తెలంగాణ జూడాలు, హౌస్ సర్జన్లకు తీపి కబురు

జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
హౌస్ సర్జన్ మెడికల్, హౌస్ సర్జన్ డెంటల్‌కు జీతాల పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పది రోజుల క్రితం జూనియర్ డాక్టర్లు జీతాలు పెంచాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
హౌస్ సర్జన్ మెడికల్, హౌస్ సర్జన్ డెంటల్‌కు 19,589 రూపాయల నుంచి రూ.22,527కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ డిగ్రీ, డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్ వారికి.. ప్రస్తుత స్టైఫండ్‌కి 15 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక నేటి ఉదయం స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు గత నాలుగు నెలలుగా తమకు సరిగా జీతాలు అందడం లేదంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ‘‘సార్ కరోనా కష్టకాలంలో మీరు ఎందరికో సహాయం చేస్తున్నారు. కానీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో నిరంతరం సేవలందిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి మాకు జీతాలు అందడం లేదు. కోవిడ్ డ్యూటీలకు హాజరైన వారికి ఇతర రాష్ట్రాల్లో ప్రోత్సహకాలు ఇస్తున్నారు. మాకు ఇలాంటివి ఏం అందడం లేదు. మా ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎలా వర్క్ చేయగలం సార్’’ అంటూ ట్వీట్ చేశారు.
We have brought this issue to Hon’ble CM’s notice and he has issued orders to Health secretary to enhance stipends of house surgeons and PGs by 15%
GOs being issued today https://t.co/A88ptZfbut
— KTR (@KTRTRS) May 18, 2021
ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాలని హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ జీవో విడుదల అవుతుందని’’ కేటీఆర్ రీట్వీట్ చేశారు. మొత్తంగా ఇవాళ మధ్యాహ్నం 15 శాతం స్టైఫండ్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చదవండి: డెత్ సర్టిఫికెట్ కోసం ‘యుద్ధం’: స్పందించిన మంత్రి కేటీఆర్
మరిన్ని వార్తలు