంద్రనాయక్‌ అన్నారు. బుధవారం జిల్లా వైద్యశాఖ, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో హెల్త్‌ మేనెజ్‌మెంట్‌, ఇన్ఫర్‌మేషన్‌ సిస్టమ్‌ పోర్టల్‌పై సంబంధిత అధికారులు వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై సందేహాలు ఉన్న వారు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1097కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. వ్యాధి నియంత్రణ కోసం తాండూరులో ఐసీటీసీ కేంద్రం, డీఎస్‌ఆర్సీ కేంద్రాల ద్వారా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మూర్తి, ఏఆర్‌టీ వైద్యాధికారి సమిఉల్లా, ప్రోగ్రాం అధికారి రతన్‌లాల్‌, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులున్నారు.

Advertisement
Advertisement